‘డెవిల్‌’ పాట కోసం విదేశీ వాయిద్యాలు..స్పెషలేంటో తెలుసా?

23 Sep, 2023 14:34 IST|Sakshi

ఫలితాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన కథలు, విలక్షణమైన పాత్రలను పోషిస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నాడు నందమూరి హీరో కల్యాణ్‌ రామ్‌. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘డెవిల్‌’. ‘బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్. దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్‌ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త మీనన్‌ హీరోయిన్‌.

హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ఇటీవల ‘మాయే చేసే..’పాటను రిలీజ్‌ చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. డెవిల్‌ చిత్రం  1940లోని మదరాసి ప్రెసిడెన్సీ నేపథ్యంలో సాగుతుంది. అంటే స్వాతంత్ర్యం రాక ముందు ఉన్న బ్యాక్ డ్రాప్‌తో డెవిల్ సినిమాను తెరకెక్కించారు. సన్నివేశాలు, పాటలను కూడా అలాగే చిత్రీకరించారు. కాస్ట్యూమ్స్, బ్యాగ్రౌండ్ ఇలా ప్రతీ విషయంలో మేకర్స్ పలు జాగ్రత్తలను తీసుకున్నారు. నాటి కాలాన్ని, నాటి సంగీతాన్ని తెరపై చూపించే క్రమంలో దర్శక నిర్మాత అభిషేక్ నామా దక్షిణ భారత దేశపు సహజమైన లొకేషన్లను ఎంచుకున్నారు. కారైకుడిలోని ప్యాలెస్‌లో ఈ పాటను చిత్రీకరించారు.

ఈ పాటలో  విదేశీ వాయిద్యాలు వాడారట. దక్షిణాఫ్రికా నుంచి జెంబో, బొంగొ, డీజెంబోలు.. మలేసియా నుంచి డఫ్ డ్రమ్స్.. చైనా నుంచి మౌత్ ఆర్గాన్, దర్భుకా.. దుబాయ్ నుంచి ఓషియన్ పర్‌క్యూషన్, సింగపూర్ నుంచి ఫైబర్ కాంగో డ్రమ్స్, వెస్ట్ ఆఫ్రికా నుంచి హవర్ గ్లాస్, షేప్డ్ టాకింగ్ డ్రమ్ ఇలా రకరకాల వాయిద్యాలను ఈ పాటలో వాడారు. వీటి వాడకంతోనే శ్రోతలను నాటి కాలానికి, వింటేజ్ మూడ్‌లోకి తీసుకెళ్లేలా చేయాయని చిత్ర యూనిట్‌ పేర్కొంది. నవంబర్‌ 24న ఈ చిత్రం విడుదల కానుంది. 

మరిన్ని వార్తలు