విరాట్‌ కోహ్లి 3.O.. 2023లో ఎన్నో ఘనతలు! కానీ అదొక్కటే

22 Dec, 2023 14:29 IST|Sakshi

2023.. టీమిండియా స్టార్‌ బ్యాటర్‌, రన్‌మిషన్‌ విరాట్‌ కోహ్లికి చాలా ప్రత్యేకం. ఈ ఏడాది విరాట్‌కు తన జీవితాంతం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే తన ఆరాధ్య దైవం సచిన్‌ టెండూల్కర్‌ వరల్డ్‌ రికార్డును బ్రేక్‌ చేసిన ఏడాది ఇది. ఎవరికి సాధ్యం కాదనుకున్న వన్డేల్లో అత్యధిక సెంచరీల రికార్డును బద్దలు కొట్టిన కింగ్‌ కోహ్లి.. తన పేరును క్రికెట్‌ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు.

అంతర్జాతీయ వన్డేల్లో 50 సెంచరీలు చేసిన విరాట్‌.. వరల్డ్‌క్రికెట్‌లో తానే కింగ్‌ అనే మరోసారి నిరూపించుకున్నాడు. ఇక ఈ ఏడాదిలో విరాట్‌ అత్యధిక వన్డే సెంచరీల రికార్డుతో పాటు మరిన్నో అరుదైన ఘనతలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాదిలో కోహ్లి సాధించిన రికార్డులపై ఓ లుక్కేద్దాం.

క్రిస్‌ గేల్‌ రికార్డు బద్దలు..
ఈ ఏడాది ఐపీఎల్‌లో విరాట్‌ కోహ్లి సంచలన ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్‌-2023లో విరాట్‌ రెండు అద్భుతమైన సెంచరీలతో చెలరేగాడు. తద్వారా ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు. 

కోహ్లి ఇప్పటివరకు ఈ క్యాష్‌రిచ్‌ లీగ్‌లో 7 సెంచరీలు చేశాడు. అంతకుముందు ఈ రికార్డు విండీస్‌ లెజెండ్‌ క్రిస్‌ గేల్‌(6) పేరిట ఉండేది. ఈ ఏడాది సీజన్‌తో గేల్‌ ఆల్‌టైమ్‌ రికార్డును విరాట్‌ బ్రేక్‌ చేశాడు.

తొలి ఆటగాడిగా..
ఈ ఏడాది ఐపీఎల్‌లో విరాట్‌ మరో అరుదైన ఘనతను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో 7000 పరుగులు మైలురాయిని అందుకున్న తొలి ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. ఇప్పటివరకు 229 ఐపీఎల్‌ ఇన్నింగ్స్‌లలో 7263 పరుగులు కోహ్లి చేశాడు. 

సచిన్‌ రికార్డు బ్రేక్‌..
వన్డేల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000కు పైగా పరుగులు అత్యధిక సార్లు చేసిన ఆటగాడిగా విరాట్‌ రికార్డు సృష్టించాడు. వన్డే వరల్డ్‌కప్‌లో-2023లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌లో కోహ్లి ఈ ఘనతను అందుకున్నాడు. కోహ్లి ఇప్పటివరకు 8 సార్లు ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000కుపైగా పరుగులు సాధించాడు. ఈ క్రమంలో భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌(7) ఆల్‌టైమ్‌ రికార్డును విరాట్‌ బ్రేక్‌ చేశాడు.

765 పరుగులతో..
భారత్‌ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌-2023 విరాట్‌ కోహ్లి దుమ్మురేపాడు. 11 మ్యాచ్‌లు ఆడి 765 పరుగులతో టోర్నీ టాప్‌ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. తద్వారా వన్డే వరల్డ్‌కప్‌ ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్‌ నిలిచాడు. ఈ క్రమంలో సచిన్‌ టెండూల్కర్‌(674)ను అధిగమించాడు.

పాకిస్తాన్‌పై వరల్డ్‌ రికార్డు..
వన్డేల్లో అత్యంత వేగంగా 13,000 పరుగుల మైలు రాయిని అందుకున్న ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. ఆసియాకప్‌-2023లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో సచిన్‌  టెండూల్కర్‌ను బ్రేక్‌ చేశాడు. సచిన్‌ 321 ఇన్నింగ్స్‌లలో ఈ మైలు రాయిని అందుకోగా.. కోహ్లి కేవలం 267 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఘనతను అందుకున్నాడు.

కోహ్లి 3.O..
టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి.. 2019-2022 ఏడాది మధ్య గడ్డు పరిస్ధితులను ఎదుర్కొన్నాడు. ఒకనొక దశలో జట్టులో కోహ్లి అవసరమా అన్న స్ధితికి దిగజారిపోయాడు. ఇటువంటి సమయంలో దెబ్బతిన్న సింహంలా కోహ్లి అద్బుతమైన కమ్‌బ్యాక్‌ ఇచ్చాడు.  గతేడాది డిసెంబర్‌లో ఆసియాకప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో మెరుపు సెంచరీ చేసిన విరాట్‌.. తన 1000 రోజుల నిరీక్షణకు తెరదించాడు.

ఇక అప్పటినుంచి కోహ్లి వెనక్కి తిరిగి చూడలేదు. ఈ ఏడాదిని సెంచరీతో ఆరంభించిన కోహ్లి పరుగులు వరుద పారించాడు. ఇప్పటివరకు ఈ ఏడాదిలో 27 వన్డేలు, 7  టెస్టు మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. వరుసగా 1377, 557 పరుగులు చేశాడు. ఓవరాల్‌ ఈ ఏడాదిలో 8 సెంచరీలు విరాట్‌ సాధించాడు. కాగా గతేడాది  టీ20 వరల్డ్‌కప్‌ నుంచి ఇప్పటివరకు భారత తరపున ఒక్క టీ20 మ్యాచ్‌ కూడా ఆడలేదు.

అదొక్కటే..
ఈ ఏడాదిలో ఇన్ని ఘనతలు సాధించిన కోహ్లికి ఒకటి మాత్రం అందని ద్రాక్షగా మిగిలిపోయింది. సొంత గడ్డపై జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ ట్రోఫిని ముద్దాడాలన్న కోహ్లి కల మాత్రం నెరవేరలేదు. టోర్నీ ఆసాంతం అదరగొట్టిన టీమిండియా ఆఖరి మొట్టుపై ఆస్ట్రేలియా చేతిలో బోల్తా పడింది.  ఓటమి అనంతరం కోహ్లి కన్నీరు పెట్టుకున్నది అభిమానులు ఇప్పటికి మర్చిపోలేకపోతున్నారు.

                                        

>
మరిన్ని వార్తలు