కేరాఫ్‌ లండన్‌ అంటున్న టాలీవుడ్‌ స్టార్స్‌

30 Jul, 2022 08:41 IST|Sakshi

కొత్త క్యారెక్టర్ల కోసం కొందరు హీరో హీరోయిన్లు  కేరాఫ్‌ లండన్‌ అంటున్నారు. వెకేషన్‌కి కూడా కొందరు లండన్‌ నే సెలక్ట్‌ చేసుకున్నారు. ఈ లండన్‌  ట్రిప్, షూటింగ్స్‌ గురించి తెలుసుకుందాం.

గూఢచారిగా లండన్‌ లో ఓ మిషన్‌ ను టేకప్‌ చేశారట హీరో వరుణ్‌ తేజ్‌. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మేజర్‌ షూటింగ్‌ను లండన్‌లో ప్లాన్‌  చేశారని తెలిసింది. స్పై బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ యాక్షన్‌  థ్రిల్లర్‌కు ‘బాడీగార్డ్‌’ అనే టైటిల్‌ అనుకుంటున్నారనే ప్రచారం కూడా ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ఈ యాక్షన్‌  ఫిల్మ్‌ను బీవీఎస్‌ఎన్‌  ప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

మరోవైపు ప్రేమకోసం ఇటీవలే లండన్‌  వీధుల్లో తిరిగొచ్చారు హీరో నాగశౌర్య. నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్‌ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఫలానా అబ్బాయి...ఫలానా అమ్మాయి’. ‘కళ్యాణ వైభోగమే’ (2016) చిత్రం తర్వాత మళ్లీ నాగశౌర్య, మాళవికా నాయర్‌ జంటగా నటిస్తున్న సినిమా ఇది. ఈ చిత్రకథ ప్రకారం విదేశాల్లో తెరకెక్కించాల్సిన సన్నివేశాలను ఇటీవల లండన్‌లో చిత్రీకరించారు. టీజీ విశ్వప్రసాద్, దాసరి పద్మజ నిర్మిస్తున్న ఈ సినిమాకు వివేక్‌ కూచిభొట్ల సహనిర్మాత.  కాగా ‘ఊహలు గుసగుసలాడే’(2014), ‘జ్యో అచ్యుతానంద’ (2016) చిత్రాల తర్వాత హీరోగా నాగశౌర్య, దర్శకుడిగా అవసరాల శ్రీనివాస్‌ కాంబినేషన్‌ లో వస్తున్న ఈ సినిమా విడుదల తేదీపై త్వరలో ఓ స్పష్టత రానుంది.

ఇక ఆల్రెడీ లండన్‌ వెళ్లొచ్చిన హీరోల జాబితాలో నిఖిల్‌ కూడా ఉన్నారు. ‘స్వామి రారా’ (2013), ‘కేశవ’ చిత్రాల తర్వాత హీరో నిఖిల్, దర్శకుడు సుధీర్‌ వర్మ కాంబినేషన్‌ లో ఓ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించిన మేజర్‌ షూటింగ్‌ లండన్‌లోనే జరిగింది. గత ఏడాది నవంబరులో లండన్‌ లొకేషన్స్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. బీవీఎస్‌ఎన్‌  ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇక ప్రేయసి కోసం లండన్‌  వరకు వెళ్లారు హీరో శివ కార్తికేయన్‌ . ‘జాతి రత్నాలు’ ఫేమ్‌ కేవీ అనుదీప్‌ దర్శకత్వంలో శివ కార్తికేయన్‌ హీరోగా తెలుగు, తమిళంలో ‘ప్రిన్స్‌’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా కథ మేజర్‌గా పాండిచ్చేరి, లండన్‌  నేపథ్యంలో సాగుతుంది. ఫస్ట్‌ హాఫ్‌ కథ పాండిచ్చేరిలో, సెకండాఫ్‌ లండన్‌  నేపథ్యంలో ఉంటుందట. ఇందులో ఉక్రెయిన్‌  బ్యూటీ ర్యాబోషప్క హీరోయిన్‌గా నటిస్తున్నారు. సునీల్‌ నారంగ్, డి. సురేష్‌బాబు, పుస్కూర్‌ రామ్మోహన్‌  రావు నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది దీపావళి సందర్భంగా విడుదల కానుంది.

లండన్‌ డైరీస్‌
షూటింగ్‌లకే కాదు.. తారల హాలిడే స్పాట్‌కు లండన్‌  ఫేవరెట్‌గా మారింది. వెకేషన్‌లో భాగంగా ఇటీవల లండన్‌  వెళ్లారు మహేశ్‌బాబు. అట్నుంచి స్విట్జర్లాండ్‌ వెళ్లారు. భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి మహేశ్‌ ఈ ట్రిప్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం యాడ్‌ షూట్స్‌తో బిజీగా ఉన్న అల్లు అర్జున్‌  రీసెంట్‌ హాలిడే లండన్‌ లోనే గడిచింది. ఫ్యామిలీతో దాదాపు 30 రోజులకి పైగా అల్లు అర్జున్‌  లండన్‌ లో హాలిడేను ఎంజాయ్‌ చేశారు. మరోవైపు హాలిడే మోడ్‌లో ఉన్న పూజా హెగ్డే రెండు వారాలు లండన్‌లో స్పెండ్‌ చేసి, రెండు రోజుల క్రితం అమెరికా వెళ్లారు. వీరే కాదు.. ఇటీవల లండన్‌ చుట్టొచ్చిన తారలు కొందరు ఉన్నారు.  

మరిన్ని వార్తలు