Manisha Yadav: 'నాకు ఫ్యామిలీ ఉంది.. అలాంటి డైరెక్టర్‌తో పనిచేయను'

29 Nov, 2023 07:49 IST|Sakshi

వివాదస్పద నటిగా ముద్ర వేసుకున్న నటి మనీషా యాదవ్‌. బాలాజీ శక్తివేల్‌ దర్శకత్వం వహించిన వళక్కు ఎన్‌ 18/9 చిత్రం ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మకు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. అలా ఒరు కుప్పం కాదల్‌తో పాటు పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా దర్శకుడు శీను రామసామి దర్శకత్వంలో ఇదమ్‌ పొరుల్‌ యావళ్‌ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపిక చేశాక.. ఊహించని విధంగా మూవీ నుంచి తొలగించారు. దీనికి ప్రధాన కారణం ఆమె సహకరించడం లేదని.. తనను ఇబ్బందులకు గురి చేశారన్నది డైరెక్టర్‌ ఆరోపించారు.

లైంగిక ఆరోపణలు..

అయితే 'ఇదం పొరుల్ యావల్' సినిమా సమయంలో నటి మనీషా యాదవ్‌పై లైంగిక వేధింపులకు ప్రయత్నించాడని దర్శకుడు శీను రామసామిపై ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఆమె స్థానంలో నందితా శ్వేత ఈ చిత్రంలో నటించారు. అయితే ఈ మూవీ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నా ఇప్పటికీ రిలీజ్ కాలేదు. అయితే ఇటీవలే ఆమె మరోసారి రామస్వామి చిత్రంలో నటించనుందంటూ వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే మనీషా యాదవ్ స్పందించింది. అలాంటి వారితో సినిమాలు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఇటీవలే ఓ పాత్ర కోసం మనీషాను  సంప్రదించారన్న ప్రశ్నకు కాస్తా ఘాటుగానే బదులిచ్చింది.

మనీషా మాట్లాడుతూ.. కొద్ది రోజుల క్రితం శీను రామస్వామి ఆఫీస్ నుంచి నాకు కాల్ వచ్చింది. ఆయన కొత్త సినిమాలో నటిస్తావా అని అడిగారు. తాను ఆ చిత్రంలో నటించనని మొహం మీదే చెప్పేశా.  కానీ'ఇదం పొరుల్ యేవల్'  మూవీ సమయంలో అతను ప్రవర్తించిన తీరు చాలా దారుణంగా ఉంది. తప్పుడు ఉద్దేశ్యంతో చాలాసార్లు సన్నిహితంగా ఉండాలని ప్రయత్నించాడు. కానీ నేను అతని కోరికలను అంగీకరించలేదు. అందుకే నన్ను సినిమా నుంచి తప్పించాడు. నాపై తప్పుడు ప్రచారం చేశాడు. నాకు నటించడం తెలియదని సినీ పరిశ్రమలో దుష్ప్రచారం చేశాడని' తెలిపింది

తాను పెద్ద దర్శకులతోనే చాలా చిత్రాలు చేశానని.. అయితే ప్రతిభ ఉన్నా.. ఇలాంటి మానవత్వం లేని దర్శకుల చిత్రాలలో నటించాల్సిన అవసరం తనకు లేదని పేర్కొన్నారు. 'ఒరు కుప్ప కథై' ఆడియో లాంఛ్‌ కార్యక్రమంలో అందరిలాగే మర్యాదపూర్వకంగా ధన్యవాదాలు తెలిపినట్లు వెల్లడించింది. అంతే కానీ ఆయన సినిమాలో నటించడం జరగదన్నారు. తనకు మంచి భర్త, కుటుంబం, స్నేహితులు ఉన్నారని నటి మనీషా యాదవ్‌ పేర్కొంది. నాలాంటి కొత్త హీరోయిన్‌లకు ఇలాంటి చెడు అనుభవాలు ఎప్పుడూ ఎదురు కాకూడదని అన్నారు. 

మరిన్ని వార్తలు