అందుకే నాకు బాయ్‌ఫ్రెండ్‌ ఉండరట!

31 Jul, 2022 03:12 IST|Sakshi

– మృణాళ్‌ ఠాకూర్‌ 

‘‘వైవిధ్యమైన పాత్రల్లో ఆడియన్స్‌ నన్ను చూడాలని కోరుకుంటున్నాను. అందుకే నా పాత్రల ఎంపిక ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేసేలా ఉండాలనుకుంటాను’’ అని అన్నారు మృణాళ్‌ ఠాకూర్‌. దుల్కర్‌ సల్మాన్, మృణాళ్‌ ఠాకూర్‌ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సీతారామం’. వైజయంతీ మూవీస్‌ సమర్ప ణలో స్వప్న సినిమాపై అశ్వనీదత్‌ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 5న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా    మృణాళ్‌ ఠాకూర్‌ చెప్పిన విశేషాలు.

► ‘సీతారామం’ స్క్రిప్ట్‌ విన్న వెంటనే ఇందులోని సీతామహాలక్ష్మి పాత్ర చేయడానికి అంగీకరించాను. వైజయంతీ బేనర్‌ నిర్మించిన ‘మహానటి’ సినిమా నాకు చాలా ఇష్టం. ఈ చిత్రదర్శకుడు నాగ్‌ అశ్విన్‌తో నాకు ముందే పరిచయం ఉంది. ‘మహానటి’ మెల్‌బోర్న్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ స్క్రీనింగ్‌ అప్పుడు ఆయన్ను నేను కలిశాను. నేను హిందీలో యాక్ట్‌ చేసిన ‘లవ్‌ సోనియా’ చిత్రం అదే ఫిల్మ్‌ ఫెస్టివల్‌       స్క్రీనింగ్‌కు ఎంపిక కావడంతో వెళ్లాను. ‘మహానటి’లో కీర్తీ సురేశ్‌ అద్భుతంగా నటించారు. ఇలాంటి పాత్రను నేను       ఎందుకు చేయలేకపోయానా అని అసూయపడ్డాను.

►‘సీతారామం’లాంటి మంచి సినిమా ద్వారా తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం అవుతున్నందుకు సంతోషంగా ఉంది. హిందీలో నా తొలి చిత్రం ‘లవ్‌ సోనియా’ విడుదలైన తర్వాత నాకు పెద్దగా ఆఫర్స్‌ రాలేదు. కానీ ‘సీతారామం’ ట్రైలర్‌ విడుదల తర్వాత నాకు తెలుగు, హిందీలో కొత్త ఆఫర్స్‌ వస్తుండటం సంతోషంగా ఉంది.   హిందీలో ‘కుంకుమ భాగ్య’ అనే సీరియల్‌ చేశాను. ఇది తెలుగులో కూడా డబ్‌ అయింది. ఇందులో నా క్యారెక్టర్‌కు కాస్త రొమాంటిక్‌ టచ్‌   ఉంటుంది. మళ్లీ కొంత గ్యాప్‌ తర్వాత ఇప్పుడు ‘సీతారామం’ అనే రొమాంటిక్‌ ఫిల్మ్‌ చేశాను.        ‘కుంకుమ భాగ్య’ సీరియల్‌లో నా అక్క పాత్రలో నటీమణి మధురాజా నటించారు. సీతామహాలక్ష్మి పాత్రకు ఆమెను కాస్త స్ఫూర్తిగా తీసుకున్నాను. ‘సీతారామం’ రిలీజ్‌ తర్వాత ఆడియన్స్‌ నన్ను     మృణాళ్‌గా కన్నా కూడా సీతగానే గుర్తు పెట్టుకుంటారనుకుంటున్నాను. ఈ సినిమా కోసం నేను బరువు కూడా పెరిగాను.

►ఓ సినిమాకు నాలుగో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా నా జర్నీ ఇండస్ట్రీలో మొదలైంది. ఆ సినిమాకు నాకు పారితోషికం కూడా అందలేదు. నేను యాక్టర్‌ అవుతానని అప్పట్లో ఊహించలేదు. పైగా తెలుగు హీరోయిన్‌ అవుతానని నేను అనుకోలేదు. రేపు నా బర్త్‌ డే. ‘సీతారామం’ రిలీజ్‌కు రెడీ అయ్యింది. అందుకే ఈ సినిమానే నా బెస్ట్‌ బర్త్‌ డే గిఫ్ట్‌గా భావిస్తున్నాను.  

►నాకు కొన్ని లవ్‌ లెటర్స్‌ వచ్చాయి (నవ్వుతూ..). కానీ ప్రజెంట్‌ నా ఫోకస్‌ అంతా ‘సీతారామం’ పైనే. ప్రమోషన్స్, షూటింగ్స్‌ కోసం ఇవాళ ముంబైలో ఉంటావు. రేపు హైదరాబాద్‌ వెళ్తావు. ఇలా ఉంటే నీకు బాయ్‌ఫ్రెండ్‌ ఉండరు.. ఎవరు ఉంటారు?’ అని నా స్నేహితులు సరదాగా ఆటపట్టిస్తుంటారు.  

►హిందీలో నేను చేసిన ‘ఫిపా’, ‘పూజా మేరీ జాన్‌’ సినిమాల చిత్రీకరణలు పూర్తయ్యాయి. ఆదిత్యా రాయ్‌ కపూర్‌తో ఓ ప్రాజెక్ట్‌ చేస్తున్నాను.     

మరిన్ని వార్తలు