Naa Nee Prema Katha Movie Review: నా నీ ప్రేమ కథ సినిమా ఎలా ఉందంటే?

1 Sep, 2023 21:13 IST|Sakshi
Rating:  

రివ్యూ : ‘నా నీ ప్రేమ కథ’
తారాగణం : అముద శ్రీనివాస్‌, కారుణ్య చౌదరి, రమ్య శ్రీ, అజయ్‌ ఘోష్‌, షఫీ, ఫిష్‌ వెంకట్‌, అన్నపూర్ణమ్మ తదితరులు
రచన, దర్శకత్వం: అముద శ్రీనివాస్‌
కెమెరా : ఎంఎస్‌ కిరణ్‌ కుమార్‌
సంగీతం : ఎమ్‌ ఎల్‌ పి రాజా
ఎడిటర్‌ : నందమూరి హరి
నిర్మాణం: పిఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
నిర్మాత: పోత్నాక్‌ శ్రవణ్‌ కుమార్‌

కథ
నాని (అముద శ్రీనివాస్‌) చిన్న గ్రామంలో పేపర్‌బాయ్‌గా పని చేస్తాడు. అజయ్‌ ఘోష్‌ గ్రామ పెద్ద. ఆయన కూతురు నందిని (కారుణ్య) హైదరాబాద్‌లో డాక్టర్‌ చదివి, స్వగ్రామంలో ఆసుపత్రిని నిర్మించి గ్రామ ప్రజలకు సేవ చేయాలని సొంతూరుకి తిరిగొస్తుంది. నాని నందినిని ప్రేమిస్తాడు. గుణ(షఫీ) కూడా నందినిని ప్రేమిస్తాడు. ఈ విషయం తెలుసుకుని నందిని తండ్రి నాయుడు (అజయ్‌ ఘోష్‌) నానిని చంపాలనుకుంటాడు. అదే అమ్మాయిని ప్రేమిస్తున్న గుణ (షఫి) నాని రక్షిస్తాడు. తను ప్రేమిస్తున్న అమ్మాయిని మరో వ్యక్తి ప్రేమిస్తున్నాడని తెలిసి కూడా అతన్ని రక్షించడం.. తనలో వచ్చిన మార్పా? లేక నమ్మించి గొంతు కోసేందుకు ప్లాన్‌ చేశాడా? తర్వాత ఏం జరిగింది? చివరికి నాని, నందిని పెళ్లి చేసుకున్నారా? లేదా? అన్నది మిగతా కథ.

విశ్లేషణ
ఇది ముగ్గురి మధ్య సాగే ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ. నానిని రక్షించిన సమయంలో గుణలో వచ్చిన మార్పు, దాని వెనకున్న సస్పెన్స్‌ను దర్శకుడు బాగా డీల్‌ చేశాడు. అయితే ఇక్కడ దర్శకుడే హీరో కావడం సినిమాకు కొంత మైనస్‌గా మారింది. అటు హీరో పని, ఇటు దర్శకుడి బాధ్యత రెండూ తన భుజాన వేసుకోవడంతో అక్కడక్కడా పట్టు తప్పిపోయాడు. రెండింటిని సక్రమంగా నిర్వర్తించాలన్న ఒత్తిడి ఎక్కువ కావడంతో అక్కడక్కడా డైరెక్షన్‌ మీద పట్టు తప్పినట్లు అనిపిస్తుంది.

హీరో పాత్రలో బాగానే నటించాడు, కానీ హీరో స్థానంలో మరొకరిని తీసుకుని ఉండుంటే అతని మీద ఒత్తిడి తగ్గి అవుట్‌పుట్‌ ఇంకాస్త మెరుగ్గా వచ్చేది. గ్రామీణ ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా అముద శ్రీనివాస్‌, కారుణ్య చౌదరి పర్వాలేదనిపించారు. సిటీలో డాక్టర్‌ చదివి వచ్చినప్పటికీ గ్రామీణ మూలాలు మరచిపోకుండా సాంప్రాదాయంగా కనిపించడంలో కారుణ్య వంద శాతం సక్సెస్‌ అయింది. షఫీ గుణ పాత్రలో చక్కగా సెట్టయ్యాడు. అజయ్‌ఘోష్‌ తదితరులు తమ పాత్రల మేరకు న్యాయం చేశారు.

టెక్నికల్‌ విషయాలకు వస్తే...
దర్శకుడు ప్రేమ, భావోద్వేగపు సన్నివేశాలను అద్భుతంగా మలచాలని ప్రయత్నించాడు, కానీ కొంతమేరకే సఫలీకృతమయ్యాడు. స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. కెమెరా పనితీరు బానే ఉంది. కానీ, సినిమాలో అక్కడక్కడా దృశ్యాలు డల్‌గా అనిపించాయి. ఎడిటింగ్‌ పర్వాలేదు. నేపథ్య సంగీతం బాగా కుదిరింది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ బాగుంది. నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ పడినట్లు అనిపించదు. రొటీన్‌ ప్రేమకథే కావడంతో చాలా సన్నివేశాలను ప్రేక్షకుడు ముందుగానే పసిగట్టేస్తాడు.

చదవండి: Kushi Movie Review: ‘ఖుషి’మూవీ రివ్యూ

Rating:  
(2.5/5)
మరిన్ని వార్తలు