త్రిష చిత్రంలో నయనతార?.. ఆ పాత్రకు అంగీకరిస్తారా..?

9 Oct, 2022 09:42 IST|Sakshi

ఒకే చిత్రంలో ఇద్దరు అగ్ర హీరోయిన్లు నటిస్తే ఆ చిత్రానికి వచ్చే క్రేజే వేరే లెవల్‌ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అలాంటి వార్త ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో వైరల్‌ అవుతుంది. ప్రస్తుతం దక్షిణాదిలోనే అగ్ర కథానాయకిగా రాణిస్తున్న నటి నయనతార. లేడీ ఓరియంటెడ్‌ కథా చిత్రాలకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్న ఈమె తాజాగా బాలీవుడ్‌లోకి రంగ ప్రవేశం చేశారు. షారూఖ్‌ఖాన్‌ జవాన్‌ చిత్రం ఇటీవలే షూటింగ్‌ పూర్తి చేసుకుంది. అదే విధంగా తెలుగులో చిరంజీవి కథానాయకుడుగా నటించిన గాడ్‌ ఫాదర్‌ చిత్రంలో ఆయనకు సోదరిగా కీలకపాత్రను పోషించారు. ఈ చిత్రం ఇటీవల తెరపైకి వచ్చింది.

కాగా ఈ లేడీ సూపర్‌స్టార్‌ను మరో స్టార్‌ హీరోయిన్‌ త్రిషతో కలిసి ఒక చిత్రంలో నటింపచేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంలో యువరాణి కుందవైగా నటించిన త్రిష మంచి ప్రశంసలను అందుకుంటున్నారు. 40 ఏళ్ల వయసు టచ్‌ చేస్తున్నా ఇప్పటికీ చెక్కుచెదరని అందాలతో అభిమానులను అలరిస్తున్న ఈమె ఇప్పటికీ కథానాయకిగానే నటిస్తున్నారు. కాగా తమిళ సినిమాలో అగ్ర కథానాయకిలుగా రాణిస్తున్న నయనతార, త్రిష ఇప్పటి వరకు ఒక చిత్రంలో కూడా కలిసి నటించలేదు.

ఈ మధ్య అలాంటి సందర్భం వచ్చినా అది సెట్‌ కాలేదు. నయనతార తన భర్త విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో నటించిన కాత్తు వాక్కుల రెండు కాదల్‌ చిత్రంలో నటి త్రిష కూడా నటించాల్సింది. అందుకు గాను త్రిషతో చర్చలు కూడా జరిగాయి. అయితే కొన్ని కారణాల వల్ల త్రిష ఆ చిత్రంలో నటించడానికి అంగీకరించలేదు. ఆ తరువాత ఆ పాత్రలో సమంత నటించారు. కాగా ప్రస్తుతం త్రిష తమిళం, మలయాళం భాషల్లో రూపొందుతున్న రామ్‌ అనే చిత్రంలో మోహన్‌లాల్‌కు జంటగా నటిస్తున్నారు. జీతు జోసెఫ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెస్తున్నట్లు సమాచారం. కాగా ఇందులో మరో నాయకితో చర్చలు జరుగుతున్నట్లు టాక్‌. చిత్ర తొలి భాగం క్లైమాక్స్‌ సన్నివేశాలు నయనతార, త్రిష కలిసే సన్నివేశాలు చోటు చేసుకుంటాయని, రెండవ భాగంలో నయనతార పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందని సమాచారం. అయితే ఇందులో నటించడానికి నయనతార అంగీకరిస్తారా..? అన్నది వేచి చూడాల్సిందే.   

మరిన్ని వార్తలు