డ్రగ్స్‌ కేసు చార్జిషీట్‌: రియా చక్రవర్తి సహా 33 మంది..

5 Mar, 2021 14:52 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో డ్రగ్స్‌ కోణం వెలుగు చూడటంతో మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం(ఎన్‌సీబీ) రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. డ్రగ్స్‌కు, బాలీవుడ్‌కు ఏమైనా లింకులున్నాయా? అన్న కోణంలో ఎన్‌సీబీ ప్రత్యేక విచారణ చేపట్టింది. ఈ క్రమంలో డ్రగ్స్‌ కేసు ఆరోపణలు ఎదుర్కొన్న బాలీవుడ్‌ నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తిని పోలీసులు అరెస్ట్‌ కూడా చేశారు. కొన్ని నెలలుగా విచారణ ముమ్మరం చేసిన ఎన్‌సీబీ శుక్రవారంనాడు ముంబైలోని ప్రత్యేక కోర్టులో చార్జిషీటు దాఖలు చేసింది. ఏఎన్‌ఐ వార్తాసంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ చార్జిషీటులో రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్‌తో పాటు 33 మంది నిందితుల పేర్లను ప్రస్తావించింది. 200 మంది సాక్ష్యుల నుంచి సేకరించిన సమాచారాన్ని జత చేస్తూ 12 వేల పేజీలకు పైగా ఉన్న చార్జిషీటును కోర్టుకు సమర్పించింది.

కాగా గతేడాది జూన్‌ 14న సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో డ్రగ్స్‌ కోణం వెలుగు చూడగా సెప్టెంబర్‌ 8న ఎన్‌సీబీ అధికారులు రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్‌ను అరెస్ట్‌ చేశారు. తర్వాతి నెలలోనే వీళ్లిద్దరూ బెయిల్‌ మీద బయటకు వచ్చారు. కానీ తర్వాత ఈ డ్రగ్స్‌ కేసుకు బీటౌన్‌లో లింకులు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో సెలబ్రిటీలు దీపిక పదుకునే, శ్రద్దా కపూర్‌, ఫిరోజ్‌ నదియావాలా సహా పలువురి పేర్లు తెర మీదకు రావడం అప్పట్లో సంచలనంగా మారింది.

చదవండి: సుశాంత్‌ వదిలేసుకున్న బ్లాక్‌బస్టర్‌ సినిమాలు!

భావోద్వేగం: సుశాంత్‌ రాసుకున్న లేఖ వైరల్‌

మరిన్ని వార్తలు