ఆస్కార్‌... కొత్త రూల్స్‌

10 Sep, 2020 02:49 IST|Sakshi

96వ ఆస్కార్‌ అవార్డు నుంచి ఉత్తమ చిత్రానికి సంబంధించిన ఎంపిక విధానం, అందులోని పలు రూల్స్‌ను మారుస్తున్నట్టు ప్రకటించింది అకాడమీ ఆఫ్‌ మోషన్స్‌ పిక్చర్స్‌ అండ్‌ ఆర్ట్స్‌. 2024లో 96వ ఆస్కార్‌ వేడుక జరగనుంది. అప్పటినుంచి కొత్త విధానం అమలులోకి వస్తుంది. అకాడమీ ఏర్పాటు చేసిన కొత్త నియమ, నిబంధనలు పాటించిన చిత్రాలను మాత్రమే ఉత్తమ చిత్రానికి ఎంపిక చేయాలనుకుంటోంది కమిటీ. ఇక నిబంధనల విషయానికి వస్తే...ఆస్కార్‌కు ఉత్తమ చిత్రంగా ఎంపికవ్వాలంటే... ఓ సినిమాలోని ప్రధాన పాత్ర లేదా సహాయ పాత్ర తప్పకుండా భిన్న వర్గాలకు సంబంధించినది అయి ఉండాలి.

కథలోని ఐడియా తక్కువ ప్రాతినిధ్యం వహించిన వర్గానికి సంబంధించింది అయి ఉండాలి. అంతే కాదు చిత్రబృందంలోనూ వివిధ వర్గాలకు సంబంధించినవాళ్లను భాగం చేయాలి. ఇలా పలు నియమాలు పెట్టింది ఆస్కార్‌. ఈ నియమాలన్నింటినీ పాటిస్తేనే ఉత్తమ చిత్రం విభాగానికి సినిమా ఎంపికవుతుంది. అన్ని వర్గ, వర్ణ, లింగ బేధాలను సమానంగా ఉంచేందుకు, సినిమాల్లో భిన్నతను పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకుందట కమిటీ. ఈ నియామాలను కేవలం సినిమాలో మాత్రమే కాదు, సినిమా చేసే టీమ్, స్టూడియో అన్నింట్లోనూ పాటించాలని పేర్కొంది.

మరిన్ని వార్తలు