Tollywood: రారండోయ్‌.. పరిచయం చేస్తాం

5 Jan, 2022 03:12 IST|Sakshi

టాలీవుడ్‌ది పెద్ద మనస్సు...  ఎంతమంది వచ్చినా ఎస్సు అంటుంది. మామూలుగా పరభాషా నాయికలు, విలన్లు ఇక్కడికి వస్తుంటారు. ఇప్పుడు పరభాషా హీరోలు ఇక్కడ హీరోలుగా పరిచయం కానున్నారు. అంతేనా...  పరభాషలో హీరోలుగా దూసుకెళుతున్నవాళ్లు ఇక్కడ సహాయనటులుగా, విలన్లుగా పరిచయం కానున్నారు. ‘రారండోయ్‌ పరిచయం చేస్తాం’ అంటూ అందరికీ అవకాశం ఇస్తోంది టాలీవుడ్‌. ఈ పరిచయాలు పెరగడానికి ఓ కారణం పాన్‌ ఇండియన్‌ సినిమాలు. ఏది ఏమైనా ఇతర భాషల్లో లేనంతగా తెలుగులో పరభాషలవారికి అవకాశాలు దక్కుతున్నాయి. ఆ స్టార్స్‌ గురించి తెలుసుకుందాం.

తమిళ స్టార్‌ హీరో విజయ్‌ చేసిన ‘మాస్టర్‌’, ‘బిగిల్‌’, ‘సర్కారు’, ‘మెర్సెల్‌’ వంటి చిత్రాలు తెలుగులో అనువాదమై, మంచి వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు విజయ్‌ స్ట్రయిట్‌ తెలుగు ఫిల్మ్‌ చేయనున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్‌ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా రూపొందనుంది. మరో తమిళ స్టార్‌ ధనుష్‌ అయితే ఒకేసారి రెండు తెలుగు సినిమాలు కమిట్‌ కావడం విశేషం. శేఖర్‌ కమ్ముల, వెంకీ అట్లూరి దర్శకత్వాల్లో ఆయన సినిమాలు చేయనున్నారు.

ధనుష్‌ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందనున్న ‘సర్‌’ (తమిళంలో ‘వాతి’) సినిమా షూటింగ్‌ ఈ నెల 5న ప్రారంభం కానుంది. అలాగే శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో చేయాల్సిన సినిమా షూటింగ్‌ మార్చిలో ఆరంభమవుతుందట. ఇక తమిళంలో కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకుని, హీరోగా మారిన శివకార్తికేయన్‌ తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న చిత్రానికి ఇటీవలే సైన్‌ చేశారు.

‘జాతిరత్నాలు’ వంటి మంచి హిట్‌ ఇచ్చిన కేవీ అనుదీప్‌ ఈ చిత్రానికి దర్శకుడు. అలాగే సంగీతదర్శకుడిగా, ఎడిటర్‌గా నిరూపించుకుని, హీరోగా చేస్తున్న విజయ్‌ ఆంటోని ఇప్పటివరకూ డబ్బింగ్‌ చిత్రాల ద్వారా తెలుగు తెరపై కనిపించారు. ఇప్పుడు తెలుగులో స్ట్రయిట్‌ సినిమా ఒప్పుకున్నారు. అయితే సోలో హీరోగా కాదు.. మరో హీరోతో కలిసి ‘జ్వాల’లో నటిస్తున్నారు. ఆ మరో నటుడు ఎవరంటే.. ‘బ్రూస్‌లీ’, ‘సాహో’ చిత్రాల్లో ఓ రోల్‌ చేసిన అరుణ్‌ విజయ్‌ అన్నమాట. ఈ ఇద్దరూ హీరోలుగా ‘జ్వాల’ (తమిళంలో ‘అగ్ని సిరగుగళ్‌’ టైటిల్‌) చేస్తున్నారు. ఈ చిత్రానికి నవీన్‌ దర్శకుడు. అటు మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌కి ఎంత పాపులారిటీ ఉందో తెలిసిందే.

కీర్తీ సురేష్‌ చేసిన ‘మహానటి’ చిత్రంలో జెమినీ గణేశన్‌ పాత్రలో ఆకట్టుకున్నారు దుల్కర్‌. ఇప్పుడు దుల్కర్‌ సల్మాన్‌ తెలుగు, మలయాళ, తమిళ భాషల్లో ఓ సినిమా చేస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా దుల్కర్‌కు హీరోగా తెలుగులో తొలి చిత్రం. ఇక టాలీవుడ్‌కు హాయ్‌ చెబుతున్నారు మరో మలయాళ నటుడు దేవ్‌ మోహన్‌. గుణశేఖర్‌ దర్శకత్వంలో సమంత టైటిల్‌ రోల్‌లో తెరకెక్కుతున్న ‘శాకుంతలం’లో దేవ్‌ మోహన్‌ మెయిన్‌ లీడ్‌గా చేస్తున్నారు. వీరితో పాటు మరికొందరు తెలుగుకి పరిచయం కావడానికి రెడీ అవుతున్నారు.

అక్కడ హీరోలు... ఇక్కడ క్యారెక్టర్లు!
మాతృభాషలో హీరోలుగా చేస్తూ హీరోలుగానే తెలుగులో పరిచయమవుతున్న వారు కొందరైతే... పరభాష హీరోలు కొందరు ఇక్కడ కీలక పాత్రలు చేస్తుండడం విశేషం. వీరిలో ముందుగా చెప్పుకోవాల్సింది కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ గురించి. చిరంజీవి హీరోగా మోహన్‌ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ‘గాడ్‌ ఫాదర్‌’ చిత్రంలో సల్మాన్‌ ఖాన్‌ కీలక పాత్ర చేస్తున్నారు. అలాగే చిరంజీవి హీరోగా బాబీ తెరకెక్కిస్తున్న చిత్రంలో నవాజుద్దిన్‌ సిద్ధిఖీ ఓ పాత్ర చేయనున్నారనే ప్రచారం జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇక ప్రభాస్‌ హీరోగా చేసిన మైథలాజికల్‌ ఫిల్మ్‌ ‘ఆదిపురుష్‌’. ఈ చిత్రంలో రాముడి పాత్రలో ప్రభాస్‌ కనిపించనుండగా, రావణుడి పాత్రను సైఫ్‌ అలీ ఖాన్‌ చేశారు.

ఓం రౌత్‌ దర్శకత్వంలో ప్రధానంగా తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందింది. సో.. ‘ఆదిపురుష్‌’ సినిమాయే సైఫ్‌కి తొలి తెలుగు చిత్రం. ఈ చిత్రంలోని లక్ష్మణుడి పాత్రను సన్నీ సింగ్‌ చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. మరో బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగణ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో ఓ రోల్‌ చేశారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా నటించారు. ఇక జూనియర్‌ ఆర్టిస్టు నుంచి మంచి యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న కన్నడ నటుడు దునియా విజయ్‌ టాలీవుడ్‌కు వస్తున్నారు. బాలకృష్ణ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో దునియా విజయ్‌ ఓ కీలక పాత్ర చేయనున్నారు.

మరో కన్నడ యాక్టర్‌ ధనుంజయ ‘పుష్ప’ చిత్రంతో, వశిష్ట సింహా ‘నయీం డైరీస్‌’తో వచ్చారు. మరోవైపు ఇటీవల విడుదలైన ‘పుష్ప: ది రైజ్‌’ చిత్రంలో విలన్‌గా చేసి, తెలుగు ప్రేక్షకులకు స్ట్రయిట్‌గా హాయ్‌ చెప్పారు మలయాళ హీరో ఫాహద్‌ ఫాజిల్‌. వీరితోపాటు మరికొందరు పరభాషా నటులు స్ట్రయిట్‌ తెలుగు సినిమాలు చేస్తున్నారు. ఆల్రెడీ తెలుగు సినిమాల్లో కనిపించిన అమితాబ్‌ బచ్చన్‌ ప్రస్తుతం ప్రభాస్‌ ‘ప్రాజెక్ట్‌ కె’, వరుణ్‌ తేజ్‌ ‘గని’లో సునీల్‌ శెట్టి, రవితేజ ‘ఖిలాడి’లో ఉన్ని ముకుందన్‌ తదితరులు క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు