Pathaan Review: ‘పఠాన్‌’ మూవీ రివ్యూ

25 Jan, 2023 11:56 IST|Sakshi
Rating:  

టైటిల్‌: పఠాన్‌
నటీనటులు: షారుఖ్‌ ఖాన్‌, జాన్‌అబ్రహం, దీపికా పదుకొణె, డింపుల్‌ కపాడియా, అశుతోశ్ రానా తదితరులు
నిర్మాణ సంస్థ: యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌
నిర్మాత: ఆదిత్య చోప్రా
దర్శకత్వం:  సిద్ధార్థ్‌ ఆనంద్‌
సంగీతం:  సంచిత్ బల్హారా, అకింత్ బల్హారా 
విడుదల తేది: జనవరి 25,2023

కథేంటంటే..
భారత ప్రభుత్వం ఆర్టికల్‌ 370 రద్దు చేయడంతో పాకిస్తాన్‌ ప్రభుత్వం కోపంతో రగిలిపోతుంది. భారత్‌పై దాడి చేసేందుకు కుట్ర పన్నుతుంది. దీని కోసం ప్రైవేట్‌ ఏజెంట్‌ జిమ్‌(జాన్‌ అబ్రహం)ను సంప్రదిస్తాడు పాక్‌ జనరల్‌ కల్నల్‌. కశ్మీర్‌ని పాకిస్తాన్‌కి అప్పగించాలని, లేదంటే ఇండియాపై అటాక్‌ చేయాలని కోరతాడు. దీంతో ఇండియాపై బయో వార్‌ చేసేందుకు ప్లాన్‌ వేస్తాడు జిమ్‌. దాన్ని అడ్డుకునేందుకు రంగంలోకి దిగుతాడు ఇండియన్‌ ఏజెంట్‌ పఠాన్‌(షారుఖ్‌ ఖాన్‌). అసలు జిమ్‌ వేసిన రక్తభీజ్‌ ప్లాన్‌ ఏంటి? ఇండియాపై జిమ్‌ ఎందుకు పగ పడతాడు? పఠాన్‌, జిమ్‌కు ఉన్న సంబంధం ఏంటి? సీక్రెట్‌ ఏజెన్సీ ‘జోకర్‌’ని పఠాన్‌ ఎందుకు ఏర్పాటు చేశాడు?  రక్తభీజ్‌ ప్లాన్‌ని చేధించే క్రమంలో పఠాన్‌, పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ ఏజెంట్‌ రూబై(దీపికా పదుకొణె) మధ్య ఏం జరిగింది? పాకిస్తాన్‌ కుట్రను అడ్డుకునే క్రమంలో భారత ఆర్మీ అధికారిణి (డింపుల్‌ కపాడియా) చేసిన త్యాగమేంటి? తదితర విషయాలు తెలియాలంటే థియేటర్‌లో ‘పఠాన్‌’ సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉందంటే..
'వార్' మూవీతో దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ భారీ విజయం అందుకున్నాడు. ఆ సినిమాలోని యాక్షన్‌, ఎమోషన్స్‌.. అన్ని ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాంటి దర్శకుడు షారుఖ్‌తో సినిమా అనేసరికి ‘పఠాన్‌’పై అంచనాలు పెరిగాయి. దానికి తోడు ‘ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై'తో పాటు ‘వార్‌’ లాంటి స్పై థ్రిల్లర్స్ నిర్మించిన భారీ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌  ఫిల్మ్స్‌  నిర్మాతగా వ్యవహరించడంతో ఆ అంచనాలు తారా స్థాయికి చేరాయి.

అందుకు తగ్గట్టే భారీ యాక్షన్స్‌ సీక్వెన్స్‌, విజువల్స్‌తో పఠాన్‌ని అద్భుతంగా తెరకెక్కించారు. అయితే కథ మాత్రం రొటీన్‌గా ఉంటుంది. యాక్షన్స్‌ సీన్స్‌, విజువల్స్‌...  ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, వార్‌ సినిమాలలో చూసినట్లుగానే ఉంటాయి. అయితే ఆ సినిమాల్లో పండిన ఎమోషన్ 'పఠాన్'లో పండలేదు. షారుఖ్‌ స్టార్‌డమ్‌తో సినిమాను లాక్కొచ్చారు. 

పస్టాఫ్‌ అంతా సాధారణంగా సాగుతుంది. జాన్‌ అబ్రహం, షారుఖ్‌ తలపడే సీన్స్‌ ఆకట్టుకుంటాయి. అయితే కథ మాత్రం ముందుకు వెనక్కి వెళ్తూ.. గందరగోళానికి గురి చేస్తుంది. రక్తభీజ్‌ను గుర్తించే క్రమంలో హెలికాప్టర్‌పై షారుఖ్‌, దీపికాలు చేసే యాక్షన్‌ సీన్స్‌ అదిరిపోతాయి. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ బాగుంటుంది. కానీ స్పై థ్రిల్లర్స్ తరహా సినిమాలు చూసేవాళ్లు ఆ ట్విస్ట్‌ని పసిగట్టే చాన్స్‌ ఉంది.

ఇక సెకండాఫ్‌ నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. ప్రీక్లైమాక్స్‌ ముందు వచ్చే ఇండియన్‌ ల్యాబ్‌ సీన్‌ ఎమోషనల్‌కు గురి చేస్తుంది. ఇక క్లైమాక్స్‌లో షారుఖ్‌, జాన్‌ అబ్రహం యాక్షన్‌ సీన్స్‌ అదిరిపోతాయి. పఠాన్ కోసం టైగర్‌(సల్మాన్‌ ఖాన్‌) రావడం.. వారిద్దరు కలిసి చేసే యాక్షన్‌ సీన్‌ సినిమాకే హైలెట్‌. షారుఖ్‌ అభిమానులకు, యాక్షన్‌ సీక్వెన్స్‌ ఇష్టపడేవారికి ‘పఠాన్‌’ నచ్చుతుంది. 

ఎవరెలా చేశారంటే..
ఇండియన్‌ జవాన్‌ పఠాన్‌ పాత్రలో షారుఖ్‌ ఒదిగిపోయాడు. యాక్షన్‌ సీన్స్‌లో అద్భుతంగా నటించాడు. ఈ సినిమా కోసం షారుఖ్‌ పడిన కష్టమంతా తెరపై కనబడుతుంది. ప్యాక్డ్‌ బాడీతో కనిపించి అభిమానులను అలరించాడు. జాన్‌ అబ్రహం నెగెటివ్ రోల్‌లో అదరగొట్టేశాడు. యాక్షన్స్‌ సీన్స్‌లో షారుఖ్‌తో పోటీపడి నటించాడు. పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ ఏజెంట్‌ రూబైగా దీపికా పదుకొణె తనదైన నటనతో ఆకట్టుకుంది.

తెరపై అందాలను ప్రదర్శించడమే కాదు.. యాక్షన్స్‌ సీక్వెన్స్‌లో నటించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఆమె చేసే ఫైట్‌ సీన్స్‌ ఆకట్టుకుంటాయి. అశుతోష్ రానా, డింపుల్ కపాడియాలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సంచిత్ బల్హారా, అకింత్ బల్హారా నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. 

Rating:  
(2.75/5)
మరిన్ని వార్తలు