వాళ్ల గురించి పట్టించుకున్నారా.. సరేగానీ

16 Sep, 2020 19:50 IST|Sakshi

ముంబై: నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్మృతి కేసుతో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్‌ వ్యవహారం బాలీవుడ్‌లో ప్రకంపనలు రేపుతోంది. నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులు నటి రియా చక్రవర్తిని అరెస్టు చేసిన తర్వాత డ్రగ్స్‌ కేసులో పలువురు నటుల పేర్లు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో బీ-టౌన్‌ సెలబ్రిటీల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డ్రగ్‌ మాఫియాతో సంబంధాల గురించి నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ పార్లమెంటులో ప్రస్తావించారు. బాలీవుడ్‌లో మత్తు పదార్థాల అక్రమ రవాణా, వినియోగం విపరీతంగా పెరిగిపోయిందని, దేశ యువతను నాశనం చేయటానికి కుట్ర జరుగుతోందంటూ మండిపడ్డారు. అదే విధంగా ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ సైతం సినీ ఇండస్ట్రీలో దాదాపు 99 శాతం మంది డ్రగ్స్‌ తీసుకుంటారని, లోతుగా దర్యాప్తు చేస్తే సగం మంది ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.(చదవండి: సుశాంత్‌తో టచ్‌లో లేను.. కానీ నాకు తెలుసు!)

ఈ నేపథ్యంలో నటి పూజా భట్‌ ఆసక్తికర ట్వీట్‌తో సోషల్‌ మీడియాలో చర్చ లేవనెత్తారు. పేదరికంలో మగ్గిపోతూ, మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారిన వారి గురించి ఎవరైనా ఒక్కసారైనా ఆలోచించారా అని ప్రశ్నించారు. ఈ మేరకు.. ‘‘ సమాజంలో అట్టడుగువర్గాలుగా పరిగణింపబడుతూ, బాధల నుంచి విముక్తి పొందేందుకు మత్తు పదార్థాలను ఉపయోగించే ప్రజల గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా? కలలు కల్లలైపోయి పేదరికంలో మునిగి దుర్భర జీవితం గడుపుతున్న వాళ్ల పునరావాసం, బాగోగుల గురించి ఎవరికైనా ఇంట్రెస్ట్‌ ఉందా?’’అని ట్విటర్‌ వేదికగా తన అభిప్రాయాలు వెల్లడించారు. 

మీ నాన్న పరిస్థితి ఏంటి?
ఈ నేపథ్యంలో కొంతమంది పూజాకు మద్దతుగా కామెంట్లు చేస్తుంటే.. మరికొంత మంది నెటిజన్లు ఆమెపై ట్రోలింగ్‌ మొదలుపెట్టారు. ‘‘మీరు చెబుతున్నది నిజమే. కానీ వారి కోసం ఇప్పుడు సెలబ్రిటీలను వదిలిపెట్టమంటారా? రియా అరెస్టు అయ్యింది. మీ నాన్న, మీ చెల్లెళ్ల గురించి ఏమంటారు’’అంటూ విమర్శలు చేస్తున్నారు. కాగా సుశాంత్‌ గర్ల్‌ఫ్రెండ్‌ రియా చక్రవర్తి, పూజా భట్‌ తండ్రి, ప్రముఖ సినీ దర్శకుడు మహేష్‌ భట్‌తో సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియాకు ఆయన మద్దతుగా నిలిచారంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక పూజ సోదరి అలియా భట్‌ నెపోటిజం కారణంగానే ఇండస్ట్రీలో స్థానం సంపాదించగలిగిందంటూ, ఇటీవల ఆమె నటించిన సడక్‌ 2 సినిమాకు ఘోరమైన రేటింగ్స్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా