Kandikonda Yadagiri : 1300 పాటల పరవశం.. కందికొండ సినీ ప్రస్థానం

13 Mar, 2022 07:51 IST|Sakshi

Popular Lyricist Kandikonda Yadagiri Passed Away His Life Journey: ప్రముఖ కవి, పాటల రచయిత కందికొండ యాదగిరి (49) ఇక లేరు. శనివారం (మార్చి 12) మధ్యాహ్నం హైదరాబాద్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 2012లో ఆయనకు తొలిసారిగా కేన్సర్‌ నిర్ధారణ అయింది. అప్పట్లోనే సర్జరీ చేయించారు. 2019లో కేన్సర్‌ తిరగబెట్టడంతో చికిత్సలో భాగంగా చేసిన కీమోథెరపీ, రేడియేషన్‌ వల్ల వెన్నెముక దెబ్బతింది. అప్పటి నుంచి కందికొండ పూర్తిగా మంచానికే పరిమితమయ్యారు. నోటమాట కూడా రాలేదు. నగరంలోని ప్రధాన ఆస్పత్రుల చుట్టూ తిరిగి వైద్యం కోసం లక్షలు ఖర్చు చేసినా ప్రయోజనం లేకుండాపోయింది. కందికొండ భౌతికకాయాన్ని సినీ ప్రముఖులు, కళాభిమానుల సందర్శనార్థం ఆదివారం ఉదయం 8.30 గంటలకు ఫిలింఛాంబర్‌కు తరలించనున్నారు. కందికొండకు భార్య రమాదేవి, కుమార్తె మాతృక, కుమారుడు ప్రభంజన్‌ ఉన్నారు. ఆయన అంత్యక్రియలు నేడు (మార్చి 13) మహాప్రస్థానంలో జరగనున్నాయి.

చదువుకునే రోజుల్లోనే..
వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లిలో 1973 అక్టోబరు 13న సాంబయ్య, కొమురమ్మలకు కందికొండ జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసమంతా సొంతూర్లో, హైస్కూల్‌ చదువు నర్సంపేటలో కొనసాగించారు. మానుకోటలో ఇంటర్‌ పూర్తి చేసి, మహబూబా బాద్‌లో డిగ్రీ పూర్తి చేశారాయన. ఇంటర్‌ సెకండియర్‌లో చక్రి (దివంగత సంగీత దర్శకుడు)తో పరిచయం ఏర్పడింది. ఇద్దరికీ పాటల మీద ఆసక్తి ఉండడంతో ‘సాహితీ కళా భారతి’ అనే ఇన్‌స్టిట్యూట్‌ స్టార్ట్‌ చేశారు. ఇంటర్‌లో ఉన్నప్పడు పుణేలో జరిగిన జాతీయస్థాయి క్రీడల పోటీల్లో పరుగు పందెంలో పాల్గొన్నారు కందికొండ. 1997– 98లో మిస్టర్‌ బాడీ బిల్డర్‌గానూ గెలిచారు కందికొండ. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ తెలుగు, ఎంఏ పాలిటిక్స్‌ పూర్తి చేశారు. చదువుకునే రోజుల్లోనే సాహిత్యం, సినిమాల పట్ల కందికొండకు ఆసక్తి ఉంది. ఆ ఆసక్తే ఆయన్ను సినిమా ఇండస్ట్రీకి వచ్చేలా చేసింది. ఇప్పటివరకు కందికొండ పదమూడు వందలకు పైగా పాటలు రాశారు. 

తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా పాటలు..
చక్రి సంగీత సారథ్యంలో పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ చిత్రంతో గేయరచయితగా కందికొండ ప్రస్థానం మొదలైంది. ఈ చిత్రంలో ‘మళ్లీ కూయవే గువ్వా’ పాట రాశారు. ‘ఇడియట్‌’ చిత్రంలో ‘చూపుల్తో గుచ్చి గుచ్చి’, ‘సత్యం’లో ‘మధురమే మధురమే’, ‘పోకిరి’లో ‘జగడమే..’, ‘గలగల పారుతున్న గోదారిలా..’, ‘టెంపర్‌’ చిత్రంలో ‘వన్‌ మోర్‌ టైమ్‌’.. 'లవ్‌లీ'లో 'లవ్‌లీ లవ్‌లీ'.. ఇలా ఎన్నో హిట్‌ పాటలు కందికొండ కలం నుంచి వచ్చినవే. అలాగే 2018లో 'నీది నాది ఒకే కథ'లో రెండు పాటలు, అనారోగ్యం నుంచి కోలుకున్నాకా శ్రీకాంత్‌ నటించిన 'కోతలరాయుడు' చిత్రంలో ఒక పాట రాశారు. సినిమా పాటలతోనే కాదు.. సంప్రదాయ, జానపద పాటల్లోనూ తన ప్రతిభ చాటారు. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ‘మాగాణి మట్టి మెరుపు తెలంగాణ’, ‘చిన్నీ మా బతుకమ్మా.. చిన్నారక్క బతుకమ్మా’ వంటి చెప్పుకోదగ్గ పాటలు ఉన్నాయి. అలాగే 2018లో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ బర్త్‌ డే సందర్భంగా కందికొండ రాసిన ‘వచ్చాడు వచ్చాడు ఒక లీడర్‌’, 2019లో సంక్రాంతి సందర్భంగా రాసిన పాటలు కూడా బాగానే ప్రాచుర్యం పొందాయి. 

ఇరవై రోజుల క్రితం నాగుర్లపల్లికి వెళ్లిన కందికొండ తన తల్లిదండ్రులు ఉంటున్న పెంకుటిల్లును తనివి తీరా చూశారట. ‘కన్న కొడుకు మాకన్నా ముందే ఈ ప్రపంచానికి దూరం అవుతాడని అనుకోలేదు’ అని కందికొండ తల్లిదండ్రులు విలపించడం స్థానికుల కళ్లు చెమర్చేలా చేసింది. కందికొండ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.  

మరిన్ని వార్తలు