ఆ జీవో ఛాంబర్‌ అడిగినదే!

16 Apr, 2021 06:46 IST|Sakshi

– నట్టి కుమార్‌

సినిమా టిక్కెట్‌ రేట్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసిన తాజా జీవో సామాన్యులకూ, చిన్న నిర్మాతలకూ మేలు చేసేలా ఉందని అన్నారు దర్శక – నిర్మాత నట్టి కుమార్‌. ఈ విషయంపై గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ – ‘‘ఏప్రిల్‌ 8న ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్‌ 35 జారీ చేసింది. టిక్కెట్ల రేట్ల సవరణకు సంబంధించి కొత్త జీవో పాస్‌ చేయాలని టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే ఫిల్మ్‌ ఛాంబర్‌ తరఫున మేము అడుగుతూ వచ్చాం. ఏపీ సీయం జగన్‌  మోహన్‌  రెడ్డి ప్రజలను ఉద్దేశించి, చిన్న సినిమాల నిర్మాతలకు ఉద్దేశించి ఇప్పుడు జీవోను పాస్‌ చేశారు. ‘వకీల్‌సాబ్‌’ సినిమా 9న రిలీజ్‌ అయితే, ఆ జీవో 8న పాస్‌ అయ్యింది. ‘వకీల్‌సాబ్‌’కు వ్యతిరేకంగా ఈ జీవో పాస్‌ చేశారంటూ ప్రచారం సాగింది. అది వాస్తవం కాదు.

నిజానికి, ఇలాంటి జీవో కోసం ఫిల్మ్‌ ఛాంబర్‌ నుంచి చాలా సార్లు సంప్రదించాం. ‘వకీల్‌సాబ్‌’ టికెట్‌ రేట్లలో తేడాల వల్లే బెనిఫిట్‌ షోలు రద్దు అయ్యాయి. అంతేకానీ ప్రభుత్వం ఆ బెనిఫిట్‌ షోలను రద్దు చేసిందనేది అవాస్తవం. నిర్మాత డి. సురేశ్‌బాబు మీటింగులు పెట్టి, థియేటర్స్‌ బంద్‌ అంటున్నారని తెలిసింది. ‘వకీల్‌సాబ్‌’ నడిచేవరకు థియేటర్లు ఉంచి, తరువాత బంద్‌ చేస్తారట. ఈ నెల 16న నా సినిమా (‘ఆర్‌జీవీ దెయ్యం’) విడుదల ఉంది. ఏమైనా ఇబ్బందులు ఎదురైతే కోర్టుకు వెళతాను. థియేటర్లను మూసివేస్తామని బెదిరిస్తుంటే, వారి లైసెన్సులను రద్దు చేయాలి’’ అన్నారు. ‘‘కరోనా సమయంలోని మూడు నెలల ఫిక్స్‌డ్‌ కరెంట్‌ ఛార్జీలను రద్దు చేస్తూ, మరో ఆరు నెలల ఛార్జీలను వాయిదా వేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషదాయకం. అలాగే, టిక్కెట్‌ రేట్ల అడ్డగోలు పెంపును అడ్డుకుంటూ, సామాన్యుడికి ప్రభుత్వం మేలు చేసింది’’ అన్నారు ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ జాయింట్‌ సెక్రెటరీ జె.వి. మోహన్‌  గౌడ్‌.

మరిన్ని వార్తలు