రిషికపూర్‌ నా ప్రాణదాత

6 Feb, 2021 00:10 IST|Sakshi

రిషికపూర్, పద్మినీ కొల్హాపూరి అనగానే ట్రైన్‌ మీద సాగే ‘హోగా తుమ్‌ సే ప్యారా కౌన్‌.. హే కంచన్‌’ పాట గుర్తుకొస్తుంది. ‘జమానే కో దిఖానాహై’, ‘ప్రేమ్‌రోగ్‌’, ‘హవాలాత్‌’ తదితర సినిమాల్లో వీరు నటించి హిట్‌ పెయిర్‌గా గుర్తింపు పొందారు. ఇటీవల ‘ఇండియన్‌ ఐడెల్‌ 12’ ఎపిసోడ్‌ కోసం పాల్గొన్న (ఈ శనివారం టెలికాస్ట్‌ అవుతుంది) పద్మినీ కొల్హాపురి రిషి కపూర్‌ను తలుచుకొని భావోద్వేగానికి లోనయ్యారు. ‘జమానే కో దిఖానాహై సినిమా సెట్‌లో, ఆ తర్వాత ప్రేమ్‌రోగ్‌ సెట్‌లో అగ్నిప్రమాదం జరిగింది.

రెండుసార్లూ రిషి కపూర్‌ నన్ను కాపాడారు. ఆయన చాలామంచి మనిషి. ఎదుటివాళ్లకు సాయం చేయడానికి తప్పకుండా ముందుండేవారు. ఆయన మనందరికి దూరం కావడం బాధాకరం’ అని చెప్పి కళ్లనీళ్ల పర్యంతం అయ్యారు. పద్మినీ కొల్హాపురి ఒక కాలంలో అత్యంత బిజీ హీరోయిన్‌గా బాలీవుడ్‌లో వెలిగారు. 1985లో ఆమె, మిథున్‌ చక్రవర్తి నటించిన ‘ప్యార్‌ ఝక్తా నహీ’ అతి పెద్ద హిట్‌గా నిలిచింది. తెలుగులో ఇది కృష్ణ, శ్రీదేవిల ‘పచ్చని కాపురం’గా వచ్చింది. పద్మినీ కొల్హాపురి నటి శ్రద్ధా కపూర్‌కు పిన్ని. పద్మిని అక్కను నటుడు శక్తికపూర్‌ వివాహం చేసుకున్నాడు.  

మరిన్ని వార్తలు