Rithu Chowdhary: 'చాలా అసభ్యకరమైన కామెంట్స్.. చెప్పక తప్పడం లేదు'

19 Dec, 2023 18:35 IST|Sakshi

కామెడీ షో జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటోంది. కొద్దిరోజుల క్రితం  తన తండ్రి మరణించడంతో ప్రస్తుతం తన కుటుంబానికి అన్నీ తానై చూసుకుంటుంది. తన కొత్త ఇంటి నిర్మాణం విషయంలో ఓ ఇంటీరియర్‌ డిజైనర్‌ వల్ల తాను మానసిక ఆందోళనకు గురయ్యానని చెబుతూ తన యూట్యూబ్‌ ఛానల్‌లో చెప్పుకొచ్చింది. అయితే తాజాగా మరో చేదు అనుభవాన్ని రీతూ చౌదరి పంచుకుంది. సోషల్ మీడియాలో మార్ఫింగ్ వీడియోలు చేస్తున్న ఆకతాయిని పోలీసులు పట్టుకున్నారని తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోను రీతూ తన ఛానల్‌లో షేర్ చేసింది. అదేంటో తెలుసుకుందాం. 

రీతూ చౌదరి మాట్లాడుతూ.. 'నా ఫోటోలను, వీడియోలను ఎవరో మార్ఫింగ్ చేశారు. వీడియోను మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఏకంగా నన్నే ట్యాగ్‌ చేసి పైశాచిక ఆనందం పొందారు. సోషల్ మీడియాలో నేను ఏం పెట్టినా చాలా దారుణంగా కామెంట్స్ చేశారు. ఇది జరిగిన దాదాపు ఐదు నెలలైంది. ఈ విషయాన్ని బయటికి చెప్పాలా? వద్దా? నాలో నేనే చాలాసార్లు బాధపడ్డా. బయటికి చెబితే ఏమవుతుందో అని భయపడిపోయా. ఈ వీడియో చేసేందుకు కూడా ఆలోచించా. కానీ చేయక తప్పడం లేదని' ఆవేదన వ్యక్తం చేసింది. 

మార్ఫింగ్ గురించి రీతూ మాట్లాడుతూ..'నేను ఎప్పటికీ స్ట్రాంగ్‌గా ఉంటా. నేను, శ్రీకాంత్‌ బయటికి వెళ్లేటప్పుడు ఇలాంటి వీడియోలు చూసి అతనికి చెప్పాలా? వద్దా అని కుమిలిపోయా. ఇది చూసిన శ్రీకాంత్ నువ్వు కానప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పేవాడు. నన్ను ట్యాగ్ చేసేవరకు ఇలాంటి వీడియోలు చేశారని నాకు తెలియదు. కానీ చివరికీ నేను ఈ వీడియోలను సైబర్‌ పోలీసులకు ఇచ్చాను. మా నాన్న పోయాక తిరిగి కోలుకునేలోపే మళ్లీ ఇలా జరిగింది. కానీ నా వల్ల అవ్వలేదు. ఒక రోజు అమ్మకు ఈ విషయం చెప్పా. కానీ అమ్మ కూడా ఇలాంటివీ పట్టించుకోవద్దని చెప్పింది. మా అన్నకు కూడా చెప్పాను. నా కుటుంబం సపోర్ట్‌గా ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఈ విషయంలో విష్ణుప్రియ అండగా నిలిచారు' అని తెలిపింది. 

ఆ తర్వాత.. 'నేను సోషల్ మీడియాలో ఏది పెట్టినా.. నాతో వస్తావా? వన్‌ నైట్‌కు వస్తావా? టూ నైట్స్‌కు ఎంత? అని మేసేజ్ చేసే వాళ్లు కూడా ఉంటారు కదా? అలాంటి వాళ్ల లింక్స్ కూడా నేను పోలీసులకు ఇచ్చా. ఆఫర్స్ లేకనే ఇలా చేసిందంటూ నన్ను ఎంతోమంది టార్చర్ చేశారు. అలాంటి వారినే ఇప్పుడు సైబర్ పోలీసులు పట్టుకున్నారు. అతన్ని నేను ఇంతకుముందు కూడా కలిశాను. ఎందుకిలా చేశావంటే నాకు తెలియదు మేడం అంటున్నారు. అతనికి ఇద్దరు అ‍క్కలు కూడా ఉన్నారంట. అతని బావ వచ్చి చిన్నపిల్లాడు మేడం వదిలేయండని సిగ్గు లేకుండా అడుగుతున్నారని' రీతూ చెప్పుకొచ్చింది.

ఇంకా ఇలాంటి వాళ్లు చాలామంది ఉన్నారంటూ రీతూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అబ్బాయిని ఆసిఫాబాద్‌ నుంచి పోలీసులు తీసుకొచ్చారని తెలిపింది. ఇలాంటి వీడియోలు చూసి నాకే.. అసలు ఈ లైఫ్ ఏంటని అనిపించిందని రీతూ వెల్లడించింది. ఇలాంటి పిచ్చివాళ్ల ఆట కట్టించేందుకు సైబర్ పోలీసులు ఉన్నారు. ఎవరూ భయపడకండి.. సూసైడ్‌ చేసుకునే వరకు తీసుకురాకండి.. ధైర్యంగా ముందుకెళ్లండి' అని రీతూ చౌదరి సలహా ఇచ్చింది. ఈ వీడియోను తన యూట్యూబ్ ఛానెల్‌ ద్వారా పంచుకుంది. 


 

>
మరిన్ని వార్తలు