అందగత్తెకు మత్తు మరక.. మళ్లీ తెరపైకి ప్రముఖ యాంకర్

9 Sep, 2021 06:49 IST|Sakshi

మంగళూరు సీసీబీ పోలీసుల చార్జిషీట్లో యాంకర్‌ అనుశ్రీ

ఏ తప్పూ చేయలేదన్న యాంకర్‌  

యశవంతపుర: శాండల్‌వుడ్‌ డ్రగ్స్‌ కేసులో ప్రముఖ అందాల యాంకర్, నటి అనుశ్రీ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. మంగళూరు సీసీబీ పోలీసులు కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో ఆమె పేరును పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబరులో శాండల్‌వుడ్‌ డ్రగ్స్‌ రాకెట్‌ బయటపడగా, అప్పట్లో ఆమెను విచారించిన సంగతి తెలిసిందే. ముఖ్య సమాచారాన్ని చార్జిషీట్లో ప్రస్తావించారు. అనుశ్రీ డ్రగ్స్‌ను అమ్మడంతో పాటు రూంకు తెచ్చేవారని ఆమె స్నేహితుడు కిశోర్‌ అమన్‌ శెట్టి చెప్పినట్లు తెలిపారు. తరుణ్, అనుశ్రీలు డ్రగ్స్‌ పార్టీలకు వెళ్లడంతో పాటు రూంకు తీసుకొచ్చేవారు. అనుశ్రీ బెంగళూరులో నృత్య సాధన చేస్తున్న సమయంలో డ్రగ్స్‌ సేవిస్తే ఖుషీగా డ్యాన్స్‌ చేయవచ్చని తోటివారితో చెప్పేది. అనుశ్రీ రియాలిటీ షోలో గెలిచిన సమయంలో తరుణ్‌ డ్రగ్స్‌ పార్టీ ఇచ్చాడు.  

నేను అలా చెప్పలేదే: అమన్‌శెట్టి..  
అనుశ్రీ డ్రగ్స్‌ తీసుకొంటుందని తాను పోలీసుల విచారణలో చెప్పలేదని తాజాగా కిశోర్‌ అమన్‌శెట్టి ప్రకటించాడు. ఆయన మంగళూరులో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ఆమెతో నాకు పరిచయం లేదు, 2009లో కుణియోణ బారా కన్నడ డ్యాన్స్‌ షోలో కలిశాను. తరువాత ఆమెను ఎప్పుడూ ఎక్కడా కలవలేదన్నారు. చార్జీషీట్లో పొందుపరిచిన ఆరోపణలను ఖండించారు. అనుశ్రీపై ఎలాంటి విరుద్ధ వ్యాఖ్యలు చేయలేదన్నారు.

మత్తు పార్టీలు ఆగలేదు: ఇంద్రజిత్‌..  
డ్రగ్స్‌ కేసులో నిందితుల మూత్రం, రక్తం పరీక్షిస్తే చాలదు. తల వెంట్రుకలను కూడా పరీక్షించాలని నిర్మాత, పాత్రికేయుడు ఇంద్రజిత్‌ లంకేశ్‌ డిమాండ్‌ చేశారు. ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ ఆరోపణలున్నవారందరూ మళ్లీ డ్రగ్స్‌ పార్టీలకు వెళ్తున్నారు. డ్రగ్స్‌ కేసు కర్ణాటకలో పెద్ద కుంభకోణం. అన్ని రంగాల ప్రముఖులు ఈ దందాలో ఉన్నారు. బెంగళూరు నుంచి ఇతర ప్రాంతాలకు డ్రగ్స్‌ సరఫరా అవుతున్నాయి అని ఆయన ఆరోపించారు.

విశ్రాంత ఐపీఎస్‌ జోక్యం: సంబరగి..  
ఒక రిటైర్డు ఐపీస్‌ అధికారి ప్రభావంతో డ్రగ్స్‌ కేసు దారి తప్పినట్లు సామాజిక కార్యకర్త ప్రశాంత సంబరగి బెంగళూరులో ఆరోపించారు. తరుణ్‌ అనే వ్యక్తిని మంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్‌ చేశారు, చార్జీషీట్లో అతని పేరును ఎందుకు పేర్కొనలేదు? అని ప్రశ్నించారు. బెంగళూరుకంటే మంగళూరులో డ్రగ్స్‌ మాత్రలు ఎక్కువగా దొరుకుతాయని కిశోర్‌ అమన్‌శెట్టి చెప్పాడన్నారు.  

అనుశ్రీ ఏమన్నారంటే..  
తను ఏ తప్పు చేయలేదంటూ అనుశ్రీ ఒక వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. నేను బెంగళూరుకు 14 ఏళ్ల క్రితం బస్సులో వచ్చి చేరుకున్నా. సుమారు 12 ఏళ్ల కాలం పాటు హాస్టల్‌లో ఉన్నాను. ఆ తర్వాత నాటక రంగంలో ఆఫర్లు వచ్చాయి. నేను మంచిగా ఉన్నాను, కనుకనే ఇంత పెద్ద స్థాయికి ఎదిగాను. అయితే డ్రగ్స్‌ కేసులో విచారించడం బాధకు గురి చేసింది అన్నారు.

ఇవీ చదవండి:
ఆర్జీవీతో అశు బోల్డ్‌ ఇంటర్వ్యూ చూసిన ఆమె తల్లి రియాక్షన్‌ చూశారా! 
నానిలోనాకు బాగా నచ్చిన విషయం అదే : రీతూ వర్మ

మరిన్ని వార్తలు