Sanjay Dutt Shamshera Movie: భారీ బడ్జెట్‌, అత్యంత ఘోరమైన ఫ్లాప్‌.. ఆవేదన వ్యక్తం చేసిన నటుడు

28 Jul, 2022 18:09 IST|Sakshi

నాలుగు సంవత్సరాల కష్టం.. నాలుగు రోజుల్లో బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. ఎంతో కష్టపడి అద్భుత కళాఖండాన్ని తీశామనుకున్న సినిమాను ఆదిరంచే ప్రేక్షకులే కరువయ్యారు. పాటలు హిట్‌.. కేజీఎఫ్‌ నటుడు సంజయ్‌దత్‌ విలన్‌.. స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ కథానాయకుడు.. ఇంకేం.. సినిమా హిట్టుపో అనుకున్నారు అభిమానులు. కానీ ఎక్కడో తేడా కొట్టింది. ఫలితంగా బాక్సాఫీస్‌ దగ్గర సినిమా బెడిసికొట్టింది. వెరసి రణ్‌బీర్‌ కపూర్‌ కెరీర్‌లోనే భారీ డిజాస్టర్‌గా నిలిచింది షంషేరా. కానీ అంత తేలికగా వైఫల్యాన్ని జీర్ణించుకోలేకపోతోంది చిత్రయూనిట్‌. ప్రాణం పెట్టి సినిమా తీశాం, ఇలాంటి ఫలితం వస్తుందని కలలో కూడా అనుకోలేదంటూ ఆవేదన చెందుతోంది.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన షంషేరా సినిమా జూలై 22న థియేటర్లలో విడుదలైంది. సినిమా రిలీజై ఐదు రోజులు కావస్తున్నా ఎక్కడా పాజిటివ్‌ బజ్‌ లేదు, కలెక్షన్లు కూడా అరకొర, పైగా విమర్శలు.. దీంతో షంషేరాలో విలన్‌గా నటించిన సంజయ్‌ దత్‌ సోషల్‌ మీడియలో భావోద్వేగ లేఖను విడుదల చేశాడు. 'కథకు, మీకిదివరకు పరిచయం లేని పాత్రలకు జీవం పోసే కళ సినిమా. షంషేరా కూడా ఆ కోవలోకే చెందుతుంది. మా చెమట, రక్తం, కన్నీళ్లు ధారపోసి ఈ సినిమా చేశాం. దీన్ని వెండితెరపైకి తీసుకురావాలని కలగన్నాం. కానీ చాలామంది ఈ చిత్రాన్ని ద్వేషించారు. సినిమా చూడకుండానే విషాన్ని చిమ్మారు. మా కష్టాన్ని లెక్కచేయకుండా ఇలా ప్రవర్తించడం నిజంగా భయానకంగా అనిపిస్తోంది.

నాలుగు దశాబ్ధాల కెరీర్‌లో నేను ఎంతోమందితో పనిచేశాను. అందులో కరణ్‌ ఓ గొప్ప డైరెక్టర్‌. ఒక్కో పాత్రను ఒక్కో ఆయుధంలా వాడుతాడు. మేము ఇంతకుముందు అగ్నిపథ్‌ చేశాం. అతడు నాకిచ్చిన కంచ చీనా పాత్ర బాగా వర్కవుట్‌ అయింది. నన్ను నమ్మి షంషేరాలో అవకాశం ఇచ్చాడు. సినిమా సక్సెసా? ఫెయిల్యూరా? అన్నది పక్కనపెడితే అతడు నాకు ఫ్యామిలీలో భాగమే అనిపిస్తాడు. అతడితో కలిసి పని చేయడం ఎప్పటికీ గౌరవప్రదమే! నేనెప్పుడూ అతడి వైపే నిలబడతాను

షంషేరాలో వెతుకుతున్న తెగ ఎప్పటికైనా దొరుకుతుంది. కానీ అప్పటివరకు మేము కూడగట్టుకున్న జ్ఞాపకాలు, నవ్వులు, కష్టాలు, అనుబంధాలు అలాగే కొనసాగుతాయి. కరోనా వంటి ఇబ్బందులు ఎదురైనా నాలుగేళ్లుగా ఒకేతాటిపై నిల్చున్న చిత్రయూనిట్‌ సంకల్పానికి ఇవే నా అభినందనలు. ఈ సినిమాతో రణ్‌బీర్‌తో నాకు కలకాలం నిలిచిపోయే అనుబంధం ఏర్పడింది. ఇలాంటి టాలెంటెడ్‌ నటుల మీద విషం చిమ్మడానికి కాపు కాచుకుని ఎదురు చూస్తున్న వ్యక్తులను చూస్తుంటే బాధగా ఉంది' అని చెప్పుకొచ్చాడు.

A post shared by Sanjay Dutt (@duttsanjay)

చదవండి: రెండో పెళ్లి, వివాహమైన ఐదు నెలలకే బిడ్డకు జన్మనిచ్చిన నటి
అలా ఇంద్ర సినిమాలో నటించే ఛాన్స్‌ మిస్సయింది!

మరిన్ని వార్తలు