ఖల్‌నాయక్‌ రిటర్న్స్‌

4 Dec, 2020 06:33 IST|Sakshi

బాలీవుడ్‌ షో మ్యాన్‌ సుభాష్‌ ఘాయ్‌ తెరకెక్కించిన మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఖల్‌నాయక్‌’ (1993) సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇందులో సంజయ్‌ దత్‌ చేసినది యాంటీ హీరో రోల్‌ అయినప్పటికీ ప్రేక్షకులు విపరీతంగా ఇష్టపడ్డారు. 27 ఏళ్ల తర్వాత దర్శకుడు సుభాష్‌ ఘాయ్‌ ఈ చిత్రం సీక్వెల్‌కి శ్రీకారం చుట్టబోతున్నారు. తొలి భాగంలో సంజయ్‌ దత్‌ చేసిన విలన్‌ బల్లూ పాత్రను సీక్వెల్‌లో వేరే హీరో చేయబోతున్నారు. ‘ఖల్‌నాయక్‌’ చిత్రంలో హీరో పాత్రను చేశారు జాకీ ష్రాఫ్‌.

ఇప్పుడు ఆయన  తనయుడు టైగర్‌ ష్రాఫ్‌ మలి భాగంలో యాంటీ హీరో రోల్‌ చేయనున్నారు. ‘వార్‌’ సినిమా తర్వాత విలన్‌గా టైగర్‌ ష్రాఫ్‌కి మంచి మార్కులు పడటంతో మరో పవర్‌ఫుల్‌ విలన్‌ ‘ఖల్‌నాయక్‌’ పాత్రకు టైగర్‌ సై అన్నారట. జైలు నుండి బయటకు వచ్చే సంజయ్‌ దత్‌ పాత్రతో సినిమా కథ ప్రారంభమవుతుందని తెలిసింది. తొలి భాగంలో గంగ పాత్ర చేసిన మాధురీ దీక్షిత్‌ ఈ చిత్రంలో అతిథి పాత్రలో నటించనుండటం విశేషం. కథానాయిక పాత్రకు ఓ ప్రముఖ నటిని అనుకుంటున్నారు. ‘ఖల్‌నాయక్‌’ని  గ్యాంగ్‌స్టర్‌ కథగా తీశారు. సీక్వెల్‌ను డ్రగ్‌ మాఫియా నేపథ్యంలో చిత్రీకరించాలనుకుంటున్నారని సమాచారం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు