ఆ మాట ఆస్కార్‌తో సమానం

30 Jul, 2020 03:25 IST|Sakshi
శ్రీధర్‌ సీపాన

‘‘ప్రతి రచయితకూ ఓ విజన్‌ ఉంటుంది. ఆ విజన్‌ని తెరపైకి ఎక్కించడంలో ఓ కిక్‌ ఉంటుంది. రచయితలు రాసిన కొన్ని కథలు ఒక్కోసారి దర్శకులకు నచ్చకపోవచ్చు. అలాంటప్పుడు నిర్మాతలను ఒప్పించి మేమే  దర్శకత్వం చేయాలి. మా విజన్‌ని అప్పుడే తెరపై చూపించగలం.. అందుకే నేను రచయిత నుంచి డైరెక్టర్‌గా మారాను’’ అన్నారు శ్రీధర్‌ సీపాన.

‘నమో వెంకటేశ, అహ నా పెళ్ళంట, పూలరంగడు, భీమవరం బుల్లోడు, లౌక్యం, డిక్టేటర్‌’ వంటి పలు చిత్రాలకు రచయితగా పని చేసిన శ్రీధర్‌ సీపాన ‘బృందావనమది అందరిది’ చిత్రంతో దర్శకునిగా మారారు. బుధవారం ఆయన పుట్టినరోజుని పురస్కరించుకుని మాట్లాడుతూ– ‘‘దర్శకుడిగా ‘బృందావనమది అందరిది’ నా తొలి సినిమా. ఆ చిత్రానికి నా స్నేహితులు శ్రీనివాస్‌ వంగాల, ప్రభాకర్‌ నిర్మాతలు.

వారికి ఇండస్ట్రీ కొత్త కావడంతో ప్రొడక్షన్‌ పనులూ నేనే చూసుకున్నాను. దర్శకుడిగా నా రెండో సినిమా చిరంజీవిగారి చిన్నల్లుడు కల్యాణ్‌ దేవ్‌ హీరోగా ఉంటుంది. ఆగస్టులో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళుతుంది. జీఏ 2 పిక్చర్స్‌ సమర్పణలో పీపుల్స్‌ మీడియా, అభిషేక్‌ అగర్వాల్‌ ఈ సినిమా నిర్మిస్తారు. కల్యాణ్‌ దేవ్‌ సినిమా విడుదల తర్వాతే ‘బృందావనమది అందరిది’ చిత్రం విడుదలవుతుంది. కరోనాకి ముందు ‘ఆచార్య’ కోసం కొరటాల శివగారితో కలిసి చిరంజీవిగారితో స్క్రిప్ట్‌ వర్క్‌లో పాల్గొన్నాను.

అప్పుడు కల్యాణ్‌ దేవ్‌తో తీసే కథని చిరంజీవిగారు, కొరటాలగారు విని బాగా ఎంజాయ్‌ చేశారు. ‘కథ విన్నంతసేపూ నవ్వుతూనే ఉన్నాను’ అని చిరంజీవిగారు చెప్పారు. ఆ మాటతో ఆస్కార్‌ అవార్డు వచ్చినంత ఆనందం దక్కింది. డైరెక్టర్‌గానే కాదు.. రచయితగానూ కొనసాగుతాను. ప్రస్తుతం డైరెక్టర్‌ కె.రాఘవేంద్రరావుగారి సినిమాకి, అనిల్‌ సుంకరగారి ప్రొడక్షన్‌లో ఓ సినిమాకి  డైలాగులు రాస్తున్నాను. మరో రెండు మూడు సినిమాలకు చర్చలు జరిగాయి. ఓ వెబ్‌ సిరీస్‌ రెండు మూడు రోజుల్లో ఫైనల్‌ అవుతుంది’’ అన్నారు.

మరిన్ని వార్తలు