Shivraj Kumar And Siddharth: క్షమించమని సిద్ధార్థ్‌ను కోరిన శివన్న.. చేతులు జోడించి సారీ చెప్పిన ప్రకాశ్‌ రాజ్‌

30 Sep, 2023 10:44 IST|Sakshi

కర్ణాటక- తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరి నదీ జలాల వివాదం నడుస్తోంది. కర్ణాటకలో ప్రతిచోటా పోరు కొనసాగుతోంది. కావేరి కోసం శాండల్‌వుడ్ తారలు కూడా తమ గళాన్ని పెంచారు. తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ఇప్పటికే కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చారు. ఇలాంటి సమయంలో తమిళ హీరో సిద్ధార్ధ్‌కు నిరసన సెగ తగలింది. తను నటించిన 'చిన్నా' చిత్రం విడుదల సందర్భంగా బెంగళూరులో ప్రమోషన్‌ కార్యక్రమం చేపట్టాడు. దీనిని పలువురు కన్నడ అనుకూల వ్యక్తులు అడ్డుకున్నారు. అక్కడి మీడియా సమావేశం నుంచి సిద్ధార్థ్‌ను బయటకు పంపించేశారు.

(ఇదీ చదవండి: విశాల్​ ఆరోపణలపై కేంద్రం రియాక్షన్‌.. వాళ్లకు మద్ధతుగా బాలీవుడ్‌ )

వారు చేసిన ఈ పనిని చాలామంది తప్పుబట్టారు. ప్రస్తుతం ఈ చర్య సోషల్‌ మీడియాలో భారీ చర్చకు దారితీసింది. తాజాగా సిద్దార్థ్‌కు జరిగిన అవమానంపై  కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ ఇలా ప్రస్తావించారు. 'నిన్న జరిగిన ఈ ఘటన నిజంగా బాధాకరం.. మా ఇండస్ట్రీ తరపున సిద్ధార్థ్‌కి క్షమాపణలు చెబుతున్నా.. సిద్ధార్థ్‌ క్షమించండి.. చాలా బాధపడ్డాం.. ఈ తప్పు ఇంకెప్పుడూ జరగదు' అంటూ నటుడు సిద్ధార్థ్‌కి శివన్న సారీ చెప్పాడు.

అలాగే కన్నడ ప్రజలు చాలా మంచివారు.అన్ని భాషలను ఇష్టపడతారు. కర్ణాటకకు చెందిన వారు మాత్రమే అన్ని భాషల సినిమాలను చూస్తారు.ఈ విషయాన్ని మనం గర్వంగా చెప్పుకోగలం. ఆ గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలి అని ఆయన అన్నారు.

చేతులు జోడించి క్షమాపణ చెప్పిన ప్రకాశ్‌ రాజ్‌
ఇదే వివాదంపై సీనియర్‌ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ కూడా స్పందించారు. 'దశాబ్దాల నాటి సమస్యను పరిష్కరించడంలో విఫలమైన రాజకీయ పార్టీలను, నాయకులను ప్రశ్నించకుండా.. ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురాకుండా.. సామాన్యులను, కళాకారులను ఇబ్బంది పెడుతున్నారు. ఇలా చేయడం అసలు ఆమోదయోగ్యం కాదు. కర్ణాటకకు చెందిన మనిషిగా ఇక్కడి ప్రజలందరి తరపున సిద్ధార్థ్‌కు క్షమాపణలు చెబుతున్నాను.' అని సోషల్‌ మీడియా ద్వార ప్రకాశ్‌ రాజ్‌ తెలిపారు. దీనికి రెండు చేతులు జోడించి ఉన్న ఎమోజీలను పెట్టారు. 

మరిన్ని వార్తలు