గాయక నాయకా స్వరాభివందనం

27 Sep, 2020 04:05 IST|Sakshi
శనివారం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియల సందర్భంగా భర్తకు కడసారి వీడ్కోలు పలుకుతున్న ఆయన సతీమణి సావిత్రి

 అధికారిక లాంఛనాలతో ముగిసిన ఎస్పీ బాలు అంత్యక్రియలు 

ప్రత్యేక వాహనంలో పార్థివదేహం తరలింపు 

వ్యవసాయ క్షేత్రంలో సంప్రదాయ పద్ధతిలో ఖననం 

బాలు పార్థివదేహానికి నివాళులు అర్పించిన పలువురు ప్రముఖులు 

సాక్షి ప్రతినిధి, చెన్నై : కోట్లాది మంది అభిమానులకు కన్నీటిని మిగిల్చి.. కానరాని లోకాలకు గాన గంధర్వుడు శాశ్వతంగా వెళ్లిపోయారు. పాటలతో ఆబాలగోపాలాన్ని ఉర్రూతలూగించిన ఆ స్వరమాంత్రికుడిని భూమాత తన గర్భంలో దాచుకుంది. అభిమానుల అశ్రునయనాలు, కుటుంబీకుల కన్నీటి ధారల మధ్య ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో శనివారం పూర్తయ్యాయి. అనారోగ్యంతో శుక్రవారం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచిన తర్వాత ఎస్పీ బాలు పార్థివదేహాన్ని కమదార్‌నగర్‌లోని ఆయన స్వగృహానికి తరలించారు. అక్కడ కొంతసేపు ప్రజల సందర్శనార్థం ఉంచారు. అనంతరం తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా తామరైపాక్కంలో ఉన్న బాలు సొంత వ్యవసాయ క్షేత్రానికి ఆయన పార్థివదేహాన్ని ప్రత్యేక వాహనంలో ఉంచి తరలించారు. ఆ వాహనాన్ని వేలాది మంది అనుసరించారు. దారిపొడవునా అభిమాన సందోహం ఆయనకు తుది వీడ్కోలు పలికారు. పలు చోట్ల వాహనాన్ని నిలిపివేసి పూలవర్షం కురిపించారు. దీంతో గంటలో వ్యవసాయ క్షేత్రానికి రావాల్సిన వాహనం మూడు గంటలు ఆలస్యంగా శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో చేరుకుంది. అప్పటికే వేలాది మంది జనం వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు.  (మూగబోయిన బాలు గళం: ఒక శకం ముగిసింది!)

కన్నీటి పర్యంతమైన కుటుంబం 
వ్యవసాయ క్షేత్రంలో బాలు భౌతికకాయాన్ని కడసారి చూసేందుకు శనివారం తెల్లవారుజాము 5 గంటల నుంచి అనుమతించారు. ఉదయం 7 గంటలకు అంతిమసంస్కారాలు ప్రారంభించారు. బాలు సతీమణి సావిత్రి, కుమారుడు ఎస్పీ చరణ్, కుమార్తె పల్లవి, సోదరీమణులు, ఇతర బంధువులు పార్థివదేహానికి ప్రదక్షిణలు చేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. తండ్రి అంత్యక్రియలను సంప్రదాయ పద్ధతిలో కుమారుడు చరణ్‌ పూర్తి చేశారు. ఎస్పీ బాలుతో కలిసి చదువుకున్న వివిధ ప్రాంతాలకు చెందిన వారు కూడా అంత్యక్రియలకు హాజరయ్యారు. తిరువళ్లూరు జిల్లా కలెక్టర్‌ మహేశ్వరి నేతృత్వంలో తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. 24 మంది పోలీసులు మూడు రౌండ్లు గాలిలోకి కాల్చి నివాళులు అర్పించారు.  

బాలు భౌతికకాయం వద్ద కన్నీరుమున్నీరవుతున్న భార్య సావిత్రి, కుమారుడు ఎస్పీ చరణ్, కుమార్తె పల్లవి

ఇష్టమైన వ్యవసాయ క్షేత్రం 
బాలసుబ్రహ్మణ్యానికి వీలు చిక్కినప్పుడల్లా తన వ్యవసాయక్షేత్రానికి వచ్చేవారు. ఈ ఫాం హౌస్‌లోని ప్రశాంత వాతావరణంలో కాలక్షేపం చేసేవారు. సుమారు 15 ఎకరాల్లోని ఈ వ్యవసాయక్షేత్రంలో పచ్చని చెట్లు, తోటల మధ్య గడిపేందుకు ఆయన ఇష్టపడేవారు. అంతేగాక ఈ వ్యవసాయక్షేత్రం చుట్టుపక్కల  నివసించే ప్రజలకు ఎన్నో సహాయాలు చేసేవారు. బాలు మరణవార్త వినగానే అంతిమసంస్కారాలు ఎక్కడ చేయాలనే ఆలోచన వచ్చినపుడు.. ఆయన సన్నిహితులు ఈ వ్యవసాయక్షేత్రాన్ని సూచించారు. దీనికి కుటుంబీకులు కూడా అంగీకరించారు. 

ఎస్పీ చరణ్‌ను ఓదారుస్తున్న హీరో విజయ్‌ 

ఏపీ నుంచి మంత్రి అనిల్‌.. 
ఎస్‌పీబీ ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థిస్తూ సంగీత దర్శకుడు ఇళయరాజా శనివారం రాత్రి తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర ఆలయ సన్నిధిలో మోక్ష దీపం వెలిగించారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు బాలుకు నివాళులు అర్పించారు. అంతిమసంస్కారాలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున జలవనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ హాజరయ్యారు. తమిళనాడు మంత్రి ఎం పాండియరాజన్, ప్రముఖ తమిళ సినీ హీరో విజయ్, నటుడు అర్జున్, రెహమాన్, దర్శకుడు భారతీరాజా, గాయకుడు మనో, సంగీత దర్శకులు దేవీశ్రీప్రసాద్‌ బాలుకు శ్రద్ధాంజలి ఘటించారు.

ఎస్పీ చరణ్‌తో మాట్లాడుతున్న ఏపీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌

బ్రాహ్మణ శివలింగదారుల సంప్రదాయంలో ఖననం 
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుటుంబం బ్రాహ్మణ శివలింగదారుల సంప్రదాయానికి చెందిన వారు కావడంతో ఆయన పార్థివదేహాన్ని ఆ సంప్రదాయం ప్రకారం ఖననం చేశారు. లింగదారుల వంశీకుల్లో స్త్రీ, పురుషులు విధిగా శివలింగాన్ని ధరించి ఉంటారు. ఎస్పీ బాలు ఇంటిలో శివలింగాలకు వేదపండితులు నిత్యం అభిషేకం చేస్తారు. లింగదారుల సంప్రదాయంలో వారు మరణిస్తే భౌతికకాయాన్ని కూర్చోబెట్టి ఖననం చేస్తారు. అయితే బాలు పార్థివదేహం శుక్రవారం మధ్యాహ్నం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు ఫ్రీజర్‌లో ఉంచడం వల్ల కూర్చోపెట్టడానికి వీలుకాక పడుకోబెట్టిన స్థితిలోనే ఖననం చేశారు.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా