స్టార్‌ హీరోలతో నటించింది..కానీ ఆ డైరెక్టర్‌ వాడుకుని వదిలేశాడు!

11 Sep, 2023 21:43 IST|Sakshi

1997లో 'నాగమండలం' చిత్రంతో సినీ కెరీర్‌ ప్రారంభించిన నటి విజయలక్ష్మి. ఈ చిత్రంలో ప్రకాశ్‌ రాజ్‌కు జోడీగా నటించింది. మొదటి సినిమాతోనే ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. ఆ తర్వాత జోడిహక్కి, భూమితై చొచ్చల మగా, అరుణోదయ, స్వస్తిక్, హబ్బా, సూర్యవంశం లాంటి కన్నడ సినిమాల్లో నటించారు. తెలుగులోనూ హనుమాన్ జంక్షన్‌, పృథ్వి నారాయణ చిత్రాల్లో కనిపించారు.

ఆమె తమిళ చిత్ర పరిశ్రమలో చాలా చిత్రాలు చేశారు. మద్రాసులో జన్మించిన విజయలక్ష్మి కర్ణాటకలోని బెంగుళూరులో చదువుకుంది. తన కెరీర్‌లో దాదాపు 40 సినిమాల్లో నటించింది.  తెలుగులోనూ హనుమాన్ జంక్షన్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా మోహన్‌లాల్‌తో కలిసి ఒక మలయాళ చిత్రం దేవదూతన్‌లో కూడా నటించింది. 

ఆత్మాహత్యాయత్నం

2006లో తండ్రి మరణంతో విజయలక్ష్మి నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే మూడు సంవత్సరాల డేటింగ్ తర్వాత.. మార్చి 2007లో నటుడు సృజన్ లోకేష్‌తో ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంది. అయితే ఊహించని సంఘటనలతో అతనితో నిశ్చితార్థం బ్రేకప్‌ అయింది. ఆ  తర్వాత సినిమాలకే పరిమితమైన విజయలక్ష్మి గత కొన్నేళ్లుగా మళ్లీ వార్తల్లో నిలుస్తున్నారు. 

పెళ్లి పేరుతో మోసం

తమిళనాడుకు చెందిన నామ్ తమిళర్ కట్చి పార్టీ అధినేత నటుడు, దర్శకుడు సీమాన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. సీమాన్ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆరోపిస్తూ ఫిబ్రవరి 2020లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పట్లో అతని వేధింపులు తట్టుకోలేక 2020 జూలైలో మాత్రలు మింగిఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే ఇటీవలే ఆమె మరోసారి సీమాన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. 

పెళ్లి పేరుతో నమ్మించి తనను శారీరకంగా వాడుకున్నారని విజయలక్ష్మి ఆరోపించింది. ప్రేమిస్తున్నట్లు నటించి 7 సార్లు బలవంతంగా అబార్షన్ చేయించాడని తెలిపింది. అంతే కాకుండా నా బంగారు నగలు తీసుకుని  సీమాన్‌ మోసం చేశాడని వాపోయింది. తనకు న్యాయం చేయాలని కోరితే చంపేస్తానని బెదిరిస్తున్నారని ఇటీవల మరోసారి చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీమాన్‌ను విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే ఆయన విచారణకు హాజరుకాలేదు. మంగళవారం తప్పకుండా విచారణకు హాజరు కావాలని పోలీసులు మరోసారి హెచ్చరించారు.

విజయలక్ష్మికి గైనకాలజిస్ట్ పరీక్ష

విజయలక్ష్మి ఫిర్యాదుతో చెన్నై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు. సీమాన్‌ను విచారణకు ఆదేశించడమే కాకుండా.. విజయలక్ష్మికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఆమెకు 7 సార్లు గర్భస్రావం జరిగిందని ఆరోపణల నేపథ్యంలో గైనకాలజిస్టులతో  వైద్య పరీక్షలు చేశారు. 

మరిన్ని వార్తలు