Oscars 2022: ఆస్కార్‌ బరిలో నయనతార ‘కూళాంగల్‌’.. కథేంటంటే..?

24 Oct, 2021 08:00 IST|Sakshi

‘కూళాంగల్‌’ (గులకరాయి) మోత ఆస్కార్‌ వరకూ వినిపించనుంది. ఆస్కార్‌ అవార్డును కూడా సొంతం చేసుకుంటుందా? అనేది వచ్చే ఏడాది మార్చిలో తెలిసిపోతుంది. అయితే కొత్తవారితో కొత్త దర్శకుడు తీసిన సినిమా ఆస్కార్‌ పోటీ దాకా వెళ్లడం అంటే చిన్న విషయం కాదు. ప్రేక్షకుల హృదయాలను తాకింది ‘కూళాంగల్‌’ సినిమా. అందుకే మన దేశం తరఫున అధికారిక ఎంట్రీగా ఈ సినిమా ఆస్కార్‌కి ఎంపికైంది. 2022 మార్చి 27న జరగనున్న 94వ ఆస్కార్‌ అవార్డ్‌ వేడుకకు మన దేశం తరఫున ‘విదేశీ విభాగానికి’ పలు చిత్రాలు పోటీ పడ్డాయి. వాటిలో హిందీ నుంచి ‘సర్దార్‌ ఉదమ్‌’, ‘షేర్నీ’, తమిళ చిత్రం ‘మండేలా’, మలయాళ సినిమా ‘నాయట్టు’ ఉన్నాయనే వార్త శుక్రవారం వచ్చింది.

అయితే తమిళ చిత్రం ‘కూళాంగల్‌’ కూడా ఉందని, ఆ చిత్రమే ఎంపికైందని శనివారం అధికారిక ప్రకటన వెల్లడయింది. అన్ని చిత్రాలనూ పరిశీలించాక జ్యూరీ సభ్యులు ‘కూళాంగల్‌’ని ఎంపిక చేశారు. పీఎస్‌ వినోద్‌ రాజ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌–హీరోయిన్‌ నయనతార ‘రౌడీ పిక్చర్స్‌’ బేనర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆస్కార్‌ అధికారిక ఎంట్రీకి తమ సినిమా ఎంపికైన సందర్భంగా ‘‘అండ్‌ ది ఆస్కార్‌ గోస్‌ టు అని వినే చాన్స్‌ కూడా ఉంది! కల నెరవేరడానికి రెండు అడుగుల దూరమే ఉంది’’ అని సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు విఘ్నేష్‌. ‘‘ఇంతకన్నా ఆనందకరమైన వార్త మరోటి ఉండదు’’ అన్నారు పీఎస్‌ వినోద్‌ రాజ్‌.

కూళాంగల్‌ కథేంటంటే...
భర్త పచ్చి తాగుబోతు. అతన్ని మార్చాలనుకుంటుంది భార్య. తన వల్ల కాక ఇంటి నుంచి వెళ్లిపోతుంది. అప్పుడు భార్య విలువ తెలుసుకుని ఆమెను ఇంటికి రప్పించడానికి తన కొడుకుతో కలసి ఆ భర్త ప్రయత్నాలు మొదలుపెడతాడు. భార్యను వెనక్కి తెచ్చుకోవడానికి అతనేం చేశాడనేది కథ. పీఎస్‌ వినోద్‌ రాజ్‌ తన కుటుంబంలో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా ఈ సినిమా తీశారు. దర్శకుడిగా తొలి చిత్రమే అయినప్పటికీ ప్రేక్షకులను హత్తుకునేలా తీశారు వినోద్‌. నటించిన అందరూ కొత్తవారే. కానీ పాత్రల్లో జీవించారు. ‘ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ రోటర్‌డామ్‌’ (ఐఎఫ్‌ఎఫ్‌ఆర్‌)లో ‘కూళాంగల్‌’ ప్రతిష్టాత్మక టైగర్‌ అవార్డు దక్కించుకుంది. 50 ఏళ్ల ఐఎఫ్‌ఎఫ్‌ఆర్‌ చరిత్రలో 2017లో మన దేశానికి తొలి అవార్డును తెచ్చిన మలయాళ ‘దుర్గా’ తర్వాత ఈ అవార్డు దక్కించుకున్న మరో సినిమా ‘కూళాంగల్‌’ కావడం విశేషం. 

మరిన్ని వార్తలు