సినిమా కోసం కదలి వచ్చిన ఊళ్లు

17 Dec, 2020 00:41 IST|Sakshi
‘ఆచార్య’లో చిరంజీవి

మారేడుమిల్లి అటవీ ప్రాంతం భాగ్యనగరానికి వచ్చింది. నేను కూడా అంటూ ఇటలీ వచ్చేసింది. నేనూ వస్తా అంటూ అమెరికా వచ్చింది. నేను సైతం అంటూ కోల్‌కత్తా తరలి వచ్చింది. ఊరికి దూరంగా ఉండే అడవి ఊళ్లో ప్రత్యక్షమైంది. ఏలూరు.. ఆ ఊరు.. ఈ ఊరు.. మదనపల్లి.. ఆ పల్లి.. ఈ పల్లి.. అన్నీ హైదరాబాద్‌ వచ్చేశాయి. కరోనా వల్ల వలస కార్మికులు ఊళ్లు చేరితే.. సినిమా కోసం ఊళ్లు హైదరాబాద్‌కి కదలి వచ్చాయి.. ‘కదలి వచ్చిన ఊళ్లు’... కరోనా పరిస్థితుల్లో ప్రయాణాలు తగ్గించాలని  ‘సెట్స్‌’ సెట్‌ చేస్తున్నారు.

చిరంజీవి ‘ఆచార్య’లో ఓ పురాతన ఆలయం ఉంటుంది. ఏదైనా ఊళ్లో పురాతన ఆలయం ఉంటే అక్కడికి వెళ్లి చిత్రీకరించాలన్నది ప్లాన్‌. అయితే తర్వాత ఆ ఆలయం సెట్‌ని హైదరాబాద్‌లో వేశారు. ఈ సినిమాలో ‘ధర్మస్థలి’ అనే ఊరు ఉంటుంది. ఈ ఊళ్లోనే గుడి కూడా ఉంటుంది. 16 ఎకరాల విస్తీర్ణంలో 20 కోట్ల బడ్జెట్‌తో వేసిన ఈ భారీ సెట్‌ ‘ఆచార్య’కి ఓ హైలైట్‌. ఇక హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోకి వెళితే తమిళనాడుకి చెందిన ఓ ఊరు కనబడుతుంది. ఆ ఊరికి పెద్దన్న ఉంటారు. ఆయనే రజనీకాంత్‌. సినిమా పేరు ‘అన్నాత్తే’. అంటే.. పెద్దన్నయ్య అని అర్థం. ఈ చిత్రం కోసం తమిళనాడు ఊరి సెట్‌ వేశారు. ఆ ఊరెళ్లి చిత్రీకరణ అంటే కష్టమే అని, సెట్‌ వేశారు. ప్రస్తుతం ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నారు రజనీ.

మన దేశానికి చెందిన ఊళ్ల సెట్‌లే కాదు.. ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’ కోసం ఇటలీ ఇక్కడికి వచ్చేసింది. ఈ సినిమా యూరప్‌ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది. లాక్‌డౌన్‌కి ముందు, ఆ తర్వాత యూనిట్‌ అక్కడికెళ్లి షూటింగ్‌ చేసింది. మళ్లీ ప్రయాణం ప్లాన్‌ చేయకుండా ఇటలీ సెట్‌ని ఇక్కడ వేశారు. 1970ల కాలంలో సాగే పీరియాడిక్‌ లవ్‌స్టోరీ ఇది. పైగా ప్రపంచంలో ‘కళాత్మకం’గా ఉండే దేశం యూరప్‌. దాన్ని మ్యాచ్‌ చేసేలా చిత్ర ప్రొడక్షన్‌ డిజైనర్‌ రవీందర్‌ రెడ్డి యూరప్‌కి సంబంధించిన హౌస్‌ ఇంటీరియర్‌ సెట్‌ని ఇక్కడ వేశారు. విదేశాలు, దేశీ ఊళ్లు, పల్లెలే కాదు అడవి కూడా నగరానికి వచ్చింది. అల్లు అర్జున్‌ ‘పుష్ప’ సినిమా స్మగ్లింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. రాజమండ్రి సమీపంలో గల మారేడుమిల్లి ఫారెస్ట్‌లో ఎక్కువ శాతం చిత్రీకరణ ప్లాన్‌ చేసుకున్నారు. కరోనా లాక్‌డౌన్‌ తర్వాత యూనిట్‌ అక్కడికెళ్లింది. అయితే నలుగురికి కరోనా రావడంతో తిరిగొచ్చేశారు. ఇప్పుడు కొంత భాగం అడవి సెట్‌ని ఇక్కడ వేసి, షూటింగ్‌ జరిపి, కొంచెం పరిస్థితులు చక్కబడ్డాక మారేడుమిల్లి వెళ్లాలనుకుంటున్నారు.

మరోవైపు కోల్‌కత్తాని భాగ్యనగరానికి తెచ్చారు. ‘నాని’ నటిస్తున్న ‘శ్యామ్‌ సింగరాయ్‌’ కథానుసారం ఎక్కువ శాతం కోల్‌కత్తాలో షూట్‌ చేయాలి. కోల్‌కత్తా ప్రాధాన్యం ఉన్న కథ కాబట్టి, ఎక్కువ రోజులు అక్కడ చిత్రీకరణ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టం అవుతుందని కోల్‌కత్తా సెట్‌ వేశారు. కాళీ టెంపుల్‌ సెట్‌ కూడా ఒకటి ఉందని తెలిసింది. ముంబైని హైదరాబాద్‌ తీసుకొచ్చారు ‘ఫైటర్‌’. విజయ్‌ దేవరకొండ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాకి ముంబై కీలకం. లాక్‌డౌన్‌కి ముంబై వెళ్లి షూటింగ్‌ కూడా చేశారు. ఇలా హాట్‌ టాపిక్‌గా నిలిచిన సెట్స్‌లో బంగారు గనుల సెట్‌ ఒకటి. యశ్‌ హీరోగా సంచలన విజయం నమోదు చేసుకున్న ‘కేజీఎఫ్‌’ చిత్రం కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ నేపథ్యంలో సాగిన విషయం తెలిసిందే. ఈ చిత్రం సీక్వెల్‌ కోసం బంగారు గనుల సెట్‌ వేశారు.

ఇక అఖిల్‌ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ షూటింగ్‌ దాదాపు పూర్తయింది. అమెరికా బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుంది. ఇంకో చిన్న షెడ్యూల్‌ కోసం అమెరికాని తలపించే చిన్న చిన్న ఎక్స్‌టెన్షన్‌ సెట్స్‌ వేశారని తెలిసింది. రాజకీయ నేపథ్యంలో సాయిధరమ్‌ తేజ్‌ ఓ మూవీ  చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఏలూరిని తలపించే సెట్‌ వేశారు. ప్రస్తుతం ఏలూరులో చిత్రీకరణ జరుగుతోంది. ఆ తర్వాత సెట్‌లో షూట్‌ మొదలవుతుంది. కల్యాణ్‌ దేవ్‌ ‘కిన్నెరసాని’ని మదనపల్లిలో షూట్‌ చేశారు. ఇందులో హీరో ఇంటి సన్నివేశాలను మదనపల్లిలో తీశారు. కొనసాగింపు సన్నివేశాల కోసం ఇక్కడ ఇంటి సెట్‌ వేశారు. ఇంకా ఇలా ప్రయాణాలు తగ్గించుకునే క్రమంలో ఇక్కడే సెట్‌ వేసుకున్న సినిమాలు కొన్ని ఉన్నాయి.

కరోనా కారణంగా ఆగిన చిత్రీకరణల వల్ల నిర్మాతలకు నష్టమే. దాంతోపాటు అనుకోకుండా సెట్లు వేయాల్సి రావడంతో బడ్జెట్‌ పెరగడం ఖాయం. సినిమాల కోసం సెట్ల రూపంలో ఊళ్లు కదలి వచ్చాయి. ప్రేక్షకులు థియేటర్లకు కదలి వస్తే సినిమాని నమ్ముకున్నవారు ‘సెట్‌’ అవుతారు.


‘పుష్ప’లో అల్లు అర్జున్‌;  ‘అన్నాతే’లో రజనీకాంత్‌


‘రాధేశ్యామ్‌’లో పూజాహెగ్డే, ప్రభాస్‌; ‘ఫైటర్‌’లో విజయ్‌ దేవరకొండ, అనన్య; ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’లో పూజా హెగ్డే, అఖిల్‌


‘కేజీఎఫ్‌ 2’లో యశ్‌; కల్యాణ్‌దేవ్‌; నాని

మరిన్ని వార్తలు