‘A’ మూవీ రివ్యూ

5 Mar, 2021 14:19 IST|Sakshi
Rating:  

టైటిల్‌ : A
జానర్ : సస్పెన్స్ థ్రిల్లర్
నటీనటులు : నితిన్‌ ప్రసన్న, ప్రీతి అస్రాని తదితరులు
నిర్మాణ సంస్థ : అవంతి ప్రొడక్షన్స్‌
నిర్మాతలు :  గీతా మిన్సాల
దర్శకత్వం : యుగంధర్‌ ముని
సంగీతం : విజయ్‌ కురాకుల
ఎడిటింగ్‌: ఆనంద్‌ పవన్‌ 
సినిమాటోగ్రఫీ : ప్రవీణ్‌ కె బంగారి
విడుదల తేది : మార్చి 05, 2021

నితిన్ ప్రసన్నను హీరోగా పరిచయం చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 'A'. అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై గీతా మిన్సాల నిర్మించిన చిత్రానికి యుగంధర్ ముని దర్శకత్వం వహించాడు. కొత్త అంశాన్ని తీసుకొని సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమాని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై ఆసక్తి పెంచాయి. దానికి పెద్ద ఎత్తున ప్రమోషన్స్‌ చేయడంతో ఈ సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయింది. ఎన్నో అంచనాల మధ్య మార్చి 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘A’ మూవీ ప్రేక్షకులు ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం 

కథ
సంజీవ్(నితిన్ ప్రసన్న) గతం మర్చిపోయిన వ్యక్తి. భార్య పల్లవి(ప్రీతి అశ్రాని)తో కలిసి ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తుంటాడు. ఇలా జీవితం సాగుతున్న తరుణంలో, ఒకే కల అతడిని పదే పదే వేధిస్తూ ఉంటుంది. అసలు సంజీవ్‌కు ఆ కల ఎందుకు వస్తుందో, అతనికి ఉన్న రోగం ఏంటో తెలుసుకోవడానికి వైద్యులు చాలా ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ ఫలితం ఉండదు. అతని గతం గుర్తుకు వస్తే ఆ కల ఎందుకు వస్తుందో తెలుసుకోవచ్చని వైద్యులు సలహా ఇస్తారు. దీంతో సంజీవ్‌ తన గతం తెలుసుకోవాలనుకుంటాడు. దీనికి తన స్నేహితుడి సహాయం తీసుకుంటాడు.

ఈ క్రమంలో అతనికి ఎమర్జెన్సీ కాలం నాటి అశ్వథ్థామ గురించి తెలుస్తుంది. అతని చరిత్ర ఏంటో తెలిస్తే తన గతానికి సంబంధించి ఏదైనా క్లూ దొరుకుతుందని ఆ దిశగా ప్రయత్నం చేస్తారు. కట్‌ చేస్తే.. ఆగస్టు 12న బోయినపల్లి పుట్‌పాత్‌పై ఓ చిన్నారి కిడ్నాప్‌ అవుతుంది. ఆ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు.. విచారణను రిటైర్‌మెంట్‌కు దగ్గరలో ఉన్న ఓ సీనియర్‌ పోలీసు అధికారికి అప్పగిస్తారు. కేసు విచారణలో పోలీసులు సంజీవ్‌ను అరెస్ట్‌ చేస్తారు. కానీ ఆ కిడ్నాప్‌ చేసింది సంజీవ్‌ కాదని తెలుసుకొని అతన్ని వదిలేస్తారు. అసలు చిన్నారులను కిడ్నాప్‌ చేస్తుందెవరు? కిడ్నాపర్‌కు సంజీవ్‌కు ఉన్న సంబంధం ఏంటి? సంజీవ్‌ గతానికి ఎమర్జెన్సీ కాలం నాటి అశ్వథ్థామకు సంబంధం ఏంటి? సంజీవ్‌ను పదే పదే వేధిస్తున్న కల ఏంటి? చిన్నారులను దేని కోసం కిడ్పాప్‌ చేశారు? అనేదే మిగత కథ

నటీనటులు
హీరో సంజీవ్‌కు ఇది తొలి సినిమా. అయినప్పటికీ ఎన్నో సినిమాల అనుభవం ఉన్నవాడిలా నటించాడు. మూడు విభిన్న పాత్రల్లో నటించి మెప్పించాడు. 'మళ్ళీరావా, ప్రెషర్ కుక్కర్'' ఫేమ్ ప్రీతి అశ్రాని పల్లవి పాత్రలో ఒదిగిపోయింది. కొన్ని ఎమోషనల్‌ సీన్లలో కూడా ఆమె అవలీలగా నటించారు. అలాగే మిగతా నటీనటులు తమ పాత్ర పరిధిమేరకు నటించారు. 

విశ్లేషణ
ఉత్కంఠ రేపే కథనం, ఆశ్చర్యాన్ని కలిగించే కథ.. ఇలాంటి అంశాలతో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. వస్తున్నాయి కూడా. ప్రేక్షకులు కూడా ఇలాంటి సినిమాలకు బ్రహ్మ రథం పడుతుతండడంతో దర్శకనిర్మాతలు కూడా ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కించడానికి ముందుకొస్తున్నారు. ఈ A మూవీ కూడా అలాంటిదే. ఇదో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. సాధారణంగా దర్శకులు సేఫ్‌గా ఉండేందుకు తమ తొలి సినిమాని  ప్రేమ కథతో ప్రారంభిస్తారు. కానీ యంగ్‌ డైరెక్టర్‌ యుగంధర్ మాత్రం తన డెబ్యూ మూవీతోనే ఓ ప్రయోగం చేశాడు.

సైన్స్, డిమాండ్స్, సాక్రిఫైజ్ అనే మూడు విభిన్న కోణాలను టచ్ చేస్తూ ఈ కథను ఎంతో ఆసక్తికరంగా మలిచాడు. సస్పెన్స్‌ను ఆద్యంతం గుప్పిట్లో ఉంచి నడిపించిన తీరు ప్రశంసనీయం. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింది. అయితే దర్శకుడు ఎంచుకున్న కథ బాగున్నప్పటికీ స్లోనెరెషన్‌ కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రీక్లైమాక్స్‌ కాస్త నెమ్మదిగా సాగి ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం విజయ్‌ కురాకుల సంగీతం. పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయినా.. తన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో మాయ చేశాడు. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. ప్రవీణ్‌ కె బంగారి సినిమాటోగ్రాఫి బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌
కథ, కథనం
నితిన్‌ ప్రసన్న నటన
ఇంటర్వెల్‌ ట్విస్ట్‌

మైనస్‌ పాయింట్స్‌
సెకండాఫ్‌ కొన్ని సాగదీత సీన్లు
సింపుల్‌ క్లైమాక్స్‌
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(2.5/5)
Poll
Loading...
మరిన్ని వార్తలు