Aadikeshava Movie Review: ఉప్పెన హీరో వైష్ణవ్‌ తేజ్‌.. ఆదికేశవ సినిమా రివ్యూ

24 Nov, 2023 12:33 IST|Sakshi
Rating:  

టైటిల్‌: ఆదికేశవ
తారాగణం: వైష్ణవ్‌ తేజ్‌, శ్రీలీల, జోజు జార్జి, అపర్ణ దాస్‌, సుమన్‌, తణికెళ్లభరణి, జయ ప్రకాష్, రాధిక, సుదర్శన్ తదితరులు
దర్శకుడు: శ్రీకాంత్‌ ఎన్‌ రెడ్డి
సంగీతం : జీవీ ప్రకాశ్‌
నిర్మాత 
సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
విడుదల తేదీ: 24 నవంబర్‌ 2023

ఉప్పెనతో వైష్ణవ్ తేజ్ టాలీవుడ్‌లో ఉప్పెనలా దూసుకొచ్చాడు. మాస్ హీరోగా తన ముద్ర వేసేందుకు వైష్ణవ్ తేజ్ ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదికేశవ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా సోషల్ మీడియాలో మంచి స్పందనను తెచ్చుకున్నాయి. అయితే ఈ మూవీ ఇప్పుడు థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

కథ ఏంటంటే..
ఆదికేశవ కథ ఓ వైపు సిటీలో సాగుతుంది.. మరో వైపు రాయలసీమలోని బ్రహ్మసముద్రంలో జరుగుతుంటుంది. సిటీలో బాలు (వైష్ణవ్ తేజ్) కథ నడుస్తుంటుంది.. సీమలో చెంగారెడ్డి (జోజు జార్జి) అరాచకాలు నడుస్తుంటాయి. తల్లిదండ్రులు, అన్న.. ఇలా ఫ్యామిలీతో హాయిగా గడిపేస్తుంటాడు బాలు. తన కంపెనీ సీఈవో చిత్ర (శ్రీలీల)ను బాలు ప్రేమిస్తుంటాడు. బాలుని సైతం చిత్ర ఇష్టపడుతుంటుంది. అంతా బాగానే ఉందనుకునే సమయంలోనే బాలు గతం, నేపథ్యం తెరపైకి వస్తుంది. బాలుకి ఆ సీమతోనే సంబంధం ఉంటుంది. సీమకు బాలు వెళ్లాల్సి వస్తుంది. బాలు కాస్త రుద్రకాళేశ్వరరెడ్డి అని తెలుస్తుంది... రుద్ర తండ్రి మహా కాళేశ్వర రెడ్డి (సుమన్) ఎలా మరణిస్తాడు? సీమలో అడుగు పెట్టిన బాలు అలియాస్ రుద్ర ఏం చేశాడు? చివరకు చెంగారెడ్డిని ఎలా అంతమొందించాడు? అనేది కథ.

ఎలా ఉందంటే..?
ఆదికేశవ కొత్త కథేమీ కాదు. ఈ ఫార్మాట్‌లో వచ్చిన ఎన్నో సినిమాలను మనం ఇది వరకు చూశాం. చూసిన కథే అయినా కూడా రెండు గంటల పాటు అలా నడిపించేశాడు దర్శకుడు. అక్కడక్కడా ప్రేక్షకుడికి బోర్ కొట్టించినా.. అదే సమయంలో ఓ పాట, ఓ పంచ్ వేసి కవర్ చేసేశాడు డైరెక్టర్. పక్కా మీటర్‌లో తీసిన ఈ కమర్షియల్ చిత్రం బీ, సీ సెంటర్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్‌లో హీరోయిజం ఎలివేట్ చేసే సీన్లు, హీరో మంచితనానికి అద్దం పట్టే సీన్లు బాగుంటాయి.

హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ బాగుంటుంది. తెరపై పాటలు చూడముచ్చటగా ఉంటాయి. ఇంటర్వెల్‌కు కథ ఆసక్తికరంగా మారుతుంది. రెండో భాగమంతా కూడా రాయలసీమకు షిప్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఎమోషనల్ పార్ట్ ఎక్కువ అవుతుంది. వయొలెన్స్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఫైట్స్ చూస్తే రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే! ఊహకందేలా సాగే కథనం కాస్త మైనస్‌గా అనిపిస్తుంది.

ఎవరెలా చేశారంటే?
యంగ్ హీరో వైష్ణవ్ తేజ్‌కు ఇది చాలా కొత్త పాత్ర. ఫస్ట్ హాఫ్‌లో జాలీగా తిరిగే పక్కింటి కుర్రాడిగా అవలీలగా నటించేశాడు. రెండో భాగంలో పూర్తి వేరియేషన్ చూపించాడు. మాస్ యాక్షన్, ఎమోషనల్ సీన్లలో మెప్పించాడు. శ్రీలీల తన డ్యాన్సులు, గ్లామర్‌తో మరోసారి మెస్మరైజ్ చేసింది. మాలీవుడ్ నటుడు జోజు జార్జ్ తెలుగులో మొదటి సారిగా కనిపించాడు. విలన్‌గా ఆకట్టుకున్నాడు. సుమన్, తణికెళ్ల భరణి, జయ ప్రకాష్, రాధిక, సుదర్శన్ ఇలా అన్ని పాత్రలు పరిధి మేరకు మెప్పిస్తాయి. సాంకేతికంగా ఈ చిత్రం ఉన్నతంగానే కనిపిస్తుంది. పాటలు బాగున్నాయి. మాటలు అక్కడక్కడా ఎమోషనల్‌గా టచ్ అవుతాయి. రెండు గంటల నిడివితో ఎడిటర్ ప్రేక్షకుడికి ఊరటనిచ్చాడనిపిస్తుంది. కెమెరా వర్క్ చాలా రిచ్‌గా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

చదవండి: సౌండ్‌ పార్టీ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Rating:  
(2.5/5)

whatsapp channel

Poll
Loading...
మరిన్ని వార్తలు

Garudavega