ఎన్నేళ్లయింది వెంకీ నిన్ను చూసి.. బ్యాక్‌ టు బాలీవుడ్‌!

30 Jan, 2022 05:09 IST|Sakshi

బాలీవుడ్‌ తెరపై ఎన్నేళ్లయింది నాగ్‌ నిన్ను చూసి.. ఎన్నేళ్లయింది వెంకీ నిన్ను చూసి.. ఎన్నేళ్లయింది రాశీ నువ్వు కనబడి.. ఎన్నేళ్లయింది నిధీ నువ్వు కనబడి.. ఎన్నేళ్లకెన్నేళ్లకు అంటోంది బాలీవుడ్‌. మరి.. హిందీలో వెంకటేశ్‌ కనిపించి పాతికేళ్లయింది. నాగార్జున దాదాపు 20 ఏళ్లు. రాశీ ఖన్నా, నిధీ అగర్వాల్‌ చిన్న బ్రేక్‌ తర్వాత హిందీ సినిమాలు చేస్తున్నారు. బాలీవుడ్‌లో ఈ నలుగురూ చేస్తున్న సినిమాల గురించి తెలుసుకుందాం.

కెరీర్‌లో దాదాపు 75 సినిమాలు చేశారు వెంకటేశ్‌. వాటిలో దాదాపు పాతిక రీమేక్సే ఉంటాయి. అసలు బాలీవుడ్‌లో వెంకటేశ్‌ వేసిన తొలి అడుగు కూడా రీమేక్‌తోనే పడింది. 1991లో వచ్చిన తమిళ చిత్రం ‘చిన్న తంబి’ (ఇదే సినిమాను తెలుగులో వెంకటేశ్‌ హీరోగా ‘చంటి’గా రీమేక్‌ చేశారు) హిందీ రీమేక్‌ ‘అనాడీ’తో వెంకటేశ్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు. 1993లో ఈ చిత్రం బీ టౌన్‌లో మంచి హిట్‌ సాధించింది. వెంకీకి హిందీలోనూ పాపులారిటీ పెరిగింది.

ఇక హిందీలో వెంకీ చేసిన రెండో సినిమా కూడా రీమేకే కావడం విశేషం. 1994లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో అలీ హీరోగా పరిచయమైన ‘యమలీల’ చిత్రం అప్పట్లో ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. ఈ సినిమా హిందీ రీమేక్‌ ‘తక్‌దీర్‌వాలా’లో వెంకటేశ్‌ హీరోగా చేశారు. ఆ తర్వాత బాలీవుడ్‌లో మరో మూవీ చేయడానికి వెంకీ ఆసక్తి చూపించలేదు. కానీ ఆ సమయం ఇప్పుడు వచ్చింది. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఓ హిందీ సినిమా చేసేందుకు వెంకీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

సల్మాన్‌ ఖాన్, వెంకటేశ్‌ హీరోలుగా ఫర్హాద్‌ సామ్‌జీ దర్శకత్వంలో ఓ యాక్షన్‌ కామెడీ ఫిల్మ్‌ రూపొందనుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. అలాగే తెలుగులో హిట్‌ సాధించిన ‘ఎఫ్‌ 2’ హిందీ రీమేక్‌లో వెంకటేశ్, అర్జున్‌ కపూర్‌ నటిస్తారనే వార్తలు వచ్చాయి. కానీ ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది.

మరోవైపు ‘శివ, ద్రోహి, క్రిమినల్, అగ్ని వర్ష్‌’... ఇలా హిందీలో దాదాపు పది సినిమాలు చేశారు నాగార్జున. 2003లో వచ్చిన హిందీ చిత్రం ‘ఎల్‌ఓసీ: కార్గిల్‌’లో ఓ లీడ్‌ రోల్‌ చేసిన నాగార్జున ఆ తర్వాత హిందీ సినిమా చేయలేదు. అయితే ఇప్పుడు ఏకంగా మూడు భాగాలుగా విడుదల కానున్న హిందీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’లో నాగార్జున ఓ లీడ్‌ రోల్‌ చేశారు. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ ట్రయాలజీ ఫిల్మ్‌లో రణ్‌బీర్‌ కపూర్, ఆలియా భట్‌ హీరోహీరోయిన్లు కాగా, అమితాబ్‌ బచ్చన్, డింపుల్‌ కపాడియా ఇతర ప్రధాన తారాగణంగా కనిపిస్తారు.‘బ్రహ్మాస్త్ర’ తొలి భాగం ‘బ్రహ్మాస్త్ర: శివ’ ఈ ఏడాది సెప్టెంబరు 9న విడుదల కానుంది.

ఇక అందాల తార రాశీ ఖన్నా దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ బీ టౌన్‌ వైపు వెళ్లారు. 2013లో వచ్చిన హిందీ చిత్రం ‘మద్రాస్‌ కేఫ్‌’తో నటిగా రాశీ ఖన్నా కెరీర్‌ ఆరంభమైంది. కానీ ఈ సినిమా విడుదల తర్వాత రాశీకి హిందీలో పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే తెలుగులో మాత్రం ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంలో హీరోయిన్‌గా చాన్స్‌ వచ్చింది. ఆ సినిమా తర్వాత తెలుగులో ఒక్కసారిగా రాశీకి అవకాశాలు క్యూ కట్టాయి.

దాంతో ఎనిమిది సంత్సరాల వరకు రాశీ డైరీ సౌత్‌ సినిమాలతో ఖాళీ లేకుండా పోయింది. అయితే తాజాగా తన డైరీలో ‘యోధ’ అనే హిందీ సినిమాకు రాశీ ఖన్నా చోటు కల్పించారు. సిద్ధార్థ్‌ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ఈ సినిమాను సాగర్‌ అమ్రే, పుష్కర్‌ ఓజా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో దిశా పటానీ మరో హీరోయిన్‌. యాక్షన్‌ మూవీ ‘యోధ’ ఈ ఏడాది నవంబరు 11న విడుదల కానుంది. అయితే రాశీ కేవలం హిందీలో సినిమా మాత్రమే కాదు.. వెబ్‌ సిరీస్‌లూ చేస్తున్నారు.

అజయ్‌ దేవగన్‌ ‘రుద్ర’, షాహిద్‌ కపూర్‌ ‘సన్నీ’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) వెబ్‌ సిరీస్‌ను ఆమె ఆల్రెడీ పూర్తి చేసేశారు. ఈ ఏడాదే ఈ సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. సేమ్‌ టు సేమ్‌ రాశీ ఖన్నాలానే నిధి ముందు హిందీ సినిమా ద్వారానే కథానాయిక అయ్యారు. ‘మున్నా మైఖేల్‌’ (2017) అనే సినిమాతో హిందీ తెరపై తొలిసారి కనిపించారు. తాజాగా హిందీలో ఓ పెద్ద సినిమా అంగీకరించి నట్లుగా నిధీ అగర్వాల్‌ తెలిపారు. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.ఈ నలుగురే కాదు.. మరికొందరు తారలు ‘బ్యాక్‌ టు బాలీవుడ్‌’ అంటూ హిందీ ప్రాజెక్ట్స్‌ అంగీకరించే పనిలో ఉన్నారు

మరిన్ని వార్తలు