కోవిడ్‌తో సీనియర్‌ నటుడు కన్నుమూత

10 Apr, 2021 20:58 IST|Sakshi
కరోనాతో మృతి చెందిన సీనియర్‌ నటుడు సతీష్‌ కౌల్‌ (ఫోటో కర్టెసీ: ఇండియా టుడే)

సీనియర్‌ నటుడు, ‘మహాభారత్‌’ ఫేం సతీశ్‌ కౌల్‌ మృతి

చండీగఢ్‌:  ‘మహాభారతం’ సీరియల్‌ ఫేమ్‌, సీనియర్‌ నటుడు ఒకరు కరోనా బారిన పడి మృతి చెందారు. ప్రముఖ నటుడు సతీష్ కౌల్(66) కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వారం రోజుల క్రితం సతీష్‌ కౌల్‌కు కరోనా సోకింది. దాంతో ఆయన పంజాబ్‌ లుథియానా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శుక్ర‌వారం రాత్రి ఆయన ఆరోగ్య ప‌రిస్థితి విషమించ‌డంతో తుది శ్వాస విడిచారు.

సతీష్‌ కౌల్‌ బీఆర్ చోప్రా నిర్మించిన‌ మహాభారతం సీరియల్‌తో పాటు కర్మ, ప్రేమ్‌ ప్రభాత్‌, వారెంట్‌, గునాహో కా ఫైస్లా వంటి హిందీ చిత్రాల్లో న‌టించారు. ప‌లు నాటక ప్రదర్శనల్లో కూడా పాల్గొన్నారు. గత కొద్ది కాలంగా సతీష్‌ కౌల్‌ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాయం చేయాల్సిందిగా అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. 

ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా (ఎఫ్టీఐఐ) 1969 బ్యాచ్‌లో గ్రాడ్యుయేష‌న్ చేసిన‌ సతీష్ కౌల్.. 1954 సెప్టెంబర్ 8న కశ్మీర్‌లో జన్మించారు. బాలీవుడ్ నటులు జయ బచ్చన్, షత్రుఘ్న‌ సిన్హా, జరీనా వహాబ్, డానీ డెంజోంగ్పా, ఆశా సచ్‌దేవా, ఓం పూరి వంటి వారు ఎఫ్టీఐఐలో అతని బ్యాచ్ మేట్స్. స‌తీష్ కౌల్‌ ప్రధానంగా పంజాబీ సినిమాల్లో న‌టించారు. అతను 300 కి పైగా చిత్రాలలో పనిచేశారు. అందులో 85 చలన చిత్రాలలో ప్రధాన పాత్ర పోషించారు. సతీష్‌ కౌల్‌‌ ముఖ్యంగా మహాభారతం, విక్రమ్ ఔర్ బేతాల్‌ అనే టెలివిజన్ షోలలో న‌టించి మెప్పించారు. బీఆర్ చోప్రా నిర్మించిన మ‌హాభార‌తం సీరియ‌ల్‌లో ఇంద్ర పాత్ర పోషించారు. 

చదవండి: కరీంనగర్‌‌లో అమానుషం: పగవాడికి కూడా ఈ కష్టం వద్దు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు