Singapore: మాస్క్‌ మళ్లొచ్చింది.. సింగపూర్‌లో షురూ!

14 Dec, 2023 11:02 IST|Sakshi

కోవిడ్-19 వైరస్‌కు చెందిన కొత్త వేరియంట్ల కారణంగా శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ నేపధ్యంలో ఆగ్నేయాసియాలోని పలు ప్రభుత్వాలు వైరస్‌ నియంత్రణకు తిరిగి పాత నిబంధనలు అమలుకోకి తీసుకురావాలని నిర్ణయించాయి. విమానాశ్రయాల్లో ప్రయాణికులు మళ్లీ మాస్క్‌లు ధరించాలని అధికారులు కోరుతున్నారు. 

విమానాశ్రయాల్లో ప్రయాణికుల జ్వరాన్ని తనిఖీ చేయడానికి థర్మల్ స్కానర్‌లను తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చారు. ఫ్లూ, న్యుమోనియా, ఇతర శ్వాసకోశ వ్యాధులకు కారణమయ్యే  కోవిడ్ వేరియంట్‌ల తరహాలోని పలు సూక్ష్మక్రిముల వ్యాప్తిని అరికట్టాలని వివిధ ప్రభుత్వాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వైరస్‌ నియంత్రణకు ముమ్మర చర్యలు చేపడుతోంది. జనాభాలో రోగనిరోధక శక్తి తగ్గడం, సంవత్సరాంతపు, పండుగ సీజన్లలో ప్రయాణాలు మొదలైనవి వైరస్‌ వ్యాప్తిని మరింతగా పెంచుతాయని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. 

కోవిడ్ -19 కేసులు పెరుగుతున్న దేశాలకు, లేదా ప్రాంతాలకు ప్రయాణికులను వెళ్లవద్దని ఇండోనేషియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇండోనేషియన్లను అభ్యర్థించింది. కాగా గత వారం రోజుల్లో మలేషియాలో కోవిడ్ కేసులు దాదాపు రెట్టింపు అయ్యాయి. దీంతో ఇండోనేషియా అధికారులు కొన్ని సరిహద్దు పోస్టుల వద్ద థర్మల్ స్కానర్‌లను తిరిగి ఏర్పాటు చేశారు. ఫెర్రీ టెర్మినల్, జకార్తాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో కోవిడ్‌ వైరస్‌ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. 

దక్షిణాసియాలోని పలు దేశాల్లో తిరిగి కోవిడ్‌ నియంత్రణ చర్యలు అమలవుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహమ్మారి విజృంభణ సమయంలో ఆసియాలో కఠినమైన నిబంధనలు అమలయ్యాయి.  ఇటీవల సింగపూర్ ఉప ప్రధాని లారెన్స్ వాంగ్ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో కోవిడ్‌-19 నియంత్రణకు ప్రభుత్వం కఠినమైన నిబంధనలను పునరుద్ధరించాలని చూస్తోందని ప్రకటించడంతో సింగపూర్‌వాసుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. 
ఇది కూడా చదవండి: శ్రీరామ భక్తులకు యోగి సర్కార్‌ మరో కానుక!

>
మరిన్ని వార్తలు