ఎన్నికల విధులు బాధ్యతగా నిర్వహించాలి | Sakshi
Sakshi News home page

ఎన్నికల విధులు బాధ్యతగా నిర్వహించాలి

Published Fri, Nov 10 2023 5:02 AM

ఓపీఓలకు సూచనలు చేస్తున్న కలెక్టర్‌ కర్ణన్‌ 
 - Sakshi

చండూరు: ప్రతిఒక్కరూ ఎన్నికల విధులను బాధ్యతగా నిర్వహించాలని, ముఖ్యంగా ఓపీఓలు విధులపై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్‌ అన్నారు. గురువారం చండూరులోని మరియనికేతన్‌లో ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌లో ఓపీఓలకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని ఆయన సందర్శించారు. శిక్షణ పొందుతున్న ఓపీఓలను వారి విధులపై ప్రశ్నలు అడిగి కలెక్టర్‌ తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలింగ్‌ రోజు ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లు తీసుకొస్తున్న గుర్తింపు కార్డు ఏదో చూసి ఓటరు జాబితాలో మొదటి పోలింగ్‌ అధికారి మార్క్‌ చేయాలన్నారు. రెండవ పోలింగ్‌ అధికారి ఓటర్ల రిజిస్టర్‌లో ఓటర్‌ వివరాలు నమోదు చేస్తూ ఎడమ చేతి చూపుడు వేలిపై ఇంక్‌ మార్క్‌ వేయడంతో పాటుగా స్లిప్‌ జారీ చేసి సంతకం లేదా వేలిముద్ర తీసుకోవాలని సూచించారు. మూడవ పోలింగ్‌ అధికారి స్లిప్‌ చెక్‌ చేసి కంట్రోల్‌ యూనిట్‌లో బ్యాలెట్‌ బటన్‌ను నొక్కి ఓటరును ఓటు వేయడానికి అనుమతి ఇస్తారని తెలిపారు. ముందుగా కలెక్టర్‌ కర్ణన్‌ చండూరు మండల పరిధిలోని ఉడుతలపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన ఎస్‌ఎస్‌టీ చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించి అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేశారు.

ఆర్‌ఓ కార్యాలయం సందర్శన

నకిరేకల్‌: నకిరేకల్‌లోని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి (ఆర్‌ఓ) కార్యాలయాన్ని గురువారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కర్ణన్‌ సందర్శించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. హెల్ప్‌ డెస్క్‌ ద్వారా అభ్యర్థులకు నామినేషన్‌ వేయడంలో సందేహాలు ఉంటే క్లియర్‌ చేయాలని ఆదేశించారు. ఆయన వెంట మునుగోడు నియోజకవర్గ ఆర్‌ఓ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌, సహాయ ఎన్నికల అధికారి ప్రసాద్‌ నాయక్‌ ఉన్నారు.

ఫ జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్‌

రూ.42.86 కోట్ల నగదు, ఆభరణాలు స్వాధీనం

నల్లగొండ: జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన తర్వాత పోలీస్‌, ఎకై ్సజ్‌, ఇతర శాఖలు జరిపిన తనిఖీల్లో ఇప్పటి వరకు మొత్తం 42,86,93,443 రూపాయల విలువైన నగదుతోపాటు మద్యం, బంగారం, వెండి, డ్రగ్స్‌, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆర్‌వీ.కర్ణన్‌ గురువారం తెలిపారు. జిల్లాలో వివిధ శాఖల ద్వారా ఎలక్ట్రానిక్‌ సీజర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం ద్వారా ఈ వివరాలు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా గ్రీవెన్స్‌ కమిటీ ద్వారా స్వాధీనం చేసుకున్న నగదు, ఇతర వస్తువులకు సంబంధించి 221 కేసులను పరిశీలించి 217 క్లియర్‌ చేసి 33,74,53,000 రూపాయల విలువైన నగదును విడుదల చేసినట్లు తెలిపారు.

Advertisement
Advertisement