జిల్లాకు 3,234 బ్యాలెట్‌ యూనిట్లు కేటాయింపు | Sakshi
Sakshi News home page

జిల్లాకు 3,234 బ్యాలెట్‌ యూనిట్లు కేటాయింపు

Published Tue, Nov 21 2023 2:04 AM

కొండమల్లేపల్లిలో నిరుద్యోగ చైతన్య యాత్ర
 - Sakshi

నల్లగొండ: సాధారణ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 30న జరగనున్న పోలింగ్‌కు సంబంధించి ఆరు నియోజక వర్గాల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్యను బట్టి జిల్లాకు మొత్తం 3,234 బ్యాలెట్‌ యూనిట్లను ఎన్నికల అధికారులు కేటాయించారు. ఒక్కో పోలింగ్‌ స్టేషన్‌కు 2 నుంచి 3 వరకు బ్యాలెట్‌ యూనిట్లు అవసరమవుతున్నాయి. అభ్యర్థులు 15 మంది లోపు ఉంటే ఒక యూనిట్‌, 31 మంది వరకు ఉంటే రెండో యూనిట్‌ను, ఆ పై చిలుకు అభ్యర్థులు ఉంటే 3 బ్యాలెట్‌ యూనిట్లను ఉపయోగించాల్సి ఉంటుంది. ఒక్కో యూనిట్‌లో 15 మంది అభ్యర్థులతో పాటు నోటా కూడా ఉంటుంది. దేవరకొండ నియోజకవర్గానికి 310, సాగర్‌కు 299, మిర్యాలగూడకు 526, నల్లగొండకు 568, మునుగోడుకు 921, నకిరేకల్‌కు 610 బ్యాలెట్‌ యూనిట్లను వినియోగిస్తున్నారు. మొత్తం ఆరు నియోజక వర్గాల పరిధిలో 144 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు.

సౌత్‌ జోన్‌ పోటీలకు ‘ఎన్జీ’ విద్యార్థుల ఎంపిక

రామగిరి(నల్లగొండ): ఎంజీయూ క్యాంపస్‌లో సోమవారం జరిగి అంతర్‌ కళాశాలల యోగా, ఫుట్‌బాల్‌ పోటీల్లో ఎన్జీ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి సౌత్‌ వెస్ట్‌ జోన్‌ ఇంటర్‌ యూనివర్సిటీ టోర్నమెంట్‌కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కళాశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ కడారి మల్లేష్‌ మాట్లాడుతూ కళాశాలకు చెందిన సీహెచ్‌.ప్రణయ్‌కుమార్‌, వి.ప్రశాంత్‌, బి.వినయ్‌, కె.నవీన్‌కుమార్‌ యోగా విభాగంలో, ఎం.లావణ్య ఫుట్‌బాల్‌ విభాగంలో సౌత్‌ వెస్ట్‌ జోన్‌ ఇంటర్‌ యూనివర్సిటీ పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు.

జాతీయ సమైక్యత శిబిరానికి..

భువనగిరి: కర్నాటకలో ఈ నెల 22నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ సమైక్యత శిబిరానికి భువనగిరిలోని జాగృతి డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థిని ఎంపికయ్యారు. సోమవారం కళాశాల ప్రిన్సిపాల్‌ సూర్యానారాయణరెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్‌ మణిపాల్‌రెడ్డి విద్యార్థిని లక్ష్మిక ఎంపిక పత్రం అందజేసి సత్కరించారు. ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లలో నైపుణ్యం పెంచేందుకు క్రీడలు, యువజన సర్వీసుల ఆధ్వర్యంలో కేంద్రం ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి పదేళ్లుగా జాతీయ సమైక్యత శిబిరాలకు ఎంపివుతున్నారని ప్రిన్సిపాల్‌ పేర్కొన్నారు.

ముగిసిన పుస్తక ప్రదర్శన

రామగిరి(నల్లగొండ): జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో నిర్వహిస్తున్న పుస్తక ప్రదర్శన సోమవారం ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస, రీడథాన్‌, పుస్తక సమీక్ష, క్విజ్‌ పోటీల్లో విజేతలైన వారికి బహుమతులుగా పుస్తకాలతోపాటు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి ప్రతీక్‌రెడ్డి ఫౌండేషన్‌ సీఈఓ ఎంవీ.గోనారెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మునీర్‌, లైబ్రేరియన్‌ డాక్టర్‌ ఏ.దుర్గాప్రసాద్‌, డాక్టర్‌ కృష్ణకౌండిన్య, డాక్టర్‌ యాదగిరి, ఎన్‌.లవీందర్‌రెడ్డి, డాక్టర్‌ నాగుల వేణు, శివరాణి, యాదగిరిరెడ్డి, విజయ్‌కుమార్‌, సూదిని వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కొండమల్లేపల్లికి చేరిన నిరుద్యోగ చైతన్య యాత్ర

కొండమల్లేపల్లి: హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఈనెల 15న చేపట్టిన నిరుద్యోగ చైతన్య యాత్ర సోమవారం కొండమల్లేపల్లి మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా పలువురు ఓయూ విద్యార్థులు మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొనసాగిన తెలంగాణ మలి దశ ఉద్యమంలో ఓయూ విద్యార్థులు ప్రధాన పాత్ర పోషించారని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు లేవని ఆరోపించారు. ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పాలన్నారు. మేనిఫెస్టోలో నిరుద్యోగులకు భరోసా ఇచ్చిన కాంగ్రెస్‌ను ఈ ఎన్నికల్లో ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో ఓయూ విద్యార్థులు ఇంద్ర, మహేశ్‌, జనార్దన్‌, వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

బహుమతులు ప్రదానం చేస్తున్న గోనారెడ్డి
1/1

బహుమతులు ప్రదానం చేస్తున్న గోనారెడ్డి

Advertisement
Advertisement