మాకు రేషన్‌ కార్డు రాక పదేళ్లయింది!

14 Dec, 2023 12:29 IST|Sakshi

పదేళ్లుగా కార్డులు జారీచేయని ప్రభుత్వం

త్వరలోనే కార్డులిస్తామని తాజాగా కొత్త సర్కార్‌ ప్రకటన

ఆనందంలో వేలాది మంది లబ్ధిదారులు

నల్లగొండ: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో నూతన రేషన్‌ కార్డులపై ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్న సందర్భంలోనే రేషన్‌ కార్డులను ఇచ్చింది. ఆ తరువాత బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన పదేళ్ల కాలంలో ఒక్క కార్డు కూడా ముద్రించి ఇవ్వలేదు. కానీ, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల సమయంలో అప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్న కొందరికి మాత్రమే ఫుడ్‌ సెక్యూరిటీ కార్డులను ఇచ్చింది.

ఆ తర్వాత రేషన్‌ కార్డుల జారీ విషయాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న కొత్తవారితోపాటు పిల్లల పేర్లు కార్డులో నమోదు చేయించుకునేందుకు వేలాది మంది ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మొన్న జరిగిన అసెంబ్లీలో ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే రేషన్‌ కార్డులు ఇస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది.

ప్రస్తుతం కాంగ్రెస్సే అధికారంలోకి రావడం, పౌరసరఫరాల శాఖ మంత్రిగా జిల్లాకు చెందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బాధ్యతలు చేపట్టి తాజాగా మంగళవారం ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే కొత్త రేషన్‌ కార్డులు ఇస్తామని ప్రకటించడంతో కొత్త దరఖాస్తుదారులతోపాటు పాతవారు కూడా ఆనందపడుతున్నారు.

4.66లక్షల కార్డులు
జిల్లాలో మొత్తం 4,66,180 రేషన్‌ కార్డులు ఉన్నాయి. ఇందులో పాతవాటితోపాటు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన ఫుడ్‌సెక్యూరిటీ కార్డులు కూడా ఉన్నాయి. కార్డుదారులందరికీ ప్రభుత్వం ప్రతినెలా 6 కేజీల చొప్పున ఉచితంగా బియ్యం అందిస్తోంది. ఒక్క బియ్యం తప్ప ఎలాంటి సరుకులు అందడం లేదు.

అయితే జనాభా కంటే రేషన్‌ కార్డులు ఎక్కువగా ఉన్నాయన్న కారణంతో కార్డుల తొలగింపునకు గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రేషన్‌ కార్డుకు ఆధార్‌ అనుసంధానం చేయడం వల్ల చాలా మంది అనర్హులకు కార్డులు తొలగిపోయాయి.

అలాగే అనర్హులు ఉంటే కార్డును స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించాలని కలెక్టరేట్‌తో పాటు తహసీల్దార్‌ కార్యాలయాల్లో ప్రత్యేక బాక్సులను ఏర్పాటు చేయడంతో చాలామంది అప్పగించడంతో చాలావరకు కార్డులు తగ్గాయి కానీ, అర్హులైన వారందరికీ ఇప్పటి వరకు కొత్త రేషన్‌ కార్డులు ముదిరంచి ఇవ్వలేదు.

పదేళ్లయినా రేషన్‌ కార్డు రాలే..
నాకు పదేళ్ల క్రితం పెళ్లి అయ్యింది. కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటి వరకు రాలేదు. ఇప్పడు నాకు ఇద్దరు కొడుకులు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో చెయ్యి తొలగించారు. రేషన్‌ కార్డు లేకపోవడంతో ఆరోగ్యశ్రీ వంటి పథకం కింద వైద్యం చేయించుకోలేక పోతున్నాను. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రేషన్‌ కార్డులు ఇస్తామన్నందుకు సంతోషంగా ఉంది. – గుండగోని రాజు, కట్టంగూర్‌

రెండేళ్ల క్రితం 11,950 కార్డులు జారీ..
రెండేళ్ల క్రితం హుజూరాబాద్‌ ఉప ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కల్పించిన అవకాశం మేరకు జిల్లాలో 22వేల మంది కొత్త రేషన్‌కార్డుల కోసం జిల్లా వ్యాప్తంగా ఆన్‌లైన్‌లో 22వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో వివిధ కారణాలతో కొందరిని అనర్హులను తొలగించిన ప్రభుత్వం కేవలం11,950 మందికే ఫుడ్‌ సెక్యూరిటీ కార్డులు జారీచేసింది.

అనంతరం కొత్త దరఖాస్తుల ఆహ్వానానికి ఓపెన్‌ చేసిన ప్రత్యేక సైట్‌ను బంద్‌ చేయడంతో దరఖాస్తులు చేసుకోవడానికి వీలు లేకుండా పోయింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకొని కార్డులురాని కుటుంబాలు ప్రస్తుతం 6,450 ఉన్నాయి. జిల్లాలో ఇంకా రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు లక్ష కుటుంబాలు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

>
మరిన్ని వార్తలు