ఆర్టీసీ బస్సుల్లో కిక్కిరిస్తున్న జనం

16 Dec, 2023 11:06 IST|Sakshi
నల్లగొండ బస్టాండ్‌లో బస్సు ఎక్కేందుకు బారులు దీరిన ప్రయాణికులు

నల్లగొండ రూరల్‌ : ప్రభుత్వం మహాలక్ష్మి గ్యారెంటీ కింద మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం నుంచి మహిళలకు బస్సుల్లో జీరో టికెట్‌ జారీ చేస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్‌లలో మహిళలెందరు ప్రయాణించారో లెక్క తేలుతోంది. మొన్నటి వరకు ఆర్టీసీ కండక్టర్ల ఎస్‌ఆర్‌ ఆధారంగా లెక్కలు తీశారు. గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బస్సుల్లో మొత్తం 3,08,881 మంది ప్రయాణం చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. వారిలో డబ్బులు చెల్లించిన ప్రయాణికులు 91,660 మంది ఉండగా.. 2,17,221 మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు. ఉచితంగా ప్రయాణించిన మహిళలు అత్యధికంగా నల్లగొండ డిపో నుంచి 50,652 మంది, అతి తక్కువగా నార్కట్‌పల్లి డిపో నుంచి 5,661 మంది ఉన్నారు.

బస్సుల్లో పెరిగిన రద్దీ..
సాధారంగా ఉమ్మడి జిల్లాలోని 7 డిపోల పరిధిలో రోజూ సగటున లక్షా 60 వేల మంది ప్రయాణిస్తుంటారు. ప్రస్తుతం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తుండడంతో బస్సుల్లో రద్దీ పెరిగింది. ఉచిత ప్రయాణానికి జిల్లాలోని 7 డిపోల పరిధిలో 144 ఎక్స్‌ప్రెస్‌లు, 353 పల్లె వెలుగు బస్సులు నడుస్తున్నాయి. సహజంగా పండుగలు, ప్రత్యేక రోజుల్లో ఆర్టీసీకి రద్దీ పెరుగుతుంది. అయితే మహిళలకు ఉచిత బస్‌ ప్రయాణం కల్పిస్తుండడంతో బంధువుల నివాసాలకు, దూర ప్రాంతాల్లో చదువుతున్న పిల్లలను చూసి వచ్చేందుకు కుటుంబ సభ్యులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తున్నారు. అయితే ఉచిత బస్సు ప్రయాణం పేదలు, ఆస్పత్రులకు వెళ్లే వారికి ఆర్థికంగా వెసులుబాటు కలిగిస్తోందని పలువురు పేర్కొంటున్నారు.

>
మరిన్ని వార్తలు