రూ.500 గ్యాస్‌పై సర్కార్‌ ఫోకస్‌ | Sakshi
Sakshi News home page

రూ.500 గ్యాస్‌పై సర్కార్‌ ఫోకస్‌

Published Sat, Dec 16 2023 12:52 AM

- - Sakshi

నల్లగొండ : ఎన్నికల హామీల అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా అధికారులతో చర్చించి విధి, విధానాలు ఖరారు చేస్తోంది. ప్రస్తుతం రూ.1000 చెల్లించి గ్యాస్‌ సిలిండర్‌ పొందుతున్న వినియోగదారులు.. రూ.500కే సిలిండర్‌ ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు.

ప్రభుత్వంపై ప్రతి నెలా రూ.6.16 కోట్ల భారం
నల్లగొండ జిల్లాలో మొత్తం 4,66,150 ఆహార భద్రత కార్డులు (ఎఫ్‌ఎస్‌సీ) ఉన్నాయి. హెచ్‌పీ, భారత్‌, ఇండేన్‌ గ్యాస్‌ ఏజెన్సీల పరిధిలో మొత్తం 5,28,180 గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. వీటి పరిధిలో ప్రతి నెల లక్షా 30 వేల వరకు సిలిండర్‌ రీఫిల్లింగ్‌ అవుతున్నాయి. ప్రస్తుతం సిలిండర్‌ ధర రూ.974 ఉంది. రూ.500కే సిలిండర్‌ రీఫిల్లింగ్‌ చేసి ఇస్తే మిగిలిన రూ.474 ప్రభుత్వం భరించాల్సి వస్తుంది. అలా అయితే ఒక లక్షా 30 వేల సిలిండర్లను ప్రతి నెల రీఫిల్లింగ్‌ చేస్తే రూ.6.16 కోట్ల భారం పడనుంది.

కార్డు లేని వారికి కూడా..!
రేషన్‌ కార్డులు మొత్తం ఎన్ని ఉన్నాయి.. కార్డులు లేని వారు అర్హులు ఎంత మంది ఉన్నారనే వివరాలు సేకరిస్తోంది. గత ప్రభుత్వం పదేళ్లలో కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వలేదు. ఉప ఎన్నికల సందర్భంలో కొన్ని ఇచ్చినా ఇంకా పెండింగ్‌లో చాలా ఉన్నాయి. ఆహార భద్రత కార్డులు ఉన్న వారితో పాటు లేని వారిలో కూడా అర్హులు ఉంటే సిలిండర్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కార్డు ఉన్నా.. లేకున్నా.. రూ.500కు సిలిండర్‌ ఇచ్చేలా విధి విధానాలు రూపకల్పన చేస్తుండడంతో పేదలకు మేలు జరిగే అవకాశం ఉంది.

గ్యాస్‌ ఏజెన్సీల వద్ద జనాల క్యూ..
రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పొందాలంటే ఈకేవైసీ నమోదు చేసుకోవాలని పుకార్లు రావడంతో ప్రజలంతా గ్యాస్‌ ఏజెన్సీ వైపు పరుగులు తీస్తున్నారు. దీంతో ప్రతి రోజూ ఏజెన్సీల వద్ద ఈకేవైసీ చేసుకునేందుకు రద్దీ పెరుగుతోంది. ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్పినా.. జనం మాత్రం ఏజెన్సీల వద్ద భారీగా బారులుదీరుతున్నారు.

Advertisement
Advertisement