బాలికలకు భరోసా! | Sakshi
Sakshi News home page

బాలికలకు భరోసా!

Published Sat, Dec 16 2023 12:52 AM

- - Sakshi

హుండీ డబ్బులను లెక్కిస్తున్న సిబ్బంది

బాలికల రక్షణకు చర్యలు..

బాలికల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఎంపిక చేసిన పాఠశాలల్లో బాలికల సాధికారత సంఘాలను ఏర్పాటు చేస్తాం. దీని వల్ల విద్యార్థినులు స్వేచ్ఛాయుత వాతావరణలో చదువుకునే అవకాశం ఉంటుంది. ఏదేని సమస్య తలెత్తి ఫిర్యాదు చేస్తే తక్షణ చర్యలు తీసుకుంటాం. జిల్లాలో 20 కేజీబీవీలు, 131 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సంఘాలను ఏర్పాటు చేస్తాం.

– గోవిందరాజులు డీఈఓ

సంఘంలో ఉండేది వీరే..

చైర్మన్‌: ప్రధానోపాధ్యాయుడు

మెంబర్‌: గర్ల్‌ చైల్డ్‌ ఫ్రెండ్లీ టీచర్‌

సభ్యులు: 10–12 ఏళ్ల వయసు గల

బాలికలు (ప్రతి సెక్షన్‌ నుంచి ఇద్దరు)

ఎక్స్‌టర్నల్‌ మెంబర్‌: స్థానిక పోలీస్‌స్టేషన్‌ మహిళా కానిస్టేబుల్‌, షీ టీం ఇన్‌చార్జి

పాఠశాలల్లో సాధికారత

సంఘాల ఏర్పాటుకు కసరత్తు

బాలికల్లో ఆత్మస్థైర్యం నింపడమే లక్ష్యంగా ముందుకు..

ఎవరైనా వేధింపులకు గురయితే

తక్షణమే స్పందించనున్న కమిటీలు

అచ్చంపేట: బాలికలపై రోజురోజూకూ నేరాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం వారి భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఇంటి నుంచి బయటికి వెళ్లిన బాలికలు తిరిగొచ్చే వరకు తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంటోంది. ఇలాంటి సమయంలో బాలికల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. పాఠశాలల వారీగా బాలికల సాధికారత సంఘాల ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు సంబంధిత అధికారులు ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు నిబంధనలను ప్రకటించారు.

131 పాఠశాలల్లో 10,051 మంది విద్యార్థినులు..

జిల్లాలోని 131 ఉన్నత పాఠశాలల్లో సుమారు 10,051 మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారు. విడతల వారీగా ఆయా పాఠశాలల్లో బాలికల సాధికారత కమిటీలు ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ప్రతి తరగతి నుంచి సెక్షన్ల వారీగా ఇద్దరు విద్యార్థినులతో పాటు ఒక ఉపాధ్యాయిని, హెచ్‌ఎంతో కూడిన కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీ సదరు పాఠశాలల్లో ప్రతినెలా విద్యార్థినులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తోంది. కౌమార దశలో బాలికల్లో వచ్చే శారీరక మార్పుల గురించి తెలియజేయడంతో పాటు వ్యక్తిగత శుభ్రతపై అవగాహన కల్పిస్తారు. లింగ సమానత్వంపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. బాల్య వివాహాలు నిరోధించడం, బాలికల హక్కులపై అవగాహన కల్పించడంతో పాటు జీవన నైపుణ్యాలపై శిక్షణ ఇస్తారు. బాలురకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. బాలికలు వేధింపులకు గురయితే వెంటనే స్పందించి ఫిర్యాదు చేసేలా భరోసా కల్పిస్తారు.

కమిటీలో సభ్యుల ఏర్పాటు ఇలా..

జిల్లా స్థాయి కమిటీలో కలెక్టర్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. అధ్యక్షుడిగా పాఠశాల హెచ్‌ఎం, కన్వీనర్‌గా మహిళా ఉపాధ్యాయిని, సభ్యులుగా ప్రతి తరగతిలోని ఇద్దరు బాలికలు ఉండనున్నారు. ఎక్స్‌టర్నల్‌ సభ్యులుగా స్థానిక పోలీస్‌స్టేషన్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్‌, షీ టీం ఇన్‌చార్జి ఉంటారు. జిల్లా స్థాయి కమిటీకి పాలనాధికారి అధ్యక్షుడిగా ఉంటారు. ఇందులో సభ్యులుగా జిల్లా విద్యాధికారి, ఐసీడీఎస్‌ అధికారితో పాటు జిల్లా బాలికల అభివృద్ధి అధికారి వ్యవహరించనున్నారు. నెలకోసారి సమావేశమై ఆయా విషయాలపై కలెక్టర్‌ చర్చించాలి. సంఘాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి. మొత్తంగా బాలికల్లో మనోధైర్యం పెంచుకోవడం, సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేసేందుకు ఈ కమిటీలు దోహదపడనున్నాయి.

అవసరం మేరకు పోలీసుల సహకారం..

పాఠశాలల్లో చదివే బాలికల్లో అత్మవిశ్వాసం కల్పించేందుకు పోలీసులతో కలిసి పనిచేసేలా అవగాహన కల్పిస్తారు. లైంగిక వేధింపులు, దూషణలు, బెదిరింపులు, ఈవ్‌టీజింగ్‌, అనుచిత ప్రవర్తన తదితర ఘటనలు జరిగినప్పుడు బాలికలు భయపడకుండా ధైర్యంగా ఫిర్యాదు చేసి రక్షణ పొందేలా చైతన్యపరుస్తారు. ఈ విషయంలో పాఠశాలల కమిటీలు స్థానిక పోలీసులకు వారధిగా పనిచేయాలనేది ప్రధాన లక్ష్యం.

1/1

Advertisement
Advertisement