కోట్లు పెట్టి భవనాలు, లక్షలు పోసి పరికరాలు.. కాని ఏం లాభం..!

14 Oct, 2023 07:25 IST|Sakshi
మద్దూరులోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌

16 నెలలు గడిచినా మద్దూరు సీహెచ్‌సీకి మంజూరు కాని వైద్య సిబ్బంది పోస్టులు

జిల్లా ఆస్పత్రి, పీహెచ్‌సీ సిబ్బందిచే వైద్య సేవలు

అత్యవసర వైద్యం అందక గర్భిణులు, రోగుల ఇబ్బందులు

నారాయణ్‌పేట్‌: ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న’ చందంగా తయారైంది మద్దూరు 30 పడకల కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌(సీహెచ్‌సీ) పరిస్థితి. రూ.కోట్లు వెచ్చించి ఆస్పత్రి భవనం, రూ.లక్షలు వెచ్చించి అధునాతన యంత్రాలు, సౌకర్యాలు కల్పించినా చివరికి వైద్యులు లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతేడాది జూన్‌ 16న వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు 30 సీహెచ్‌సీని ప్రారంభించారు.

అప్పటి నుంచి వైద్యారోగ్యశాఖ అధికారులు ఈ భవనాన్ని వైద్యవిధాన పరిషత్‌కు అప్పగించారు. దీంతో జిల్లా కేంద్రంలోని జిల్లా ఆస్పత్రి కిందకు ఈ సీహెచ్‌సీ వెళ్లింది. జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న ఒక డాక్టర్‌తో పాటు పీహెచ్‌సీలోని స్టాఫ్‌ నర్స్‌లతో ఇక్కడ వైద్య సేవలు కొనసాగుతున్నాయి. ఉదయం సయమంలో పీహెచ్‌సీలో పనిచేస్తున్న ఓ డాక్టర్‌ ఓపీ చూస్తున్నారు. అత్యవసర సమయంలో వైద్యం కావాలంటే గతంలో మాదిరిగానే జిల్లా కేంద్రానికి లేదా మహబూబ్‌నగర్‌కి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.

ఎనిమిది మంది డాక్టర్లకు ఒక్కరే..?
సీహెచ్‌సీ అసుపత్రిలో గైనిక్‌ సేవలు, జనరల్‌ సర్జన్‌, చిన్నపిల్లలకు వైద్య నిపుణుడు, మత్తు వైద్యుడు, దంత, అత్యవసర సేవలకు ఇలా మొత్తం ఎనిమిది మంది డాక్టర్లు, ఒక సూపరింన్‌డెంట్‌, ఇద్దరు ఫార్మసిస్టులు, ఒక అయూష్‌ మెడికల్‌ అధికారి, ల్యాబ్‌ టెక్నీషియన్‌, రేడియాలజీ, అఫ్తాలమిక్‌ అసిస్టెంట్‌, డెంటల్‌ అసిస్టెంట్‌, ఓటి టెక్నీషియన్‌ 10 మంది నర్సులు, ఇతర సిబ్బందితో పాటు మరో 20 మంది పనిచేయాల్సి ఉంది.

అయితే ప్రస్తుతం ఒక్క డాక్టర్‌ మాత్రమే ఉన్నారు. పీహెచ్‌సీలో, జిల్లా అసుపత్రిలో పనిచేసే స్టాఫ్‌నర్స్‌లు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఇదిలాఉండగా, ఈ సీహెచ్‌సీకి ఎలాంటి పోస్టులు ఇంకా మంజూరు కాకపోవడంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లా అసుపత్రిలో పనిచేస్తున్న వారిని ఇక్కడి పంపించినట్లు అధికారులు తెలిపారు.

అన్నీ ఉన్నా..
రూ.3.67 కోట్లతో సీహెచ్‌సీ భవన నిర్మాణం చేపట్టారు. ఈ ఆస్పత్రిలో అప్పటి కలెక్టర్‌ హరిచందన చొరవతో 2022 డిసెంబర్‌ 27న తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం(యూఎస్‌ఏ) సంస్థ సహకారంతో రూ. 10లక్షల వ్యయంతో 10 బెడ్లకడ్లాక్సిజన్‌ అందించేందుకు వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఈసీజీ, స్కానింగ్‌, తదితర వైద్య పరీక్షల సామగ్రి కూడా అందుబాటులో ఉంది. అన్నీ ఉన్నా డాక్టర్లే లేకపోవడం గమనార్హం.

వైద్యం అందింటే నా భార్య బతికేది..
నెలలు నిండిన నా భార్య కాన్పు కోసం మద్దూరు సీహెచ్‌సీకి వచ్చింది. అన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన నర్సులు కాన్పు చేస్తామన్నారు. తీరా డెలవరీ సమయంలో రక్తస్రావాన్ని అరికట్ట లేకపోవడంతో నా భార్య, బిడ్డ ఇద్దరూ చనిపోయారు. ఒకవేళ డాక్టర్లు అందుబాటులో ఉండి ఉండే నా భార్య, పాప చనిపోయి ఉండేవారు కాదు.  – కృష్ణ, తిమ్మారెడ్డిపల్లి, మద్దూరు, మండలం

పోస్టులు మంజూరు కాలే..
వైద్యవిధాన పరిషత్‌ నుంచి మద్దూరు, కోస్గి ఆస్పత్రులకు పోస్టులు మంజూరు కాలేదు. జిల్లా ఆస్పపత్రి నుంచి ఒక డాక్టర్‌ను డిప్యూటేషన్‌పై ఓపీ చూడడానికి అక్కడికి పంపిస్తున్నాం. జిల్లా ఆస్పత్రిలో పనిచేసే ఇద్దరు డాక్టర్లు వెళ్లిపోయారు. ఎన్నికలు ముగిసిన తర్వాత పోస్టులు మంజూరు అవ్వొచ్చు. నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది.  – రంజిత్‌కుమార్‌, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌, నారాయణపేట

అత్యవసర వైద్యం అందక..
గతేడాది ఆగస్టు 5న మండలంలోని తిమ్మారెడ్డిపల్లి చెందిన నిండు గర్భిణి కృష్ణవేణి(26) పురుటినొప్పులు రావడంతో ఇదే సీహెచ్‌సీ రాగా... వైద్యులు అందుబాటులో లేకపోవడంతో స్టాఫ్‌ నర్స్‌లు కాన్పు చేసేందుకు యత్నించారు. శిశువు పురిటిలోనే మృతి చెందగా.. శిశువు మృతదేహాన్ని బయటకు తీసే క్రమంలో తీవ్ర రక్తస్రావం కావడంతో గర్భిణిని హుటాహుటీనా 108లో జిల్లా అసుపత్రికి తరలించారు.

అప్పటికే తీవ్ర రక్త స్రావం కావడంతో ఆమె సైతం మృతి చెందింది. ఒకవేళా అందుబాటులో వైద్యులు ఉంటే ఇలాంటి ఘటనలు జరిగేవి కావని మృతురాలి భర్త కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సీహెచ్‌సీ.. మద్దూరు, దామరగిద్ద, దౌల్తాబాద్‌, మండలాల నుంచి దాదాపు 80 గ్రామాల ప్రజలకు అనుకూలంగా ఉంటుంది.

మరిన్ని వార్తలు