అగ్ని పర్వతం విస్పోటనం.. 11 మంది పర్వతారోహకులు మృతి

4 Dec, 2023 17:37 IST|Sakshi

జకర్తా: ఇండోనేషియాలో భారీ అగ్నిపర్వతం విస్పోటనం చెందింది. ఈ ఘటనలో దాదాపు 11 మంది పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది గల్లంతయ్యారు. సుమత్రా ద్వీపంలో 2,891 మీటర్ల (9,484 అడుగులు) ఎత్తున్న మౌంట్ మెరాపి అగ్ని పర్వతం ఆదివారం విస్పోటనం చెందింది. ఈ ఘటనతో చుట్టుపక్కల కిలోమీటర్ల మేర బూడిద మేఘాలు కమ్మేశాయి. పేలుడుతో దాదాపు 3,000 మీటర్ల ఎత్తుకు బూడిద ఎగజిమ్మిందిని అధికారులు తెలిపారు. 

"అగ్ని పర్వతం విస్పోటనం జరిగిన సమయంలో దాదాపు 75 మంది పర్వతారోహకులు అక్కడ ఉన్నారు. 49 మంది పర్వతం నుంచి కిందికి దిగివచ్చారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించాం. 11 మంది మృతి చెందారు. 12 మంది ఆచూకీ తెలియలేదు." అని సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ అధిపతి అబ్దుల్ మాలిక్ తెలిపారు. 

ఇండోనేషియాలోని మౌంట్‌ మెరాపి ప్రాంతంలో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వారాంతంలో పర్వతారోహకులు ట్రెక్కింగ్‌ చేసే సమయంలో అగ్ని పర్వతం ఒక్కసారిగా విస్ఫోటనం చెందింది. దీంతో ప్రాణ నష్టం జరిగిందని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: ప్రపంచంలోనే నాసా కంటే ఎక్కువ డేటా ట్రాన్స్‌ఫర్‌..! కానీ..
 

>
మరిన్ని వార్తలు