Uttarkashi Tunnel Accident: బయటివారితో మాట్లాడుతున్న సొరంగంలోని బాధితులు

22 Nov, 2023 12:03 IST|Sakshi

ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలను రక్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. మంగళవారం సొరంగం లోపల చిక్కుకున్న కార్మికులకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. దానిలో వారంతా సురక్షితంగా ఉన్నట్లు కనిపించారు. సొరంగంలోని కార్మికులతో బయట ఉన్న వారి బంధువులు మాట్లాడుతున్నారు. బుధవారం ఆ కార్మికులు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారిలో ఒక కార్మికుడు మొబైల్ ఛార్జర్‌ను లోపలికి పంపించాలని కోరాడు.

సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న కార్మికులలో పుష్కర్ సింగ్ యేరీ  ఒకరు. అతని సోదరుడు విక్రమ్ సింగ్ యేరీ తాను పుష్కర్‌తో మాట్లాడినట్లు మీడియాకు తెలిపారు. తన సోదరుడు.. తాను బాగున్నానని, మమ్మల్ని ఇంటికి వెళ్లాలని చెప్పాడని తెలిపారు. కాగా సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు ఆహారపదార్థాలను, ఇతర వస్తువులను అందించడానికి ఆరు అంగుళాల వెడల్పు గల పైపును లోపలికి పంపారు. ఈ ఆరు అంగుళాల ‘లైఫ్‌లైన్‌’ అందించకముందు కార్మికులకు ఆహారం, నీరు, మందులు, ఆక్సిజన్‌ను నాలుగు అంగుళాల పైపు ద్వారా సరఫరా చేశారు. 

కాగా తాజాగా లోనికి పంపిన విశాలమైన పైప్‌లైన్‌తో మెరుగైన కమ్యూనికేషన్‌ అందడంతో పాటు ఆహార పదార్థాలను కూడా పెద్ద మొత్తంలో పంపేందుకు అవకాశం కలిగింది. సొరంగంలో చిక్కుకున్న కార్మికుడు ప్రదీప్ కిస్కు క్షేమ సమాచారాన్ని అతని బంధువు సునీతా హెంబ్రామ్ తెలుసుకున్నారు. అతను బాగున్నాడని ఆమె మీడియాకు తెలిపారు. కాగా కొత్త పైపు సొరంగంలోకి పంపడం వలన కార్మికులతో కమ్యూనికేట్ చేయడం సులభతరం అయ్యింది. ఇప్పుడు వారి గొంతు స్పష్టంగా వినిపిస్తున్నదని సొరంగం బయట ఉన్నవారు చెబుతున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామికి ఫోన్ చేసి నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు చేపడుతున్న రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్ల గురించిన సమాచారం తెలుసుకున్నారు. ఉత్తరకాశీ జిల్లాలోని చార్‌ధామ్‌ యాత్ర మార్గంలో నిర్మాణంలో ఉన్న నాలుగున్నర కిలోమీటర్ల పొడవైన సిల్క్యారా సొరంగంలోని ఒక భాగం నవంబర్ 12న కూలిపోయింది. ఈ సమయంలో 41 మంది కూలీలు సొరంగంలో చిక్కుకుపోయారు.
ఇది కూడా చదవండి:  సొరంగ బాధితుల కోసం సైకత శిల్పి ప్రార్థనలు
 

మరిన్ని వార్తలు