అయోధ్య: సరయు నదిలో 12 మంది గల్లంతు

10 Jul, 2021 12:46 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. అయోధ్యలోని సరయు నదిలో స్నానం చేస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన 12 మంది గుప్తార్‌ ఘాట్‌ వద్ద నీటిలో మునిగిపోయారు. వెంటనే స్థానికులు ముగ్గురిని రక్షించారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈతగాళ్లను పిలిపించి మిగతా వారికోసం సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు ఆరుగురి మృతదేహాలను వెలికితీశారు. మునిగిన వారిలో మహిళు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు.

కాగా ఆగ్రాకు చెందిన 15 మంది కుటుంబ సభ్యులు అయోధ్యను సందర్శించేందుకు వచ్చారు. వీరిలో కొంతమంది చేతులు, కాళ్ళు కడుక్కోగా, మరికొందరు స్నానం చేసేందుకు నదిలో దిగారు. అదే సమయంలో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగడంతో 12 మంది నీటిలో గల్లంతయ్యారు. మిగిలిన వాళ్లు వారిని రక్షించేందుకు ప్రయత్నించగా.. ఫలితం లేకుండా పోయింది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని అయోధ్య జిల్లా కలెక్టర్‌ అనుజ్ కుమార్‌ ఝా తెలిపారు.

మరిన్ని వార్తలు