22 లక్షల దీపాల వెలుగుల్లో అయోధ్య

12 Nov, 2023 05:18 IST|Sakshi
శనివారం అయోధ్యలో లక్షలాది దీపాల వెలుగుల్లో సరయూ నదీ తీరం

స్వీయ గిన్నిస్‌ రికార్డునే బద్దలు కొట్టిన దీపోత్సవం

లక్నో/అయోధ్య: అయోధ్యలోని సరయూ నదీ తీరం వెలుగులతో నిండిపోయింది. శనివారం అత్యంత వైభవంగా 22 లక్షల దీపాలతో జరిగిన దీపోత్సవం ప్రపంచ రికార్డు సృష్టించింది. ఒకే చోట ఒకేసారి అత్యధిక సంఖ్యలో దీపాలను వెలిగించిన ఘటనగా స్వీయ గిన్నిస్‌ రికార్డునే బద్దలు కొట్టింది. సరయూ నది ఒడ్డున 51 ఘాట్లలో 25 వేల మంది వలంటీర్లు 22.23 లక్షల మట్టి ప్రమిదలను వెలిగించారు.

గిన్నిస్‌ బుక్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు డ్రోన్ల సాయంతో దీపాలను లెక్కించి, ప్రపంచ రికార్డుగా ధ్రువీకరించడంతో నగరం ‘జై శ్రీరామ్‌’ నినాదాలతో మారుమోగింది. గిన్నిస్‌ బుక్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు ఈ మేరకు సీఎం యోగీ ఆదిత్యనాథ్‌కు సర్టిఫికెట్‌ను అందజేశారు. గతేడాది ఈ వేడుకలో 15.76 లక్షల ప్రమిదలు వెలిగించడం తొలిసారి గిన్నిస్‌ రికార్డులకెక్కింది. 2017లో యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అయోధ్యలో ఏటా దీపోత్సవం జరుగుతోంది. శనివారం సీఎం ఆదిత్యనాథ్, గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్, కేబినెట్‌ మంత్రులు కూడా దీపాలు వెలిగించి, సరయూ నది ఒడ్డున పూజలు చేశారు. దీపోత్సవం 100 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారమైంది.
 

మరిన్ని వార్తలు