కుప్పకూలిన భవనం.. 17 మంది దుర్మరణం

22 Sep, 2020 04:18 IST|Sakshi
ప్రమాద ప్రాంతంలో శిథిలాల్లో చిక్కుకుపోయిన వారి కోసం గాలిస్తున్న సహాయక సిబ్బంది

మహారాష్ట్రలోని భివండీలో విషాదం

సాక్షి ముంబై: మహారాష్ట్ర థానే జిల్లా భివండీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని మూడంతస్తుల భవనం నేలమట్టం కావడంతో అందులోని 17 మంది మృతి చెందారు. మృతుల్లో 14 ఏళ్లలోపు బాలలు ఏడుగురు ఉన్నారు. ఈ సంఘటనలో 20 మంది సురక్షితంగా బయటపడ్డారు. భివండీ ధామన్కర్‌నాకా పటేల్‌ కాంపౌండ్‌ ప్రాంతంలోని మూడంతస్తుల భవనం సోమవారం వేకువజామున 3.15 గంటల ప్రాంతంలో కుప్పకూలింది. అంతా గాఢ నిద్రలో ఉండగా జరిగిన ఈ ఘటనతో ఆ ప్రాంతంలోని వారు ఉలిక్కిపడ్డారు.

బాధితుల హాహాకారాలు విని ఇరుగుపొరుగు వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ఘటన స్థలానికి చేరుకుని యుద్ధ ప్రాతిపాదికపై సహాయక చర్యలు ప్రారంభించారు. ఉదయం 11 గంటల సమయానికి 13 మందిని శిథిలాల నుంచి కాపాడగలిగారు. సహాయక చర్యలు సోమవారం రాత్రి వరకు కొనసాగాయి. సాయంత్రం 6.15 గంటల వరకు అందిన వివరాల మేరకు 17 మంది ప్రాణాలు కోల్పోయారు.  20 మంది సురక్షితంగా బయటపడ్డారు. బాధితుల్లో చాలా మంది తీవ్రంగా గాయపడటంతో వారందరికీ వెంటనే ఆస్పత్రులకు తరలించారు.

శిథిలాల కింద మరింత మంది చిక్కుకుపోయి∙ఉంటారని భావిస్తున్నారు. మరోవైపు 43 ఏళ్లనాటి ఈ శిథిల భవనం ప్రమాదకరమైందంటూ భివండీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. 40 ఫ్లాట్లున్న ఈ భవనంలో 150 మంది వరకు నివాసం ఉంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల సాయం ప్రకటించింది. అధికారులు మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన ఇద్దరు సీనియర్‌ అధికారులను సస్పెండ్‌ చేశారు. భివండీ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు.
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా