ఐఐటీల్లో పెరిగిన విద్యార్థినులు

21 Aug, 2022 05:59 IST|Sakshi

సూపర్‌ న్యూమరీ మహిళల కోటాతో 3 రెట్లు పెరిగిన అడ్మిషన్లు

ఐఐటీ హైదరాబాద్‌లో 43 నుంచి 94కి పెరిగిన సంఖ్య

సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ)ల్లో సూపర్‌న్యూమరీ మహిళా కోటాను ప్రవేశ పెట్టాక విద్యార్థినుల సంఖ్య మూడు రెట్లు పెరిగిందని కేంద్ర విద్యాశాఖ పరిధిలోని అడ్మిషన్స్‌ స్టాటస్టిక్స్‌–2021 తాజా నివేదిక పేర్కొంది. ఈ కోటా కింద 2021–22 ఏడాది బ్యాచ్‌లో 20 శాతం మంది విద్యార్థినులే ఉన్నారని, 2017లో ఐఐటీల్లో విద్యార్థినులు కేవలం 995 మంది ఉండగా, ప్రస్తుతం వీరి సంఖ్య 2,990కి పెరిగిందని తెలిపింది.

ప్రతిష్టాత్మక ముంబై ఐఐటీలో 2017లో కేవలం 100 మంది విద్యార్థినులు చేరగా, ప్రస్తుతం 271కి, ఐఐటీ ఢిల్లీలో ఈ సంఖ్య 90 నుంచి 246కి, హైదరాబాద్‌ ఐఐటీలో 43 నుంచి 94కు పెరిగిందని వెల్లడించింది. 2017–2021 కాలంలో ఐఐటీల్లో ప్రవేశం పొందిన మొత్తం విద్యార్థులు 10,988 నుంచి 16,296కి పెరగ్గా, విద్యార్థినుల సంఖ్య మూడు రెట్లు పెరిగిందని వివరించింది. ‘ఐఐటీల్లో విద్యార్థినుల సంఖ్య పెరగడం సామాజికంగా, దీర్ఘకాలికంగా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. వీరిలో చాలా మంది అగ్రశ్రేణి స్థానాల్లో ఉంటారు. అత్యున్నత బ్యాంకర్లలో వీరి సంఖ్య పెరుగుతుంది’అని ఐఐటీ బాంబే డైరెక్టర్‌ సుభాశీష్‌ చౌదరి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు