బడి బ్యాగు బరువు తగ్గించాలి!

2 Oct, 2023 04:06 IST|Sakshi

రాష్ట్రాలకు కేంద్రం సూచన 

ఈ అంశంపై ఇప్పటికే జాతీయ స్థాయిలో అధ్యయనం 

పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని గుర్తింపు 

చిన్నారులపై పుస్తకాలు,ఇతర భారం తగ్గించడంపై రాష్ట్ర విద్యాశాఖ దృష్టి 

ఓ కమిటీ వేసి కార్యాచరణ రూపొందించాలని నిర్ణయం 

ముఖ్యంగా ప్రైవేటు స్కూళ్లను కట్టడి చేసే యోచన 

త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇస్తామంటున్న అధికారులు 

సాక్షి, హైదరాబాద్‌: పాఠశాలల్లో చదివే విద్యార్థులపై పుస్తకాల బరువు తగ్గించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇది అమలయ్యేలా చూడాలని పేర్కొంది. పుస్తకాల బరువు, దాని వల్ల ఎదురయ్యే పరిణామాలపై కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో చేసిన అధ్యయనం వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం.. 70శాతం మంది స్కూల్‌ విద్యార్థులపై పుస్తకాల భారం అధికంగా ఉంటోంది. దీనితో పిల్లల కండరాలు, మోకాళ్లపై ఒత్తిడి పడుతోంది. 22 శాతం మంది విద్యార్థులు వెన్నునొప్పితో బాధపడుతున్నారు. ఇంటికి రాగానే నీరసంగా, భుజాలు వంగిపోయి నొప్పితో ఇబ్బందిపడుతున్నారు.

దీర్ఘకాలం పాటు ఈ ప్రభావం ఉంటోందని.. ఈ ఆరోగ్య సమస్యలు విద్యార్థి చదువుపై శ్రద్ధ కోల్పోయేందుకు కారణం అవుతున్నాయని అధ్యయనం నివేదిక స్పష్టం చేసింది. మితిమీరిన పుస్తకాలు, చదువుతో విద్యార్థులు సరిగా నిద్రపోవడం లేదని.. దీనితో తరగతి గదిలో చురుకుగా ఉండటం లేదని పేర్కొంది. ముఖ్యంగా ప్రైవేటు స్కూళ్లలో ఈ సమస్య ఎక్కువగా ఉంటోందని వివరించింది. ప్రైవేటు స్కూళ్లు బహుళ అంతస్తుల భవనాల్లో ఉండటం, శక్తికి మించిన బరువుతో పిల్లలు మెట్లు ఎక్కడం వల్ల సమస్య పెరుగుతోందని తెలిపింది. ఈ క్రమంలో బడి బ్యాగుల బరువు విషయంలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు కచ్చితమైన నిబంధనలు ఉండేలా చూడాలని సూచించింది. 

ఐదేళ్ల నుంచి అడుగుతున్నా.. 
ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో స్కూల్‌ విద్యార్థులపై పుస్తకాల బరువు సమస్య తీవ్రంగా ఉందని ఈ అంశంపై అధ్యయనం చేసిన యశ్‌పాల్‌ కమిటీ గతంలోనే స్పష్టం చేసింది. చిన్నప్పట్నుంచే విద్యార్థులు అధిక బరువు మోయడం వల్ల కండరాలపై ఒత్తిడి పడి, భవిష్యత్‌లో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల బారినపడే ప్రమాదం ఉందని మరికొన్ని అధ్యయనాలు కూడా తేల్చాయి. ఈక్రమంలో పుస్తకాల బరువు తగ్గించే చర్యలు చేపట్టాలని కేంద్ర విద్యా శాఖ ఐదేళ్ల క్రితమే అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది. ఆ దిశగా కొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. పిల్లలు మోసే పుస్తకాల బరువు వారి బరువులో పది శాతానికి మించి ఉండకూడదని పేర్కొంది.

పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా కొంత కార్యాచరణ చేపట్టాయి. స్కూళ్లలో డిజిటల్‌ విధానం అమలు చేయాలని నిర్ణయించాయి. కానీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. కోవిడ్‌ తర్వాత ప్రపంచవ్యాప్తంగా డిజిటల్‌ విద్యకు ప్రాధాన్యం, అవకాశాలు పెరిగాయి. విద్యా సంస్థలు దీనిని సది్వనియోగం చేసుకోవాలని కేంద్ర విద్యాశాఖ సూచించింది. హోంవర్క్‌ సహా కొన్ని రాత పనులను డిజిటల్‌ విధానంలోకి మార్చడం వల్ల బరువు తగ్గించే వీలుందని పేర్కొంది. ఐదేళ్ల క్రితం ఇచ్చిన ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో స్పందించలేదని.. ఇకనైనా ఆ దిశగా అడుగువేయాలని కేంద్ర విద్యాశాఖ తాజాగా అభిప్రాయపడింది. 

బ్యాగు బరువు ఇలా ఉండాలి 
ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. రెండో తరగతి విద్యార్థులకు 1.5 కిలోలు మాత్రమే పుస్తకాల బరువు ఉండాలి. 5 తరగతి వరకూ మూడు కేజీలు, 7వ తరగతి వరకు 4 కేజీలు, 9వ తరగతి వారికి 4.5 కేజీలు, పదో తరగతి వారికి 5 కేజీలకు మించి పుస్తకాల బరువు ఉండకూడదు. తెలంగాణ విద్యాశాఖ క్షేత్రస్థాయి పరిశీలన ప్రకారం.. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల పుస్తకాల బరువు 12 కేజీల వరకు, ఉన్నత పాఠశాల విద్యార్థుల పుస్తకాల బరువు 17 కేజీల వరకు ఉంటున్నాయి.

ప్రైవేటు స్కూళ్లలో ఐదో తరగతి చదివే విద్యార్థులు ఏకంగా 40 పుస్తకాలను మోయాల్సి వస్తోంది. పాఠ్య పుస్తకాలు, వర్క్‌బుక్స్, వర్క్‌ïÙట్స్, నోట్‌బుక్స్‌ ఇలా అనేకం బ్యాగులో కుక్కేస్తున్నారు. వీటికితోడు లంచ్‌ బాక్స్, నీళ్ల బాటిల్‌ కూడా కలసి పిల్లలపై భారం పడుతోంది. ప్రైవేటు స్కూళ్లు పుస్తకాల ముద్రణ సంస్థలతో కుదుర్చుకునే ఒప్పందాల కారణంగా ప్రతిదీ కొనాల్సిందేనని విద్యార్థులను ఒత్తిడి చేస్తున్నాయి. 

భారంపై రాష్ట్ర విద్యాశాఖ దృష్టి 
పుస్తకాల బరువు తగ్గించే అంశంపై రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇటీవల చర్చించారు. ఈ అంశంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలు, కార్యాచరణను రూపొందించేందుకు అధికారులతో ఓ కమిటీ వేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థులకు పుస్తకాల బరువు అధికంగా ఉంటోందని.. అలాంటి వాటిని కట్టడి చేయడంపై దృష్టి పెట్టాలని ఆలోచనకు వచ్చారు. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు మొదలైందని, అన్ని అంశాలను పరిశీలించి త్వరలోనే ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇస్తామని విద్యాశాఖ అధికారి ఒకరు వెల్లడించారు.   

మరిన్ని వార్తలు