రష్మిక ఫేక్‌ వీడియో : సోషల్‌ మీడియా సంస్థలకు కేంద్రం​ మరోసారి రెడ్‌ సిగ్నల్‌

7 Nov, 2023 17:21 IST|Sakshi

తపుడు సమాచారం నేరం రుజువైతే మూడేళ్ల జైలు, రూ. లక్ష జరిమానా  

న్యూఢిల్లీ: తప్పుడు సమాచార వ్యాప్తికి సంబంధించి నటి రష్మిక మందన్నకు చెందినడీప్‌ఫేక్ వీడియో వైరల్ కావడంతో కేంద్రం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000లోని సెక్షన్ 66డీ ప్రకారం  నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన శిక్ష, జరిమానా తప్పదంటూ రిమైండర్‌ జారీ చేసింది. ఈ  వ్యవహారంపై కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ దర్యాప్తునకు ఆదేశించినట్టు తెలుస్తోంది.

ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) సాయంతో డీప్‌ఫేక్‌లకు సంబంధించిన  చట్టపరమైన నిబంధనలను, ఉల్లంఘిస్తే  ఎదురయ్యే పరిణామాలను తాజా సర్క్యులేషన్‌లో మరోసారి  గుర్తు చేసింది. 

ఐటీ యాక్ట్ 2000 సెక్షన్  66డీ  ప్రకారం కంప్యూటర్ వనరులను ఉపయోగించి ఎవరైనా వ్యక్తుల పట్ల మోసపూరితంగా వ్యవహరించినా, వ్యక్తిత్వ హననానికి పాల్పడినా నేరం రుజువైతే  మూడేళ్ల దాకా జైలు శిక్ష,  లక్ష రూపాయల దాకా జరిమానా ఉంటుంది.

ప్రభుత్వం, లేదా  బాధిత వ్యక్తులు  కోరిన  వెంటనే సోషల్ మీడియా వెబ్ సైట్లు ఆయా కంటెంట్ వివరాలను 36 గంటల్లోగా తొలగించాల్సి ఉంటుంది.  IT మధ్యవర్తి నియమాల ప్రకారం, సోషల్ మీడియా సంస్థలు 10 రకాల కంటెంట్‌కి  సంబంధించిన పోస్టులను తప్పక తొలగించాలి.  ముఖ్యంగా దేశ సమగ్రత, శాంతి భద్రతలు, సార్వభౌమత్వం, విదేశాలతో సంబంధాలు, ఇతర దేశాలను అవమానించడం, నేరాలకు పాల్పడేందుకు ప్రోత్సహించే చర్యలు, ఒక వ్యక్తి లేదా ప్రభుత్వాన్ని కించపర్చేలా మాట్లాడడం నేరంగా పరిగణిస్తారు.

అలాగే  అసభ్యకరమైన కంటెంట్, లింగ విద్వేషం రెచ్చగొట్టే పోస్టులు, ఇతరుల ప్రైవసీని దెబ్బ తీసే కంటెంట్, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడేలా ప్రోత్సహించడం, జాతి, మతం, రంగును అవమానించడం, భారతీయ చట్టాలలో నేరంగా వెల్లడించిన పనులను ప్రోత్సహించే కంటెంట్ వంటివి ఎవరైనా పోస్ట్ చేస్తే వాటిని  వెంటనే తొలగించాల్సి ఉంటుంది. అలాగే ఒకవేళ ప్రభుత్వం కోరితే ఆ సమాచారాన్ని ముందుగా పోస్ట్ చేసిన వ్యక్తి వివరాలను కూడా వెల్లడించాల్సి ఉంటుంది. 

కాగా రష్మిక డీప్‌ ఫేక్‌  వీడియో వైరల్‌ కావడంతో స్పందించిన కేంద్ర ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఫేక్‌ న్యూస్‌, డీప్‌ఫేక్‌ వీడియోలపై ఆందోళన వ్యక్తం చేశారు.  భారతీయులకు భద్రత, విశ్వాసం కల్పించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని  భరోసా ఇవ్వడం తోపాటు  ఇలాంటి ఫేక్‌ వీడియోపై సోషల్‌ మీడియా సంస్థలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా హెచ్చరించిన సంగతి తెలిసిందే. 
 

మరిన్ని వార్తలు