లోక్ సభలో నేడు 49 మంది ఎంపీలపై వేటు

19 Dec, 2023 15:10 IST|Sakshi

ఢిల్లీ: పార్లమెంట్‌లో నేడు మరింత మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యం అంశంపై గందరగోళం సృష్టించిన కారణంగా ఇవాళ ఒక్కరోజే లోక్‌సభ నుంచి 49 మంది ఎంపీలను సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశంపై పార్లమెంట్‌లో నిన్న 78 మంది సస్పెండ్ అయ్యారు. ఈ సెషన్‌లో ఇప్పటివరకు మొత్తంగా 141 మంది ఎంపీలపై వేటు పడింది. 

సస్పెన్షన్‌కు గురైన ఎంపీల్లో కాంగ్రెస్‌కు చెందిన శశిథరూర్, మనీష్ తివారీ, కార్తీ చిదంబరం, ఎన్‌సీపీకి చెందిన సుప్రియా సూలే, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన డింపుల్ యాదవ్, ఎన్‌సీపీకి చెందిన ఫరూక్ అబ్దుల్లా, డీఎంకేకు చెందిన ఎస్ సెంథిల్‌కుమార్, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సుశీల్ కుమార్ రింకు, సుదీప్ బంధోపాధ్యాయ ఉన్నారు. ఎంపీల సస్పెన్షన్‌ తీర్మానాన్ని కేంద్ర మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ ప్రవేశపెట్టారు.

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో లోక్‌సభలో నిన్న 33 మంది విపక్ష సభ్యులు సస్పెండ్ అయ్యారు. రాజ్యసభలో 45 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యం అంశంపై సభలో గందరగోళం సృష్టించడంతో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సస్పెండ్ అయిన ఎంపీల్లో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అధిర్ రంజన్ చౌదరి, డీఎంకే ఎంపీలు టీఆర్ బాలు, దయానిధి మారన్, టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ తదితరులు ఉన్నారు.

డిసెంబర్ 13న పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం ఘటన జరిగింది. నలుగురు యువకులు పార్లమెంట్‌లోకి చొరబడి గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించారు. ఇద్దరు యువకులు లోక్‌సభ లోపల గ్యాస్‌ బాంబులను ప్రయోగించగా.. మరో ఇద్దరు పార్లమెంట్ ఆవరణలో అలజడి సృష్టించారు.

ఈ ఘటన జరిగిన మరుసటి రోజు పార్లమెంట్‌లో విపక్ష సభ్యులు ఆందోళన చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో 14 మంది సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇందులో ఒక రాజ్య సభ సభ్యుడు కాగా, 13 మంది లోక్‌సభ సభ్యులు ఉన్నారు. ఈ రోజు సస్పెండ్ అయిన ఎంపీలతో కలిపి మొత్తంగా పార్లమెంట్‌లో 141 మంది విపక్ష సభ్యులు సస్పెండ్ అయ్యారు. 

ఇదీ చదవండి: Ram Mandir Ayodhya: రామాలయం థీమ్‌తో వజ్రాలహారం..

>
మరిన్ని వార్తలు