కమలం ‘లోక్‌సభ’ కసరత్తు

19 Dec, 2023 01:54 IST|Sakshi

ఎక్కువ సీట్లలో  గెలుపు లక్ష్యంగా కార్యాచరణ

17 మంది విస్తారక్‌ల నియామకానికి చర్యలు

అసెంబ్లీ ఎన్నికల్లో నేతల పనితీరుపై బన్సల్‌ సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లలో అత్యధిక స్ధానాల్లో గెలుపు లక్ష్యంగా కార్యాచరణను వేగవంతం చేసింది. 17 నియోజకవర్గాలకు విస్తారక్‌ (ఫుల్‌ టైమర్‌ (పూర్తి సమయం వెచ్చించే నేత)లను నియమించేందుకు చర్యలు చేపడుతోంది. పార్టీకి పట్టు ఉన్న, గెలిచే అవకాశాలున్న సీట్లపై మరింతగా దృష్టి కేంద్రీకరించనుంది.

ఇలాంటి సీట్లలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను ఒకటీ రెండు లేదా మూడు నాలుగింటికి ఒకరు చొప్పున మరికొంత మంది విస్తారక్‌లను నియమించాలని నిర్ణయించింది. సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయా అంశాలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్‌ సమీక్ష నిర్వహించారు.

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాల్లో పనిచేసిన వివిధ స్ధాయి నాయకులు, కమిటీల పనితీరును ఈ సందర్భంగా పరిశీలించినట్టు సమాచారం. అలాగే గతంలో 17 లోక్‌సభ స్థానాలకు నియమితులైన ఫుల్‌ టైమర్స్‌లో ఎవరెవరు చురుకుగా పని చేస్తున్నారో ఆరా తీసినట్లు తెలిసింది. కాగా గత కొంతకాలంగా వారు నిర్వహించిన బాధ్యతలు, పూర్తిచేసిన కర్తవ్యాలను పరిగణనలోకి తీసుకుని వారి పునర్‌ నియామకంపై నిర్ణయం తీసుకో నున్నట్టు తెలుస్తోంది. 

అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఇన్‌చార్జులు
అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఇన్‌చార్జులను నియమించే చర్యలు కూడా చేపడుతున్నారు. అసెంబ్లీ స్థానా ల్లో బాగా పనిచేశారని పేరు తెచ్చుకున్న వారిని లోక్‌సభ ఎన్నికలకు ఫుల్‌టైమర్లుగా, పార్లమెంట్‌ ఇన్‌చార్జులుగా నియమించే అవకాశాలున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయా నేతల పనితీరు పై నివేదికలు సమర్పించాలని రాష్ట్ర నాయకత్వాన్ని బన్సల్‌ ఆదేశించినట్టు తెలిసింది.

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో..కేంద్రం చేపట్టిన వివిధ పథకాలు, అభి వృద్ధి కార్యక్రమాల ప్రచారానికి ఉద్దేశించిన వికసిత్‌ భారత్, విశ్వకర్మ యోజనలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంపై, పోలింగ్‌ బూత్‌ కమిటీలపై ప్రత్యే క దృష్టిపెట్టాలని సూచించినట్టు పార్టీ వర్గాలు తెలి పాయి. ఈ నెలాఖరులోగా పార్టీ జాతీయ అధ్యక్షు డు జేపీ నడ్డా రాష్ట్ర పార్టీకి దిశానిర్దేశం చేస్తారని, ఆ తర్వాత పార్టీ యంత్రాంగం పూర్తిస్థాయిలో ఎన్నికల సన్నా హాల్లో నిమగ్నం అవుతుందని సమాచారం.

>
మరిన్ని వార్తలు