Uttarkashi Tunnel: ‘ప్రిన్స్‌’ను గుర్తుచేసిన ఉత్తరాఖండ్‌ రెస్క్యూ ఆపరేషన్‌

29 Nov, 2023 10:07 IST|Sakshi

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలను రక్షించేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమయ్యింది. ఈ నేపధ్యంలో తొమ్మిదేళ్ల క్రితం హర్యానాలో జరిగిన ప్రిన్స్‌ రెస్క్యూ ఆపరేషన్‌ను పలువురు గుర్తుచేసుకుంటున్నారు. 

హర్యానాలోని కురుక్షేత్ర పరిధిలోగల హల్దేహరి గ్రామంలో తొమ్మిది ఏళ్ల క్రితం బోరుబావి ప్రమాదం చోటుచేసుకుంది. ఐదేళ్ల బాలుడు ప్రిన్స్‌ 60 అడుగుల లోతు కలిగిన బోరుబావిలో  పడిపోయాడు. మూడు రోజులపాటు అదే బావిలో మగ్గిపోయాడు. అయితే సైన్యం బోరుబావి దగ్గర సొరంగం నిర్మించి ఆ బాలుడిని రక్షించింది. 

అది జూలై 21, 2006.. హల్దేహరి గ్రామానికి చెందిన ప్రిన్స్ తన స్నేహితులతో ఆడుకుంటూ, తెరిచివున్న బోరుబావిలో పడిపోయాడు. స్నేహితులు ఈ విషయాన్ని ప్రిన్స్‌ కుటుంబసభ్యులకు తెలిపారు. కొడుకు బోరు బావిలో పడిపోయాడని తెలియగానే వారంతా నిస్తేజంగా మారిపోయారు. కొద్దిసేపటికే అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చిన్నారి ప్రిన్స్‌ను రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. 

ప్రభుత్వ అధికారులు సైన్యం సహాయాన్ని కోరారు. వెంటనే భారత సైన్యం ఘటనాస్థలికి చేరుకుని, సహాయక చర్యలు మొదలుపెట్టింది. చీకట్లో ప్రిన్స్ భయపడకుండా ఉందేందుకు సైన్యం మొదట బోర్‌వెల్‌లో లైట్లు ఏర్పాటు చేసింది. అనంతరం అతనికి తాడు సహాయంతో బిస్కెట్లు, నీళ్లు, జ్యూస్‌ అందించారు. దాదాపు 50 గంటల పాటు శ్రమించిన అనంతరం సైన్యం ప్రిన్స్‌ను సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. 

ప్రిన్స్‌ను బోర్‌వెల్‌లో నుంచి బయటకు తీసుకువచ్చేందుకు ఆర్మీ సిబ్బంది ఆ బోర్‌వెల్ దగ్గర సొరంగం నిర్మించింది. ఈ మార్గం గుండా సైన్యం ప్రిన్స్‌ దగ్గరకు చేరుకుంది. ఆ బాలుడిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది.  ఆ సమయంలో దేశ ప్రజలంతా ప్రిన్స్‌ క్షేమం కోరుతూ ప్రార్థనలు, పూజలు చేశారు. ప్రస్తుతం ప్రిన్స్‌ పాఠశాలలో చదువుకుంటున్నాడు. ఈ ఘటన అనంతరం ప్రిన్స్‌ ఉంటున్న గ్రామాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ప్రిన్స్‌ పేరుతో వచ్చిన పరిహారంతో ఆ బాలుని కుటుంబం ఇల్లు నిర్మించుకుంది. 
ఇది కూడా చదవండి: కేబీసీలో చిచ్చరపిడుగుకు కోటి రూపాయలు

మరిన్ని వార్తలు