హింసాత్మకంగా మారిన అసోం, మిజోరాం సరిహద్దు వివాదం

26 Jul, 2021 21:29 IST|Sakshi

న్యూఢిల్లీ: అసోం, మిజోరాం సరిహద్దు వివాదం హింసాత్మకంగా మారింది. ఈ ఘర్షణలో ఆరుగురు పోలీసులు మృతిచెందారు. మిజోరం పోలీసుల కాల్పుల్లో ఆరుగురు అసోం పోలీసులు మృతిచెందినట్లు అసోం ముఖ్యమంత్రి  హిమంత బిస్వా శర్మ తెలిపారు. పోలీసుల మృతి పట్ల సంతాపం ప్రకటించారు. అలాగే కాచర్ ఎస్పీ నింబల్కర్ వైభవ్ చంద్రకాంత్ సహా కనీసం 50  మంది సిబ్బంది కాల్పులు, రాళ్లు రువ్వడంతో గాయపడ్డారని పేర్కొన్నారు. ఈ ఘర్షణ అనంతరం రెండు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులతో హోంమంత్రి అమిత్‌షా మాట్లాడారు. సరిహద్దు వివాదాన్ని పరిష్కరించి, శాంతియుతంగా ఉండాలని సూచించారు

అయితే అస్సాం పోలీసులు మిజోరాంలోని కోలాసిబ్‌ సరిహద్దు దాటి వచ్చిన తరువాతే హింస ప్రారంభమైందని మిజోరాం హోం మినిస్టర్‌ తెలిపారు. అంతేగాక అస్సాం పోలీసులు జాతీయ రహదారిపై తమ వాహనాలను దెబ్బతీశారని, రాష్ట్ర పోలీసులపై కాల్పులు జరిపినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా గత ఏడాది ఆగష్టు మాసంలో ఈ రెండు రాష్ట్రాల మధ్య  సరిహద్దు వివాదం మొదలవ్వగా. ఈ రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం కారణంగా అసోంలోని కచార్, మిజోరాంలోని కోలాసిబ్‌ సరిహద్దులో ఇవాళ హింసాత్మక ఘటనలు చోటు చేసుకొన్నాయి. రెండు రాష్ట్రాల మధ్య సోమవారం దాదాపు యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరువైపులా వాహనాలను ధ్వంసం చేశారు. సమస్య పరిష్కారం అయ్యేదాకా సరిహద్దు గుండా ప్రయాణించొద్దంటూ కార్లు, బైకులను చిత్తుచిత్తు చేశారు. దాడుల ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి.

సదరు వీడియోలను కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ట్యాగ్ చేస్తూ మిజోరాం, అస్సాం ముఖ్యమంత్రులు ట్విటర్‌లనే మాటల యుద్ధం చేసుకున్నారు. ‘‘అమిత్‌షా గారూ... దయచేసి ఈ విషయాన్ని పరిశీలించండి.. దీనికి ముగింపు కావాలి'' అంటూ మిజోరం సీఎం జోరమంతుంగా రాయగా, ‘‘గొడవలు సద్దుమణిగే వరకూ పోలీస్ పోస్టులను వదిలేసి వెళ్లాలని మిజోరాం ఎస్పీ సూచిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో మేం ప్రభుత్వాన్ని ఎలా నడుపుతాం?'' అంటూ అస్సాం సీఎం హిమంత శర్మ కూడా అమిత్ షాకు ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు