బెంగాల్, అస్సాంలలో అధికారం మాదే

29 Mar, 2021 04:49 IST|Sakshi

తొలి దశలో బెంగాల్‌లో 26, అస్సాంలో 37 సీట్లు గెలుస్తాం

బెంగాల్‌లో బీజేపీ నేతల ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారు

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఆగ్రహం

న్యూఢిల్లీ: శాసనసభ ఎన్నికల్లో భాగంగా తొలి దశలో పశ్చిమ బెంగాల్‌లో 30 స్థానాలకు, అస్సాంలో 47 స్థానాలకు శనివారం ఎన్నికలు జరిగాయి. తొలి దశలో బెంగాల్‌లో 26 స్థానాలు, అస్సాంలో 37 స్థానాలను తాము కచ్చితంగా గెలుచుకుంటామని బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ధీమా వ్యక్తం చేశారు. పార్టీ అంతర్గత వర్గాల నుంచి అందిన సమాచారాన్ని బట్టి తాను ఈ విషయం చెబుతున్నానని వెల్లడించారు. ఆయన ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. 294 అసెంబ్లీ నియోజకవర్గాలున్న బెంగాల్‌లో 200కు పైగా స్థానాలు దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని గుర్తుచేశారు.

లక్ష్యాన్ని తప్పకుండా చేరుకుంటామన్నారు. అస్సాంలో అధికార బీజేపీ కూటమికి ప్రస్తుతం 86 స్థానాలున్నాయి. తాజా ఎన్నికల్లో ఈ సంఖ్యను మరింత పెంచుకుంటామని అమిత్‌ షా చెప్పారు. బీజేపీ ప్రవచించిన పాజిటివ్‌ ఎజెండాకు మద్దతుగా ప్రజలు ఓటు వేస్తున్నారని వ్యాఖ్యానించారు. బెంగాల్‌లో మాతువాల ఓట్ల కోసమే ప్రధాని మోదీ బంగ్లాదేశ్‌లో ఆ వర్గానికి చెందిన ఆలయాన్ని సందర్శించారంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన విమర్శలను తిప్పికొట్టారు. ఆలయాన్ని సందర్శించడానికి, ఎన్నికలకు సంబంధం లేదన్నారు. భారత్‌–బంగ్లాదేశ్‌ మధ్య సంబంధాలు బలపడాలన్నదే ప్రధానమంత్రి లక్ష్యమన్నారు.

వరదల రహిత రాష్ట్రంగా అస్సాం
మహారాష్ట్రలో ఎన్సీపీ నేతలతో తాను సమావేశం కాబోతున్నానంటూ వచ్చిన వార్తలపై స్పందించేందుకు అమిత్‌ షా నిరాకరించారు. అన్ని విషయాలు బహిరంగంగా చెప్పలేమని అన్నారు. బెంగాల్, అస్సాంలో తొలి దశలో భారీగా ఓటింగ్‌ నమోదు కావడం తమకు సానుకూల అంశమని వ్యాఖ్యానించారు. బెంగాల్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. అక్రమ వలసదారులను రాష్ట్రంలోకి యథేచ్ఛగా అనుమతిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని, అభివృద్ధి ఆగిపోయిందని దుయ్యబట్టారు. అందుకే బెంగాల్‌లో ‘సోనార్‌ బంగ్లా’ అనే ఎజెండాతో ప్రధాని నరేంద్ర మోదీ ముందుకొచ్చారని అన్నారు. మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్‌లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిని గెలిపించాలని ఓటర్లకు అమిత్‌ షా విజ్ఞప్తి చేశారు. అస్సాంలో మళ్లీ అధికారంలోకి వస్తే వరదల రహిత రాష్ట్రంగా మారుస్తామని హామీ ఇచ్చారు.  

మా నేతల ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారు
బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని అమిత్‌ షా ఆరోపించారు. తమ పార్టీ నేతల ఫోన్లను ట్యాప్‌ చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ నాయకులు ముకుల్‌ రాయ్, శిశిర్‌ బజోరియా మాట్లాడుకున్నట్లుగా టీఎంసీ విడుదల చేసిన ఓ ఫోన్‌ కాల్‌పై అమిత్‌ షా స్పందించారు. వారు మాట్లాడుకున్న దాంట్లో రహస్యమేదీ లేదన్నారు. పోలింగ్‌ ఏజెంట్‌ స్థానికుడే కావాల్సిన అవసరం లేదని గతంలోనే ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఇది తెలుసుకోవడానికి ఫోన్‌ ట్యాపింగ్‌ అవసరం లేదని వ్యాఖ్యానించారు.  

మరిన్ని వార్తలు